ఆర్డీవో ఆఫీస్ లో ఓఆర్సీల దందా!

  • నాలుగు నెలల్లో 800 ఎకరాలకు సర్టిఫికెట్లు
  •  డిమాండ్ ను బట్టి ఎకరాకు రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు
  • 40 ఎకరాల -ఎండోమెంట్  భూములకు సైతం ఓర్సీలు

గద్వాల, వెలుగు: గద్వాల ఆర్డీవో ఆఫీస్ లో ఓఆర్సీల (ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్) దందా జోరుగా కొనసాగుతోంది. ప్రైవేట్ వ్యక్తులను ముఠాగా ఏర్పాటు చేసి ఈ దందాను ఆఫీసులో కీలకంగా ఉండే ఓ ఉద్యోగి సాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమికి మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను బట్టి ఎకరాకు పదివేల నుంచి లక్ష రూపాయలు వరకు తీసుకొని ఓఆర్సీలు ఇస్తున్నారు. ఇప్పటికే నాలుగు నెలల కాలంలోనే దాదాపు 800 ఎకరాలకు సంబంధించి 300కు పైగా ఓఆర్సీలు ఇచ్చారంటే దందా ఏ మేర కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. కోర్టు కేసుల్లో ఉన్నా.. ఎండోమెంట్ భూములు అయినా సరే పైరవీకారులకు డబ్బులు ముట్టచెబితే పని చేసి పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఫైలుకు ఒక రేటును ఫిక్స్ చేసి ఆర్డీవో ఆఫీస్ లో జోరుగా దందా సాగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 

పైరవీకారులు చెప్పిందే ..

శాంతినగర్  మండలం రామాపురానికి చెందిన ఒక వ్యక్తితో పాటు మక్తల్, జమ్మిచెడుకు చెందిన వ్యక్తులు ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాత హౌసింగ్ బోర్డ్ కాలనీ, కొత్త హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో ఇండ్లను కిరాయికి తీసుకొని ఆఫీసులో ఉండాల్సిన ఫైళ్లను అక్కడికి తీసుకెళ్లి ఆఫీసర్లతో క్లియర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 24 గంటల పాటు ఆర్డీఓ ఆఫీస్ పరిసరాల్లో  తిరుగుతూ అక్కడికి వచ్చే వారితో మాట్లాడి బేరం కుదుర్చుకొని పనులు కంప్లీట్ చేస్తున్నారు. ఓ రెవెన్యూ ఆఫీసర్ కు క్యాంప్ ఆఫీస్ ఉన్నప్పటికీ అక్కడ ఉండకుండా కొత్త హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇల్లు రెంటుకు తీసుకొని అక్కడే ఈ పైరవీ కారులతో దందా కొనసాగిస్తున్నారని ఆర్డీఓ ఆఫీస్ లోనే చర్చించుకుంటున్నారు.  

ఫైల్ కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే

ఆర్డీవో ఆఫీస్ లో ఏదైనా ఫైల్ కదలాలంటే సంబంధిత పైసలు ఇవ్వాల్సిందేనని పలువురు ఆరోపిస్తున్నారు.  నేరుగా ఆఫీసర్లకు డబ్బు ఇచ్చిన సరే లేదంటే వారు ఏర్పాటు చేసుకున్న వారి చేతులు తడిపినా పని అయిపోతుందని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఎన్ని రోజులు ఆఫీస్ చుట్టూ తిరిగిన పని కావడం లేదని అదే పైరవీకారులను కలిసిన వెంటనే ఇట్టే పని అయిపోతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రతి పనికి ఒక రేట్ ఫిక్స్ చేసి డబ్బులు వసూలు చేస్తూ ఆఫీస్ మొత్తాన్ని అవినీతిమయంగా మార్చేశారనే విమర్శలు ఉన్నాయి.

నాలుగు నెలల్లో 300కు పైగా ఓర్సీలు

జోగులాంబ గద్వాల జిల్లాలో నాలుగు నెలల కాలంలోనే 300కు పైగా ఎనిమిది వందల ఎకరాలకు సంబంధించి ఓ ఆర్ సి లు ఇచ్చారని తెలుస్తోంది. గద్వాల శివారులోని సర్వే నంబర్ 879లోఉన్న భూమి పై  కోర్టులో కేసు పెండింగ్ ఉంది. రూ. 3 లక్షల వరకు డబ్బులు తీసుకొని కొంత భూమిని నాలా కన్వెన్షన్ చేసి పర్మిషన్ ఇచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు.  దీంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కోర్టులో ఉన్న భూమికి నాలా కన్వెన్షన్  ఎలా చేశారని అడిగితే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని బాధితులు వాపోయారు. ఇనాం భూముల్లో భాగస్తులకు తెలియకుండానే చాలామంది పేర్లపై ఓర్సీలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.

ఎండోమెంట్ భూములు సైతం అన్యాక్రాంతం

ఎండోమెంట్ భూములకు సైతం ఓ ఆర్ సీ లు ఇచ్చేసి అన్యాక్రాంతం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటిక్యాల మండలం పెద్దదిన్నె శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు 541 ఎకరాల భూమి ఉంది. సర్వే నంబర్ 341లో 20 ఎకరాల 33 గుంటలు, 349 సర్వే నంబర్లు 7 ఎకరాల 35 గుంటలు కంసాలి వృత్తి చేసే వారికి కేటాయించారు. ఎవరికి తెలియకుండా 2024 జూన్ నెలలో ఇతరులకు ఓఆర్‌‌‌‌‌‌‌‌ సీ ఇచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎండోమెంట్ భూములు అమ్మడం కొనడం నేరం అయినప్పటికీ ఓ పై ఆఫీసర్ పెద్ద ఎత్తున డబ్బులు దండుకొని ఏకపక్షంగా పైకి ఓఆర్‌‌‌‌‌‌‌‌ సీ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల అదే గుడికి సంబంధించి ఐదు ఎకరాల ఎండోమెంట్ భూమిని కూడా ఇతరులకు ధారాదత్తం చేశారని 
ఆరోపిస్తున్నారు.

కాంట్రాక్ట్ ఉద్యోగానికి సైతం డబ్బులే

ఆర్డీఓ ఆఫీస్ లో ఇటీవల కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాలుగు పోస్టులను భర్తీ చేశారు.  ఒక్కొక్క పోస్టుకు రూ. మూడు లక్షలు డబ్బులు తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నేరుగా పోస్టులను ఎలా భర్తీ చేస్తారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.  కొందరు ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ డబ్బులు ఇచ్చిన వారిని ఉద్యోగాల్లో  పెట్టుకుంటున్నారని విమర్శలు 
వినిపిస్తున్నాయి.

ఎంక్వయిరీ చేస్తాం:  ఆర్డీఓ ఆఫీస్ లో అవినీతి జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఎంక్వయిరీ చేస్తాం. అన్యాయం జరిగిందని బాధితులు ఎవరైనా ముందుకొచ్చి కంప్లైంట్ చేస్తే దీనిపై మరింత లోతుగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం. ప్రైవేట్ వ్యక్తులు ఆఫీసులో ఉండడానికి వీలు లేదు.  కిరాయి ఉన్న ఇంట్లో ఫైల్స్ ఉన్న విషయంపై కూడా దృష్టి పెట్టి అన్ని వివరాలు సమగ్రంగా తెలుసుకొని బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
లక్ష్మీనారాయణ అడిషనల్ కలెక్టర్ గద్వాల