Christmas Special 2024: ఆసియాఖండంలోనే అతి పెద్ద చర్చి... తెలంగాణలో ఎక్కడ ఉందంటే..

ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చి తెలంగాణలో పేరుగాంచింది.  ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద చర్చిగా గుర్తింపుపొందింది.   ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కరుణాపురంలో ఉన్న క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 9 ఎకరాల్లో ఈ చర్చిని నిర్మించారు.  ఈ చర్చి నిర్మాణానికి దాదాపు రూ. 150 కోట్లను ఖర్చు చేశారు.  మొదట రేకులతో నిర్మించాలని నిర్వాహకులు భావించారు.  అయితే ఇది ఎవరూ ఊహించని రీతిలో అద్భుత నిర్మాణంగా రూపు దిద్దుకుంది. ఈ చర్చిలో ఒకేసారి దాదాపు 30 వేల మంది ప్రార్థన చేసుకొనూ సౌకర్యం ఉంది. ఈ చర్చి నిర్మాణానికి ఏడు సంవత్సరాలు పట్టింది.  

క్రీస్తు జ్యోతి చర్చి నిర్మాణానికి విదేశీ టెక్నాలజీ.. ప్రత్యేకమైన మెటీరియల్ తో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించారు. వియత్నాం మార్బుల్స్... అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న అల్యూమినియం డోమ్... ప్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టం  వంటి మెటీరియల్ ను వాటి సర్వంగ సుందరంగా నిర్మించారు.  పిల్లర్స్ నిర్మాణంలో హాలెండ్ టెక్నాలజీని వినియోగించారు. ఇక ఈ ప్రార్థన మందిరంలో చుట్టూ ఏర్పాటు చేసిన దీప స్థంబాలు వేటికవే ప్రత్యేకం. దీని నిర్మాణంలో జెరూ సలేం నుంచి తెచ్చిన మట్టిని వినియోగించారు. భవన నిర్మాణానికి ముందు శంకుస్థాపనలో వజ్రాలను వేశారు. లోపల ముత్యాలతో పొదిగిన బైబిల్ లోని రూపాలు ఉన్నాయి.


చర్చి ప్రాంగణంలో ఇజ్రాయిల్ నుంచి తీసుకొచ్చిన 16 వందల ఏళ్ల నాటి ఆలివ్ చెట్లను పెంచుతున్నారు.    ఈ ప్రార్థన మందిరం ఇంత అద్భుతంగా రూపుదిద్దుకోవడంలో ఫాదర్ పాల్సన్ రాజ్ కీలక భూమిక పోషించారు. ఫాదర్ పాల్సన్ రాజ్ సాక్షాత్తు ఏసుక్రీస్తు తాము ఎవరు ఊహించని విధంగా ఈ చర్చి నిర్మాణానికి దోహదం చేశారని ప్రపంచంలోనే గుర్తింపు పొందే విధంగా చర్చి నిర్మాణం వెనుక ఈ అద్భుతమైన కళా సంపద సృష్టి వెనుక ఏసుక్రీస్తు ఉన్నాడని చెబుతున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏసుక్రీస్తు జన్మను తెలియజేసేలా పశువుల పాకలో ఏర్పాటు చేసిన బాల యేసు పుట్టుక ఘట్టం ప్రస్తుతం ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇందులో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఈజిప్ట్ నుంచి తెప్పించారు. ఇన్ని విశేషాలు ఉన్న క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వచ్చాయి. క్రైస్తవుల కోసం ఇంత గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ ఏర్పాటు కావడంతో దేశ విదేశాల నుండి ప్రముఖులు వస్తున్నారు.