తోపుడు బండ్లతో రోడ్లు ఇరుకు

  • రోడ్లపైనే తోపుడు బండ్లు, వాహనాల పార్కింగ్ 
  • పట్టించుకోని మున్సిపల్, పోలీసు శాఖలు
  • అవస్థలు పడుతున్న ప్రజలు, వాహనదారులు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలోని రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండటంతో వాహనాలు, కాలినడకన వెళ్లే ప్రజలకు ప్రమాదకరంగా మారింది. నాలుగేళ్ల క్రితం ఆదిలాబాద్ పట్టణాన్ని దాదాపు రూ. 80 కోట్లతో విశాలమైన రోడ్లు, లైటింగ్, డివైడర్లు నిర్మించి సుందరీకరణ చేపట్టారు. ప్రధానమైన మార్కెట్ ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఈ సుందరీకరణకు తర్వాత కూడా  రోడ్లపై ఎటు చూసిన తోపుడు బండ్లు, వాహనాలు పార్కింగ్ తో సగం రోడ్డు కనిపించకుండా పోయింది. ప్రస్తుతం పట్టణం జనాభాతో పాటు వ్యాపార సంస్థలు రోజురోజుకు విస్తరించాయి. ఆదిలాబాద్ పట్టణం ఏ గ్రేడ్ మున్సిపాలిటీగా మారింది. అంతే వేగంగా ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. 

 ఆ సమస్యను పరిష్కరించే వారే కరువయ్యారు.  ప్రస్తుతం పట్టణ జనాభా సుమారు 1.80 లక్షలు ఉంటుంది. నిత్యం 10 వేలకు పైగానే వాహనాలు తిరుగుతాయి.  గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్, నేతాజీ చౌక్, వినాయక్ చౌక్ లలో రోడ్డు, మధ్యలో పెద్ద డివైడర్లు ఏర్పాటు చేశారు. దీంతో రోడ్లు వెడల్పు తగ్గిపోగా.. ఇరువైపులా వ్యాపారులు, మార్కెట్ కు వచ్చే వాహనాదారులు షాపుల ముందే బండ్లు పెడుతున్నారు. మరో పక్క సగం రోడ్డును ఆక్రమించుకొని తోపుడు బండ్లు చిరువ్యాపారులు వ్యాపారం చేస్తున్నారు. ఒకపక్క షాపుల ముందు పెట్టే వాహనాలు..  మరో పక్క డివైడర్‌‌‌‌‌‌‌‌కు ఆనుకొని సగం రోడ్డు ఆక్రమించిన వ్యాపారాలు చేస్తున్నారు.  దీంతో వాహనాలు వెళ్లేందుకు, కనీసం నడవాలన్న ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా లోడింగ్ అన్ లోడింగ్ చేస్తూ ట్రాఫిక్ కొత్త సమస్య తీసుకొస్తున్నారు. 

పట్టించుకోని అధికారులు..

అశోక్ రోడ్డు తో  పాటు గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్, తాంసి బస్టాండ్, నేతాజీ చౌక్ ప్రధాన మార్కెట్ ప్రాంతాలు. అటు పట్టణ జనంతో పాటు నిత్యం వేల సంఖ్యలో గ్రామీణా ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతో ఈ చౌక్ లన్నీ రద్దీగా మారుతాయి. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఆదిలాబాద్ ట్రాఫిక్ సమస్య పరిష్కరించడంలో ఇటు బల్దియా, పోలీసు శాఖ ల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మున్సిపల్ అధికారులు రోడ్లపై చిరువ్యాపారాలను తొలగించడం లేదు. పోలీసులు సైతం ట్రాఫిక్ పై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

పత్తాలేని పార్కింగ్ జోన్..

ఆదిలాబాద్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ అనుగుణంగా పార్కింగ్ జోన్ లు ఏర్పాటు చేయాల్సి ఉంది. మూడేళ్ల క్రితం బల్దియా అధికారులు లీజులో ఉన్న గణేశ్ థియేటర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ పార్కింగ్ జోన్ ఏర్పాటు చేసి, ఏజెన్సీల ద్వారా నిర్వహణ చేపట్టి బల్దియానికి ఆదాయం సమకూర్చాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు పార్కింగ్ జోన్ ల ఏర్పాటు పత్తాల లేకుండా పోయింది. గణేశ్ థియేటర్ తో పాటు మరికొన్ని చోట్ల సైతం బల్దియా ఖాళీ స్థలాల్లో పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్య తీరే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

అశోక్ రోడ్డు నుంచి గాంధీ చౌక్ వెళ్లే ఈ మార్గం నిత్యం రద్ధీగా కనిపిస్తుంది. అయితే రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ కు ఆనుకొని చిరువ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నారు. అసలే ఇరుకుగా ఉన్న రోడ్డుపై అధ్వానంగా మారగా.. ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. గాంధీ చౌక్ నుంచి శివాజీ చౌక్, అంబేద్కర్ చౌక్ లకు వెళ్లే మార్గాలు సైతం రోడ్డు కనిపించకుండా ఆక్రమించుకున్న వ్యాపారాలు, పార్కింగ్ చేసిన వాహనాలు నిత్యం దర్శనమిస్తున్నాయి.