విశ్వాసం : గురువును మించిన శిష్యులు

మాతృదేవోభవ... పితృదేవోభవ... ఆ తరువాత ఆచార్య దేవోభవ... అని మన భారతీయ సనాతన ధర్మం చెబుతోంది. తల్లిదండ్రులు దైవస్వరూపాలు. వారి తరువాత.. విద్యను బోధించే గురువు భగవంతునితో సమానం. గురువు నిత్య విద్యార్థి అని దక్షిణామూర్తి స్తోత్రం చెబుతోంది. 
చిత్రం వట తరూర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః 
విద్యార్థి నిత్యం వృద్ధుడిగానే ఉంటాడు, గురువు మాత్రం నిత్యం యువకునిలా ఉంటాడు. శిష్యుడు రకరకాల సందేహాలు అడుగుతుంటాడు. గురువు అన్నిటికీ మౌనంగా వ్యాఖ్యానిస్తూ ఉంటాడు అని అర్థం. అంటే గురువు నిత్యం పఠనంలో నిమగ్నమై ఉంటాడు. అటువంటి గురువుల వద్ద విద్యను అభ్యసించినవారు గురువులను మించిన శిష్యులు అవుతారు. ఇందుకు రామాయణ మహాభారతాలే ప్రత్యక్ష నిదర్శనాలు. 

ముందుగా రామాయణం పరిశీలిద్దాం...

అయోధ్యను పరిపాలించే దశరథునికి... రామలక్ష్మణ భరత శత్రుఘ్నులనే నలుగురు కుమారులు ఉన్నారు.  
ఒకసారి విశ్వామిత్రుడు యాగం చేయ నిశ్చయించుకున్నాడు. ఆ యాగానికి మారీచసుబాహులు ఆటంకం కలిగించడానికి సన్నద్ధులయ్యారు. వారి నుంచి రక్షణ కోసం విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చి, రామలక్ష్మణులను తన వెంట పంపమని దశరథుడిని కోరాడు. అతి కష్టం మీద విశ్వామిత్రుని వెంట వారిని పంపాడు దశరథుడు. 
రామలక్ష్మణులకు బల అతి బల విద్యలు నేర్పాడు విశ్వామిత్రుడు. ఆ విద్యలను సక్రమంగా అభ్యసించారు రామలక్ష్మణులు. ఆ విద్యలను ఉపయోగించి, విశ్వామిత్రుని అనుజ్ఞ మేరకు ముందుగా తాటకిని సంహరించారు. అటు పిమ్మట విశ్వామిత్రుడు యాగం చేస్తున్న సందర్భంలో సుబాహుని సంహరించారు, మారీచుని సముద్రానికి ఆవల పడేలా బాణ ప్రయోగం చేశారు. గురువుల మీద విశ్వాసంతో, గురువుల మీద భక్తిశ్రద్ధలతో విద్యలను అభ్యసించిన రామలక్ష్మణులు... విశ్వామిత్రుని శిష్యులు అని కాకుండా, విశ్వామిత్రుడు రామలక్ష్మణుల గురువు అనిపించుకునే స్థాయికి చేరారు. గురువును మించిన శిష్యులు అనిపించుకున్నారు. 

భారతం పరిశీలిస్తే...

కురుపాండవుల పితామహుడైన భీష్ముడు వీరికి విలువిద్య నేర్పించాలనుకున్నాడు. ఆ సమయంలోనే ద్రోణుడు తారసపడ్డాడు. ద్రోణుడి శక్తిసామర్థ్యాలను గ్రహించిన భీష్ముడు.. ఆయనను గురువుగా నియమించాడు. దుర్యోధనాదులకు, పాండవులకు సమానంగానే విద్య నేర్పాడు ద్రోణుడు. కాని అందరికంటె అర్జునుడు విలువిద్యలో సాటిలేని మేటి పరాక్రముడి స్థాయికి చేరుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో తన గురువులైన ద్రోణాచార్యుని మీద గెలుపు సాధించాడు. ద్రోణాచార్యుని శిష్యుడు అన్న మాట నుంచి, అర్జునుని గురువు ద్రోణాచార్యుడు అనే స్థాయికి ఎదిగాడు అర్జునుడు. 

