కాళేశ్వరం మ్యాన్​ మేడ్​ వండరే అయితే ఎట్ల కూలింది? : సీఎం రేవంత్​రెడ్డి

  • ఆ ప్రాజెక్టు కోసమే ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లోని సగం మంది పనిచేసిన్రు
  • వాళ్లపై చర్యలు తీసుకుంటే డిపార్ట్​మెంట్​నే మూస్కోవాల్సిన పరిస్థితి : సీఎం రేవంత్
  • జ్యుడీషియల్​ కమిషన్​ అడిగే ప్రశ్నలకు ఆఫీసర్ల దగ్గర ఆన్సర్లేవి?
  • పొలిటికల్​ ఎగ్జిక్యూటివ్​ తప్పుడు నిర్ణయాలు క్షేత్రస్థాయిలోనే రిజెక్ట్​ కావాలి
  • అట్ల కాకపోతేనే కాళేశ్వరం లాంటి తప్పులు జరుగుతున్నయ్​
  • నెహ్రూ కట్టిన నాగార్జునసాగర్​, శ్రీశైలం ఎన్ని వరదలొచ్చినా బలంగా ఉన్నయ్​
  • లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కండ్ల ముందే కూలింది
  • 687 మంది కొత్త ఏఈఈలకు అపాయింట్​మెంట్​ లెటర్లు అందజేత

హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమెవరో, లోపం ఎక్కడ ఉందో కొత్తగా వచ్చిన ఏఈఈలు తేల్చాలని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. ట్రైనింగ్​లో భాగంగా ఆ ప్రాజెక్టును కేస్​ స్టడీగా తీసుకొని రీసెర్చ్​ చేయాలన్నారు. మ్యాన్​మేడ్​ వండర్​ అని కాళేశ్వరం గురించి కొందరు చెప్పుకుంటున్నారని.. మ్యాన్​ మేడ్​ వండరే అయితే ఎట్ల కూలిందని సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను మొత్తంగా రూ.1.47 లక్షల కోట్లకు పెంచారు. ఇప్పటికే రూ.లక్ష కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఇంకా రూ.47 వేల కోట్లు కావాలి. 

రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టినా లక్ష ఎకరాలకు నీళ్లివ్వలేదు. కేవలం 52 వేల ఎకరాలకే నీళ్లిచ్చారు. ఇది అధికారిక లెక్క. మ్యాన్​మేడ్​ వండర్లంటే హిమాయత్​సాగర్​, ఉస్మాన్​ సాగర్​ జంట జలాశయాలు.  వందేండ్లయినా అవి నిలబడి.. హైదరాబాద్​ నగరానికి తాగునీటిని అందిస్తున్నాయి” అని తెలిపారు. ‘‘నాడు నాగార్జునసాగర్​, శ్రీశైలం, ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టులను నెహ్రూ నిర్మించారు. అవే తెలంగాణకు లైఫ్​లైన్​ అయ్యాయి. ఇప్పటివరకు వచ్చిన విపత్తులు, వరద పోట్లను ఆ ప్రాజెక్టులు తట్టుకుని నిలబడ్డాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్​ ప్రాజెక్టులను నాణ్యతలేకుండా కట్టి ఉండుంటే.. 

ఈపాటికే కొట్టుకుపోయేవి. కానీ, రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం మన కండ్ల ముందే కూలిపోయింది. దీనికి ఎవరిని బాధ్యులను చేయాలి. పెద్దలు చెప్పినట్టు పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందన్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి తయారైంది” అని వ్యాఖ్యానించారు.కొత్తగా రిక్రూట్ అయిన 687 మంది ఏఈఈల కు గురువారం జలసౌధలో సీఎం రేవంత్​రెడ్డి అపాయింట్​మెంట్​ లెటర్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.  రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి కారణం ప్రజాప్రతినిధులదో, ఉన్నతాధికారులదో, ఈఎన్​సీలు, సీఈలు, ఎస్​ఈలదో లేదా క్షేత్రస్థాయి అధికారులదో తేల్చాలని కొత్త ఏఈఈలకు సూచించారు. 

