జగిత్యాల, వెలుగు: జగిత్యాల అర్బన్ తహసీల్ ఆఫీస్ లో రెవెన్యూ రికార్డులు ట్యాపరింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు గురువారం బాధితులు తహసీల్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. గతంలో రెవెన్యూ ఆఫీస్‌లో పనిచేసిన ఓ అధికారి తనకున్న అర గుంట భూమిని గుంటన్నరగా మార్చినట్లు ఆఫీసర్లు గుర్తించారు. జగిత్యాల అర్బన్ లోని మోతె గ్రామంలో 164/ఇ పెద్ది రాజు పేరిట అర గుంట స్థలాన్ని గుంటన్నరగా ట్యాంపరింగ్ చేసి, నర్ర రమేశ్ పేరిట మార్చాడు.
అయితే పక్కన ఉన్న బొల్లం నర్సమ్మ స్థలాన్ని తన కొడుకులైన బొల్లం అజయ్, బొల్లం కిరణ్ పై గిఫ్ట్ డిడ్ చేసుకున్నారు. సదరు నర్ర రమేశ్.. తన స్థలమంటూ గొడవ చేస్తున్నాడని బొల్లం అజయ్, కిరణ్ కలెక్టరేట్‌లో ఇటీవల ఫిర్యాదు చేయగా.. కలెక్టర్ ఎంక్వైరీకి చేయాలని అర్బన్ తహసీల్దార్‌ను ఆదేశించారు. ఎంక్వైరీ చేపట్టిన రెవెన్యూ ఆఫీసర్లు 2023–24 లో రికార్డులు ట్యాంపరింగ్ అయినట్లు గుర్తించి, కలెక్టర్‌కు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.