జగిత్యాల జిల్లాలో జోరుగా పేకాట

మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌‌పల్లి సబ్‌‌డివిజన్‌‌ శివారులో పేకాట స్థావరాలు జోరుగా కొనసాగుతున్నాయి. మెట్‌‌పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్‌‌‌‌, మేడిపల్లి మండలాల్లో  వ్యాపారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పేకాటలో భాగస్వాములవుతున్నారు. పేకాటరాయుళ్ల నుంచి పోలీసులు ముడుపులు ముడుతుండడంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మెట్‌‌పల్లి, కోరుట్ల పట్టణాల్లోని లాడ్జీలు, శివారు కాలనీల్లోని ఇండ్లను అద్దెకు తీసుకొని పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లోనూ మామిడి తోటలు, ఫామ్ హౌజ్‌‌లు పేకాట అడ్డాగా మారాయి. 

మరికొన్ని గ్రామాల్లో శివారులోని గుట్టలు, అటవీ ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. తరచూ అడ్డాలు మారుస్తూ అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. పేకాట రాయుళ్లకు మందు, విందు సైతం అక్కడే అందిస్తున్నారు. పోలీసులు, కొత్తవారెవరైనా వస్తే ముందస్తు సమాచారం ఇచ్చేందుకు నిర్వాహకులు నాలుగు దిక్కుల్లో సెంట్రీలతో నిఘా ఏర్పాటు చేసుకున్నారు. 

కాగా ఈ పేకాట స్థావరాల్లో ప్రతిరోజూ రూ.40లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బిజినెస్‌‌ నడుస్తున్నట్లు సమాచారం. ఆట స్థాయిని బట్టి నిర్వాహకులు టేబుళ్లను ఏర్పాటు చేసి ఒక్కో టేబుల్‌‌కు రూ.10వే చొప్పున వసూల్‌‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కనీసం రూ.50వేల నుంచి రూ.లక్ష ఉంటేనే పేకాట ఆడేందుకు అనుమతిస్తున్నారు. కాగా ఈ విషయమై మెట్‌‌పల్లి సీఐ నిరంజన్‌‌రెడ్డి మాట్లాడుతూ పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.