మంచిర్యాలలో చెరువుల సర్వే షురూ

  •  
  • రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే 
  • ఏఫ్టీ ఎల్, బఫర్ జోన్ బౌండరీస్ ఫిక్స్ చేయనున్న ఆఫీసర్లు 
  • 3.17 ఎకరాలు కబ్జా అయినట్టు గతంలో గుర్తించినా చర్యల్లేవ్ 
  • తాజా సర్వేతో కబ్జాదారుల్లో వణుకు 

మంచిర్యాల/జైపూర్: జిల్లాలోని చెరువుల పరిరక్షణపై అధికారులు ఫోకస్ పెట్టారు. చెరువులు కబ్జాకు గురైనట్టు ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పోలీసు బందోబస్తు నడుమ సర్వే చేస్తున్నారు. ముందుగా భీమారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల ఊరచెరువు శిఖం భూమిని సర్వే చేశారు. ఈ చెరువు కబ్జాకు గురైనట్టు అధికారులకు ఫిర్యాదు అందింది. 

దీంతో   తహసీల్దార్ సదానందం, ఇరిగేషన్ డీఈఈ శారద ఆధ్వర్యంలో ఐదు రోజులుగా సర్వే చేశారు. కబ్జా భూముల్లో ఇండ్లు కట్టుకున్నవారు సర్వేను అడ్డుకునే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శిఖం భూమి పక్కనున్న హద్దుదారులకు ముందస్తుగా నోటీసులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో సర్వే రిపోర్టు వస్తుందన్నారు. 

3.17 ఎకరాల శిఖం క

బ్జా...భీమారం మండల కేంద్రంలోని సర్వేనంబర్ 570లో 14.39 ఎకరాల్లో ఊరచెరువు ఉంది. కొంతమంది శిఖం భూమిని కబ్జా చేసి అమ్ముకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో 2020 మేలో అప్పటి అడిషనల్ కలెక్టర్ సర్వేకు ఆదేశించారు. ఈ మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించారు. మొత్తం 3.17 ఎకరాల శిఖం భూమి కబ్జా అయినట్టు తేల్చారు. 

32 గుంటల్లో ఇండ్లు కట్టుకోగా, 2.25 ఎకరాల ఖాళీ జాగా అన్యాక్రాంతం అయినట్టు గుర్తించారు. అలాగే చెరువుకు ఎఫ్టీఎల్ హద్దులు ఏర్పాటు చేశారు. సర్వేనంబర్ 607లో 1.12 ఎకరాలు, 613లో 1.29 ఎకరాలు, 614లో గుంట, సర్వేనంబర్ 615లో 10 గుంటలు, మొత్తం 3.12 ఎకరాల పట్టా భూములు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు గుర్తించి బౌండరీస్ ఏర్పాటు చేశారు. 

కబ్జాదారుల్లో వణుకు.... 

చెరువుల ఆక్రమణలపై కాంగ్రెస్ గవర్నమెంట్ సీరియస్​గా ఉంది. హైడ్రా తరహాలో జిల్లాల్లోనూ కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఎం రేవంత్​ రెడ్డి  ఆదేశించడంతో అధికారులు దూకుడు పెంచారు. కబ్జాలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే సర్వే నిర్వహిస్తున్నారు. దీంతో కబ్జాదారుల్లో వణుకు పుడుతోంది. మంచిర్యాల జిల్లాలో 840 చెరువులు ఉండగా, వీటిలో చాలావరకు కబ్జాకోరల్లో మగ్గుతున్నాయి. జిల్లా కేంద్రంలోని రాముని చెరువు, పోచమ్మ చెరువు, సాయికుంట, చీకటి వెలుగుల కుంటలు పెద్ద మొత్తంలో కబ్జా అయ్యాయి. 

మంచిర్యాల శివారు సర్వేనంబర్ 406లో 47.32 ఎకరాల్లో రాముని చెరువు ఉండగా... ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో అపార్ట్​మెంట్​లు వెలిశాయి. పోచమ్మ చెరువు ఎఫ్టీఎల్లో సైతం మల్టీ స్టోర్ బిల్డింగులు వెలిశాయి. హైటెక్ సిటీ సమీపంలోని చీకటి వెలుగుల కుంట కనుమరుగైంది. సాయికుంట చెరువు శిఖం భూమిలో ఇండ్లు కట్టుకున్నారు.

 లక్సెట్టిపేటలోని ఇటిక్యాల చెరువు, చెన్నూర్లోని కుమ్మరికుంట చెరువు, బెల్లంపల్లి మండలం కన్నాలలోని ఎర్రకుంట చెరువులు అన్యాక్రాంతమయ్యాయి. వీటన్నింటిని సర్వేచేసి శిఖం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల బౌండరీస్ ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.