ఇరిగేషన్​ ఆఫీసర్లు కండ్లు తెరవాలి

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరిని ఏమనాలో తెలియడం లేదని, ఆ ప్రాజెక్టు కోసమే ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లోని సగం మంది పనిచేశారని  సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. వాళ్లందరిమీదా చర్యలు తీసుకుంటే ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​నే మూసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. చర్యలు తీసుకోకుంటే మళ్లీ వాళ్లనే కొనసాగిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తారన్నారు. తన మాటలతోనైనా ఇరిగేషన్​ అధికారులు కండ్లు తెరవాలని ఆయన సూచించారు. కాళేశ్వరం కమిషన్​ ముందు విచారణకు వెళ్తున్న కొందరు ఆఫీసర్లు అదో గొప్ప ప్రాజెక్ట్​ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని.. కానీ, కమిషన్​ చైర్మన్​ అడిగే ప్రశ్నలకు ఆ అధికారుల దగ్గర సమాధానం లేకుండా పోతున్నదని అన్నారు. 

ఒకప్పుడు ఉన్నతాధికారులు, సీఈ సీడీవోల అప్రూవల్​ లేకుంటే క్షేత్ర స్థాయిలో ఉన్న ఇంజనీర్లు ఆ నిర్ణయాలను తిరస్కరించి రిమార్క్స్​ రాసేటోళ్లని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు ఈఈ చెప్పారని ఏఈఈ.. ఎస్​ఈ చెప్పారని ఈఈ.. సీఈ చెప్పారని ఎస్​ఈ.. ఈఎన్​సీ చెప్పారని సీఈ.. సెక్రటరీ చెప్పారని ఈఎన్​సీ.. ముఖ్యమంత్రి చెప్పారని సెక్రటరీ.. ఇలా ఒకరిమీద ఒకరు నెపాన్ని మోపుకునే పరిస్థితి ఉందని విమర్శించారు. అల్టిమేట్​గా పొలిటికల్​ ఎగ్జిక్యూటివ్​ తీసుకునే రాంగ్​ డెసిషన్లు ఏఈఈ వరకు చేరి వాళ్లే అమలు చేయాల్సి వస్తున్నదని, క్షేత్రస్థాయిలోనే రిజెక్ట్​ చేసేస్తే మళ్లీ కాళేశ్వరం లాంటి తప్పులు జరగవని అన్నారు. 

ఏ దేశంలోనైనా ఆ దేశ గొప్పతనం గురించి చెప్పాలంటే.. ఆ దేశ నిర్మాణాలను చూపిస్తుంటామని.. లిబర్టీ స్టాట్యూ, ఈఫిల్​ టవర్​ వంటి వాటిని కట్టింది ఇంజనీర్లేనని, మన దేశంలో బాక్రానంగల్​ నుంచి నాగార్జునసాగర్​ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరాంసాగర్​ వరకు ఇంజనీర్లు కట్టినవేనని తెలిపారు. ఇంజనీర్లు కొత్త ప్రపంచాన్ని సృష్టించగలరని, అదే ఇంజనీర్లకున్న శక్తి అని ఆయన అన్నారు. 

కలెక్టర్లు, ఎస్పీలు కూడాఫీల్డ్​ విజిట్​కు వెళ్తలే..ఇది కరెక్ట్​ కాదు

మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి చెప్పినట్టు కొత్త ఏఈఈలు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందేనని సీఎం రేవంత్​రెడ్డి తేల్చిచెప్పారు. పొలిటికల్​ రికమండేషన్లతో వస్తే.. దూరంగా తిండి ఒక్కపూటే దొరికే చోట, లేదంటే అడవుల్లో పోస్టింగ్​ ఇప్పిస్తామని అన్నారు. ‘‘ఏ వృత్తిలో అయినా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారు. కింది నుంచి అన్నీ చూస్తూ చూస్తూ పైకి వచ్చామంటూ సినిమాల్లో, రాజకీయాల్లో చెప్తూ ఉంటారు. ఉదాహరణకు పీవీ నర్సింహారావు, నీలం సంజీవ రెడ్డి, కోట్ల విజయభాస్కర్​ రెడ్డి వంటి వాళ్లు రాజకీయాల్లో సర్పంచులుగా తమ ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్రపతులుగా, ప్రధానులుగా, సీఎంలుగా ఎదిగారు. 

