యాదగిరిగుట్టలో సామూహిక గిరిప్రదక్షిణ

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా.. శనివారం దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక గిరిప్రదక్షిణ నిర్వహించారు. తెల్లవారుజామున   5 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద నారసింహుడి పాదాలకు ఆలయ ఈవో భాస్కర్ రావు ప్రత్యేక పూజలు చేసి గిరిప్రదక్షిణ ప్రారంభించారు.  

ఈఓ భాస్కర్ రావుతో పాటు ఆలయ ఆఫీసర్లు, ఎస్పీఎఫ్ సిబ్బందితో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రెండున్నర కిలోమీటర్లు కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేశారు. అనంతరం కొండపైకి చేరుకుని గర్భగుడిలో   నారసింహుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. 

ఆలయంలో స్వాతినక్షత్ర పూజలు

లక్ష్మీనరసింహ స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శతఘటాభిషేకం చేపట్టారు. ప్రధానాలయ ముఖ మంటపంలో 108 కలశాలను వరుస క్రమంలో పేర్చి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలశాలలో మంత్రపూరితమైన జలంతో లక్ష్మీనారసింహులనుఅభిషేకించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.