- జిల్లా ఏటా నమోదవుతున్న వేల సంఖ్యలో కేసులు
- జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల సర్కిళ్ల పరిధిల్లోనే ఎక్కువ
- వీటి పరిధిలో ఒక్కో స్టేషన్‌పరిధిలో 500కు పైగా కేసులు
- సిబ్బంది కొరతతో కేసులపై దృష్టి పెట్టలేకపోతున్న పోలీసులు
- పోలీస్ స్టేషన్ల అప్‌గ్రేడ్‌తోనే చెక్
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో పెరుగుతున్న క్రైమ్ రేట్ టెన్షన్ పెంచుతోంది. ఏటా అన్ని స్టేషన్ల పరిధిలో వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండడం కలవరం రేపుతోంది. ముఖ్యంగా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి సర్కిళ్ల పరిధిలోనే సగటున ఏడాదికి 500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో సిబ్బంది కొరతే కేసుల నియంత్రణకు అడ్డంకిగా మారింది. దీంతో నేర నియంత్రణపై పోలీసులు దృష్టి పెట్టలేకపోతున్నారు. పోలీస్‌స్టేషన్ల అప్‌గ్రేడ్‌తోపాటు సిబ్బందిని పెంచితేనే నేరాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
పెండింగ్‌లోనే పోలీస్ స్టేషన్ల అప్‌గ్రేడ్
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో జనాభా పెరుగుదలతోపాటు క్రైమ్ రేట్ పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ దందాలు, గంజాయి వినియోగం కూడా నేరాలు పెరగడానికి కారణమవుతోంది. ఆయా పట్టణాల్లో రియల్ ఎస్టేట్ దందాల్లో బయటపడుతున్న విభేదాలు హత్యలకు దారితీస్తున్నాయి. దీంతోపాటు గంజాయి వినియోగంతో యువతలో నేర ప్రవృత్తి పెరుగుతోంది. దీనివల్ల చోరీలు, మర్డర్లు, ఘర్షణలు పెరుగుతున్నాయి. కాగా కొన్నేళ్లుగా జగిత్యాలలో ట్రాఫిక్, కోరుట్ల, మెట్‌పల్లి, మల్యాల, ధర్మపురి, రాయికల్ పోలీస్ స్టేషన్ల ను అప్‌గ్రేడ్ చేయాలన్న డిమాండ్ ఉంది. దీంతోపాటు జిల్లాకేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. వీటిలో మెట్‌పల్లి, కోరుట్ల పోలీస్ స్టేషన్ల అప్ గ్రేడ్ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి.
మూడు సర్కిళ్ల పరిధిలోనే కేసులు అధికం
జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మూడు సర్కిళ్ల పరిధిలోని ఒక్కో స్టేషన్‌లో ఏటా 500 నుంచి 600 పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఆయా సర్కిళ్ల పరిధిలో పదుల సంఖ్యలో సిబ్బంది కొరత ఉండడంతో డైలీ డ్యూటీకే పరిమితమవుతున్నారు. దీంతో నేర జరిగే అవకాశాలపై దృష్టి పెట్టలేకపోతున్నామని పోలీసులే చెబుతున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, ఇతర బందోబస్తులకు పెద్దసంఖ్యలో సిబ్బంది కేటాయించాల్సిన పరిస్థితి. దీనికి తోడు గంజాయి కేసులు, భార్యభర్తల అంశాలు, మర్డర్ కేసులు కూడా పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి.
వీటిని అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారు. అవసరం ఉన్న చోట స్టేషన్లు అప్‌గ్రేడ్ చేస్తే సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారుల సంఖ్యతోపాటు కానిస్టేబుళ్లు కూడా పెరుగుతారు. దీంతో క్రైమ్ రేట్ నియంత్రణపై దృష్టి పెట్టొచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు కొత్తగా ఉద్యోగంలో చేరిన కానిస్టేబుళ్లతో కొంతవరకు సిబ్బంది కొరత తీరే అవకాశం ఉంది.