కులగణనపై తప్పుడు ప్రచారం .. బీజేపీ, బీఆర్​ఎస్​పై పీపుల్స్ కమిటీ ప్రతినిధుల మండిపాటు

  • వ్యతిరేకించేటోళ్లు ప్రజా ద్రోహులే
  • బీహార్​లో ఓకే అన్న బీజేపీ.. ఇక్కడ వ్యతిరేకిస్తోంది
  • సమగ్ర సర్వే చేసిన బీఆర్ఎస్ కులగణన వద్దంటోందని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న కులగణను వ్యతిరేకించేవారు చరిత్రలో ప్రజాద్రోహులుగా మిగిలిపోతారని పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సస్ ప్రతినిధులు హెచ్చరించారు. కులగణనపై కొన్ని పార్టీలు, కొన్ని సంఘాలు దుష్ప్రచారం చేస్తూ పబ్లిక్​ను తప్పు దోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. వివరాల సేకరణకు వస్తున్న ఎన్యుమరేటర్లను అడ్డుకోవటం సరికాదన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రొఫెసర్లు మురళీ మనోహర్, సింహాద్రి, పీఎల్ విశ్వేశ్వరావు, తిరుమలి, సుదర్శన్ రావు, ఇంజనీర్ దేవళ్ల సమ్మయ్య, సతీష్ , వినోద్, నరేంద్ర బాబు, రాధాకృష్ణ, వేణు, భద్రయ్య, తుల్జారాం సింగ్, భాస్కర్ మీడియాతో మాట్లాడారు. 

సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీని వెనక కొన్ని పార్టీలు, సంఘాల నేతలు ఉన్నారని ప్రొఫెసర్ మురళీ మనోహర్ అన్నారు. అన్ని కులాల జనాభా లెక్కలు తెలుసుకోవటానికి 75 ఏండ్ల తర్వాత కులగణన జరుగుతుంటే అడ్డుకోవటం సరికాదన్నారు. రాష్ట్రంలో రెండు మూడు కులాల వాళ్లే అధికారాన్ని చెలాయించారని, సగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కడంలేదన్నారు.

 ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతున్నా, కొన్ని కులాలకు అభివృద్ధి ఫలాలు అందటం లేదన్నారు. కులాల లెక్కలు తీస్తే ఎవరి జనాభా ఎంత ఉందో తెలుస్తుందని, ఆ లెక్కల ప్రకారం నిధులు కేటాయించవచ్చన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ లు కులగణన చేయాలని సిఫార్సులు చేసినా, కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు చేయలేదన్నారు. ఇపుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే అడ్డు పడుతున్నారని అన్నారు. 2014లో సమగ్ర సర్వే చేసినా.. ఆ లెక్కలను బయటపెట్టలేదన్నారు.

బీఆర్ఎస్, బీజేపీలది రెండు నాల్కల ధోరణి.. 

కులగణన సర్వేతో అన్ని కులాల లెక్కలు బయటకు వస్తాయని.. దాంతో వెనుకబడిన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు. బీసీలకు లోకల్ బాడీల్లో రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. ‘‘సమగ్ర సర్వే చేసిన వాళ్లు ఇపుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నరో అర్థం కావడంలేదు. ఆ లెక్కలను బయటపెట్టలేదు. కలెక్లర్లకు కూడా ఇవ్వలేదు. వారి రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకున్నారు. ఇక బీహార్​లో 
కులగణనను ఒప్పుకున్న బీజేపీ.. తెలంగాణలో మాత్రం వ్యతిరేకిస్తోంది. 

కులగణన చేస్తామని 2019లో రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. తర్వాత సుప్రీంకోర్టులో కేసు ఉందని దాటవేశారు. ఇది వాళ్ల రెండు నాల్కల ధోరణికి నిదర్శనం. కులగణన విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్యుమరేటర్లను అడ్డుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. కులగణనకు అందరూ మద్దతివ్వాలి” అని కోరారు. 

కులగణనతోనే సామాజిక న్యాయం 

కులగణన చేస్తేనే.. ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు, భూములు లేని వాళ్లు, అప్పులు ఉన్నవాళ్లు, వెనకబడిన వర్గాల వాళ్ల వివరాలు తెలుస్తాయని ప్రొఫెసర్ తిరుమలి అన్నారు. కొన్ని పార్టీలు, ఓ సెక్షన్ మీడియా సైతం గణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. రాజకీయంగా ఇన్నేళ్లు ఎవరు ఎక్కువగా పదవుల్లో ఉన్నారు, ఎవరికి అవకాశంరాలేదన్న అంశాలు సర్వేతోనే బయటకు వస్తాయన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు సూచనలతో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల ఇంజనీర్ దేవళ్ల సమ్మయ్య అభినందనలు తెలిపారు.

సమగ్ర సర్వేలోనూ ఇవే ప్రశ్నలున్నయ్.. .

కులగణనలో ఉన్న చాలా ప్రశ్నలు అవసరమే లేదని బీజేపీ, బీఆర్ఎస్ అంటున్నాయని, కానీ జనగణన, సమగ్ర సర్వేలో కూడా ఇలాంటి ప్రశ్నలే ఉన్నాయని ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు అన్నారు. ఈ రెండు పార్టీలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. కులగణన లో సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే కూడా భాగమేనని.. ఈ డేటా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ సుదర్శన్ రావు అన్నారు. సమగ్ర సర్వే చేపట్టిన బీఆర్ఎస్ కులగణనను వ్యతిరేకించటం హాస్యాస్పద మని భారత్ జోడో అభియాన్ కన్వీనర్ కిరణ్ కుమార్ విస్సా అన్నారు.