- జిల్లాలో 3.30 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి
- ఇందులో 2.50 లక్షల టన్నులు సన్నాలే
- ఇప్పటివరకు సెంటర్లకు వచ్చింది 2,023 టన్నులే
- రైతుల దగ్గరికే వెళ్లి కాంటా పెడుతున్న వ్యాపారులు
- సర్కారు బోనస్ ఎఫెక్ట్‌తో ఎమ్మెస్పీ కంటే ఎక్కువే చెల్లింపు
మంచిర్యాల, వెలుగు: సన్న వడ్లకు క్వింటాలుకు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించడంతో ఈసారి రైతులు పెద్ద సంఖ్యలో సన్న వడ్లు సాగు చేశారు. మంచిర్యాల జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 1.60 లక్షల ఎకరాలకు గాను దాదాపు 80 శాతం అంటే 1.28 లక్షల ఎకరాల్లో సన్న రకాలు వేశారు. మిగతా 20 శాతం 32 వేల ఎకరాల్లో మాత్రమే దొడ్డు వడ్లు పండించారు. తద్వారా 3.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.
జిల్లాలో 326 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ సన్నాలు ఆశించిన స్థాయిలో సెంటర్లకు రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.
సన్నాలు 2,023 టన్నులే..
జిల్లాలో ఇప్పటివరకు 315 కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసి వడ్లు కాంటా వేస్తున్నారు. ఆదివారం వరకు 13,380 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, ఇందులో సన్నాలు 2,023 టన్నులు మాత్రమే. జిల్లాలో అత్యధికంగా జైశ్రీరాం సాగైనట్టు అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం 33 రకాలను సన్నాలుగా గుర్తించి క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించింది. అయినప్పటికీ సన్న వడ్లు సెంటర్లకు రావడం లేదు.
సాగు విస్తీర్ణాన్ని బట్టి చూస్తే దాదాపు 2.50 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు దిగుబడి రావాలి. రైతులు కొంత తిండికి దాచుకోగా, మిగిలిన వడ్లకు ఓపెన్ మార్కెట్లో డిమాండ్ ఉండడంతో మిల్లర్లు, వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. జిల్లాలో 80 శాతం సన్నాలు సాగు చేస్తే, ఇప్పటివరకు 15 శాతం లోపే దిగుబడి సెంటర్లకు రావడం గమనార్హం.
పోటాపోటీగా కొనుగోళ్లు
జిల్లాలో రైస్ మిల్లర్లు, వ్యాపారులు సన్న వడ్లను పోటాపోటీగా కొనుగోలు చేస్తున్నారు. మాయిశ్చర్, క్వాలిటీ వంటివి పట్టించుకోకుండా రైతుల దగ్గరికే వెళ్లి కాంటా వేస్తున్నారు. డబ్బులు కూడా స్పాట్లోనే చెల్లిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలంటే ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. 17 శాతం తేమతో పాటు తప్ప, తాలు, మట్టి లేకుండా వడ్లను క్లీన్ చేయాలి.
Also Read :- పెండింగ్ స్కాలర్షిప్‌లు విడుదల చేయాలి
సెంటర్లలో వడ్లు కుప్పలు పోసి కాంటా కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాలి. ఆ తర్వాత మిల్లుకు తరలించేంత వరకు రైతులదే బాధ్యత. పైగా మిల్లుల్లో బస్తాకు ఒకటి రెండు కిలోలు కోతలు తప్పవు. ట్రాన్స్పోర్ట్, హమాలీ చార్జీలు రైతులే భరించాల్సి ఉంటుంది. ఇన్ని తిప్పలు పడి సెంటర్లలో అమ్ముకోవడం కంటే.. కోసిన వెంటనే వ్యాపారులకు అమ్ముకొని ఊపిరిపీల్చుకుంటున్నారు.
బోనస్ ఎఫెక్ట్‌తో గిట్టుబాటు రేటు
సర్కారు సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించడంతో ఓపెన్ మార్కెట్లో సన్న వడ్లకు గిట్టుబాటు రేటు దక్కుతోంది. సెంటర్లలో ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్– ఏ రకానికి క్వింటాలుకు రూ.2,320, బోనస్ రూ.500లతో కలిపి రైతులకు రూ.2,820 వస్తున్నాయి. మిల్లర్లు, వ్యాపారులు జైశ్రీరాం, ఇతర రకాలకు క్వింటాలుకు రూ.3వేల పైనే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం 33 రకాలను సన్నాలుగా గుర్తించినప్పటికీ బియ్యం గింజ పొడవు 6 మిల్లీమీటర్లు
మందం 2.5 మిల్లీమీటర్లు ఉంటేనే సన్నాలుగా పరిగణిస్తోంది. జిల్లాలో పండించిన చాలా వెరైటీలు ఆ కొలతల ప్రకారం లేకపోవడంతో సెంటర్లలో సన్నాలుగా గుర్తించడం లేదు. దీంతో రైతులు రూ.500 బోనస్ కోల్పోతున్నారు. చాలామంది రైతులు ప్రైవేట్ ట్రేడర్లకు అమ్మడానికి ఇది కూడా ఒక కారణమే.
డీఫాల్ట్ మిల్లర్లు సైతం
పెద్దమొత్తంలో సీఎమ్మార్ పెండింగ్ ఉన్న మిల్లులను డీఫాల్ట్ లిస్టులో చేర్చిన ప్రభుత్వం ఈ సీజన్లో వాటికి వడ్లు ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో 54 రైస్ మిల్లులు ఉండగా, 39 మిల్లులు డీఫాల్ట్ లిస్టులో చేరాయి. ఇప్పటివరకు బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చిన 14 మిల్లులకే వడ్లు కేటాయిస్తున్నారు.
ఈ కారణంగా డీఫాల్ట్ మిల్లర్లు సైతం పెద్ద మొత్తంలో సన్నాలు కొనుగోలు చేస్తున్నారు. వాటిని మిల్లింగ్ చేసి ఓపెన్ మార్కెట్లో బియ్యం అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
13,380 టన్నుల కొనుగోళ్లు
జిల్లాలో ఈ సారి 3.26 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నాం. 326 సెంటర్లకు గాను 315 ఓపెన్ చేశాం. ఇప్పటివరకు 13,380 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. సన్నాలు 2,023 టన్నులు మాత్రమే వచ్చాయి. 936 మంది రైతుల ఖాతాల్లో రూ.14.31 కోట్ల నగదు జమ చేశాం.
- సబావత్ మోతీలాల్, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)