అధికారుల్లోనూ క్షేత్ర స్థాయిలో ఏఈఈలుగా పనిచేసిన వాళ్లు ఇచ్చే రిపోర్టు ఆధారంగానే డీఈఈలు, ఈఈలు నిర్ణయాలు తీసుకుంటారు. ఏఈఈలు, జేఈలుగా పనిచేసే కొందరు తెలివిగా వ్యవహరిస్తుంటారు. ఒక ప్రాజెక్టు వద్దకు ఫీల్డ్​ విజిట్​కు వచ్చే ఉన్నతాధికారులకు ఇదే క్వాలిటీ అన్ని ప్రాజెక్టుల్లో ఉంటుందని చెప్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఇతర ప్రాజెక్టుల్లో లోపాలు వచ్చినప్పుడు తప్పించుకునే అవకాశం ఉండదు” అని ఆయన అన్నారు. గతంలో కాంట్రాక్టర్లుగానీ, అధికారులుగానీ పొద్దున్నే 5 గంటలకే ఫీల్డ్​ విజిట్​కు వెళ్లేవారని.. గ్రౌండ్​ రిపోర్ట్​ను సొంతంగా చూసి రిమార్క్స్​ రాసేటోళ్లని, దీంతో అధికారులు ఇన్​స్పెక్షన్​ వచ్చినా పెద్ద తేడాలు వచ్చేది కాదని తెలిపారు.  

క్షేత్రస్థాయిలో తిరగడం వల్ల, పనిచేయడం వల్ల మనం తీసుకునే నిర్ణయాల్లో తప్పిదాలకు చాలా తక్కువ అవకాశం ఉంటుందన్నారు. ‘‘కొన్నాళ్లుగా ఫీల్డ్​ ఇన్​స్పెక్షన్​కు వెళ్లే అధికారులు తగ్గిపోయారు. తొమ్మిది నెలలుగా దీన్ని చూస్తున్న. ఇంజనీర్లు మాత్రమే కాదు.. కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా స్థాయి అధికారులూ ఫీల్డ్​ విజిట్​కు వెళ్తలేరు. వాళ్లు ఎన్నిసార్లు ఫీల్డ్​ ఇన్​స్పెక్షన్​కు వెళ్లారో సర్వీసు రికార్డుల్లో రాయాల్సిందిగా సీఎస్​కు ఇటీవల ఆదేశాలిచ్చాను. వారికి ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు దీనినే ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేశాను’’ అని ఆయన అన్నారు. 

పెండింగ్​ ప్రాజెక్టుల బాధ్యతా ఏఈఈలదే

ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు తెలంగాణ వచ్చాక కూడా పూర్తి కాలేదని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ప్రాణహిత – చేవెళ్ల, పాలమూరు – రంగారెడ్డి, ఎస్​ఎల్బీసీ, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, దేవాదుల, సీతమ్మసాగర్​, ఇందిరాసాగర్​ వంటి ప్రాజెక్టులు పూర్తి కాలేదని.. పదేండ్లయినా అవి పూర్తికాకపోవడానికి కారణమెవరని ఆయన ప్రశ్నించారు. ఈ పదేండ్లలో ఇరిగేషన్​ ప్రాజెక్టులపై రూ.2 లక్షల కోట్ల వరకు ఖర్చు చేశారని,  అయినా ప్రాజెక్టులను పూర్తి చేసుకోలేకపోయామని అన్నారు. కారణమెవరని ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కన్నా.. 

భవిష్యత్​లో ఇలాంటివి జరగకుండా క్షేత్రస్థాయిలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.  ‘‘తెలంగాణ నిర్మాణం మనందరి చేతుల్లోనే ఉంది. మీరు, నేను, అందరం కలిస్తేనే తెలంగాణను గొప్పగా నిర్మించుకోగలుగుతాం. రాష్ట్రంలోని పెండింగ్​ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేయాలో మీరంతా క్షేత్రస్థాయిలో ఉండి స్టడీ చేయాలి. ఇదొక గొప్ప అవకాశం. మీరు ఒక యజ్ఞంలోకి అడుగుపెడుతున్నారు. ఈ పెండింగ్​ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే దేశంలో ఏ రాష్ట్రమూ తెలంగాణకు పోటీరాదు. అంతర్రాష్ట్ర జలవివాదాలూ ప్రాజెక్టులు పెండింగ్​లో పడిపోవడానికి కారణమవుతున్నాయి. దానిని సాల్వ్​ చేసే బాధ్యత కూడా ఏఈఈలపైనే ఉంది’’ అని సీఎం సూచించారు.  

