ఆందోళనలు ఆపి తక్షణమే విధుల్లో చేరండి: సుప్రీం కోర్టు

డాక్టర్లు ఆందోళనలు ఆపి ముందు విధుల్లో చేరాలని సూచించింది సుప్రీం కోర్టు.. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్  ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం హత్యకు సంబంధించిన కేసును ఇవాళ సుప్రీం కోర్టు మరోసారి విచారించింది.  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా  డాక్టర్లు విధుల్లో చేరాలని ఆదేశించింది. విధుల్లో చేరాక అధికారులు చర్యలు తీసుకోకుండా తాము చూసుకుంటామని చెప్పింది. డాక్టర్లు విధుల్లో చేరకపోతే రోగులు ఇబ్బందిపడతారని సూచించింది. వైద్యుల ఆందోళనతో పేదలు నష్టపోవద్దని  తెలిపింది. నేషనల్ టాస్క్ ఫోర్స్ ద్వారా వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని న్యాయస్థానం వైద్యుల ప్రతినిధులకు హామీ ఇచ్చింది. 

 మరో వైపు   డాక్టర్‌పై లైంగికదాడి, హత్య కేసు స్టేటస్ రిపోర్టును సీబీఐ, బెంగాల్ పోలీసులు సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టులో దాఖలు చేశాయి. సీబీఐ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను సీల్డ్ కవరులో సుప్రీంకోర్టుకు అందజేశారు. అందులో నిందితుడు సంజయ్ రాయ్‌ను విచారించడంతోపాటు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ ఇంటరాగేషన్ వివరాలను వెల్లడించారని సమాచారం.  

ఈ నేరంలో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడా.. లేక కుట్ర వెనుక మరికొంత మంది ఉన్నారా అనే విషయాలను సీబీఐ తన స్టేటస్ రిపోర్ట్ ద్వారా కోర్టుకు వివరించినట్టు తెలుస్తోంది. ఎంత మంది నిందితులు అత్యాచారం-హత్యకు పాల్పడ్డారు? ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైన సమాచారం ఏమిటి? మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పాత్ర ఏమిటి? పోలీసుల విచారణలో తప్పేంటి అనే అంశాలు సీబీఐ సర్వోన్నత న్యాయస్థానానికి దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టులో పేర్కొనే అవకాశం ఉంది.