వివేకానందుడు – రామకృష్ణ పరమహంస

కలకత్తాలో భువనేశ్వరి గర్భాన ప్రభవించాడు నరేంద్రుడు. వయసు పెరుగుతున్న కొద్దీ భగవంతుని కోసం అన్వేషణ ప్రారంభించాడు నరేంద్రుడు. అలా అన్వేషిస్తున్న సమయంలో రామకృష్ణ పరమహంస తారసపడ్డాడు. ఆయన దగ్గర తనకు కావలసిన సమాధానం లభించింది నరేంద్రుడికి. నాటి నుంచి వివేకానందుడిగా మారాడు. గురువులైన రామకృష్ణ పరమహంస బోధలను ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చేశాడు. రామకృష్ణుని శిష్యుడు అని కాకుండా వివేకానందుల గురువులు రామకృష్ణ పరమహంస అనే స్థాయికి చేరుకున్నాడు. అందుకు పరమహంస పరమానందించాడు కూడా.

విశ్వనాథ సత్యనారాయణ – చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి

కవిసమ్రాట్‌‌ విశ్వనాథ సత్యనారాయణ... తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి వద్ద చదువుకున్నారు. గురువును మించిన శిష్యుడు అని పేరు సంపాదించుకున్నారు. నన్నయ, తిక్కన వంటి మహానుభావులకి తన వంటి శిష్యుడు లేడనీ, ఆ గొప్పదనం తన గురువులైన చెళ్లపిళ్ల వంశస్వామికి దక్కిందని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పుకున్నారు విశ్వనాథ. అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదు ఆభోగము...’ అని పద్యం రాసుకుని, చివరలో ‘చెళ్లపిళ్ల వంశస్వామికున్నట్లుగన్‌‌’ అని తన గురువులను స్మరించుకున్నారు. 

పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి దగ్గర ఎంతోమంది విద్యార్థులు సంగీతం అభ్యసించారు. వారిలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రపంచఖ్యాతిని ఆర్జించారు. రామకృష్ణయ్య పంతులు శిష్యుడు అన్న పేరు నుంచి, బాలమురళీకృష్ణ గురువులు అని పిలుచుకునే స్థాయికి ఎదిగారు బాలమురళి. 
శిష్యుల కారణంగా గురువులు ప్రసిద్ధికెక్కారు. అంతేకాదు మంచి గురువు దగ్గర చదువుకుంటే మంచి శిష్యులుగా తయారై, గురువుని మించిన శిష్యులవుతారని పెద్దలు చెప్తున్నారు.

సముద్రంలో ఎన్నో చేపలు, తిమింగలాలు, మొక్కలు... ఉన్నప్పటికీ సముద్రం రత్నాలకు నిలయంగా ఉంటుంది కాబట్టి... సముద్రానికి ‘రత్నాకరము’ అనే పేరు వచ్చింది. సముద్రానికి రత్నాలు అనే మంచి శిష్యులు ఉన్న కారణంగా ఆ శిష్యుని పేరుతో సముద్రం రత్నాకరం అనే మంచి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఆ విధంగా సముద్రుడు అనే గురువును మించిన శిష్యులుగా రూపొందాయి రత్నాలు. 

ద్రోణుడి శక్తిసామర్థ్యాలను గ్రహించిన భీష్ముడు.. ఆయనను గురువుగా నియమించాడు. దుర్యోధనాదులకు, పాండవులకు సమానంగానే విద్య నేర్పాడు ద్రోణుడు. కాని అందరికంటె అర్జునుడు విలువిద్యలో సాటిలేని మేటి పరాక్రముడి స్థాయికి చేరుకున్నాడు.

- డా. పురాణపండ వైజయంతి
ఫోన్ : 80085 51232