మీది ఉద్యోగం కాదు.. భావోద్వేగం

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకాంశం నీళ్లేనని.. వ్యవసాయం, నీళ్లు రాష్ట్ర ప్రజల భావోద్వేగమని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఆ నీళ్లకే ఇప్పుడు కొత్తగా ఎంపికైన ఏఈఈలే ప్రతినిధు లని.. కాబట్టి ఇది ఉద్యోగం కాదని, రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగమని తెలిపారు. ‘‘ఉద్యోగమే కావాలనుకుంటే వేరే ఏ శాఖలోనైనా దొరుకుతుంది. కానీ, ఇరిగేషన్​ శాఖలో మాత్రం అదో ఉద్వేగం. ప్రజల భావోద్వేగమైన నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించే గురుతర బాధ్యత కొత్త ఏఈఈలపై ఉంది. మనసు పెట్టి పనిచేయండి” అని ఆయన సూచించారు. 

కొత్త ఏఈఈలంతా ఫీల్డ్​లోకే..మహిళలకు కొన్ని రిలాక్సేషన్స్ : మంత్రి ఉత్తమ్​

కొత్తగా నియమితులైన ఏఈఈలందరినీ ఫీల్డ్​కే పంపిస్తామని, మహిళలకు మాత్రం కొన్ని రిలాక్సేషన్స్​ ఇస్తా మని ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి చెప్పారు. హైదరాబాద్​ ఆఫీసు లేదా జిల్లా కేంద్రాల్లోని ఆఫీసుల్లో పోస్టింగుల కోసం ఎవరూ పైరవీలు చేయొద్దన్నారు. నేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే కొత్తవారిని ఫీల్డ్​కు పంపి స్తున్నామని తేల్చిచెప్పారు. ప్రాజెక్టులు, సైట్లలోనే పోస్టింగులు ఇవ్వాలని ఇప్పటికే ఈఎన్​సీకి చెప్పినట్లు వెల్లడించారు. కొత్త ఇంజినీర్లకు వాలంతరిలో ట్రైనింగ్​ ఇస్తామన్నారు. 

ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లోని సెంట్రల్​ డిజైన్స్​ ఆర్గనైజేషన్​ (సీడీవో).. జాతీయ స్థాయిలో ఉన్న డిజైన్స్​ ఆర్గనైజేషన్​కు దీటైనదని ఆయన చెప్పారు. రాష్ట్ర ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ దేశంలోనే గొప్పదన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రాజెక్టులతో పోలిస్తే మన ఇంజి నీర్లు కట్టిన ప్రాజెక్టులు చాలాగొప్పవని పేర్కొన్నారు. 687 మంది కొత్త ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వ రయ్య, అలీ నవాబ్​ జంగ్​ వంటి ఇంజనీర్లకు వారసులుగా వస్తున్నారని తెలిపారు. అందులో 31 మంది ఐఐటీల నుంచి వస్తే.. 83 మంది ఎన్​ఐటీల నుంచి వచ్చినవారే ఉన్నారని చెప్పారు. 

మొత్తంగా 480 మంది పురుషులు, 207 మంది మహిళలు ఏఈఈలుగా ఎంపికయ్యారన్నారు. 351 మంది సివిల్​ ఇంజనీర్లు, 93 మంది మెకానికల్​ ఇంజనీర్లు, 149 ఎలక్ట్రికల్​ ఇంజనీర్లు, 94 మంది అగ్రికల్చర్​ ఇంజనీర్లు ఉన్నారని ఆయన వివరించారు. వారితో పాటు ఇరిగేషన్​ శాఖను బలోపేతం చేసేందుకు 281 మంది హెల్పర్లు, 1597 మంది లష్కర్లను నియమించాలని సీఎం రేవంత్​ రెడ్డి నిర్ణయించారని మంత్రి ఉత్తమ్​ వెల్లడించారు.