రిజర్వాయర్లు ఫుల్​ పంటలకు భరోసా

  • సాగు ఆరంభంలో తక్కువ వర్షపాతం
  • పది రోజుల  పాటు ఏకదాటి వర్షాలు
  • జిల్లాలో ఖరీఫ్​ సాగుకు పక్కా భరోసా

సాగు ఆరంభంలో తక్కువ వర్షపాతం నమోదైనా, పది రోజులుగా కురిసిన భారీ వర్షాలు జిల్లాలోని పంటల సాగుకు పూర్తి భరోసానిచ్చాయి.  జలాశయాలు నిండడంతో ఖరీఫ్​తో పాటు యాసంగి సీజన్​పై నమ్మకం పెంచాయి.  ఎస్సారెస్పీ, నిజాంసాగర్​ ప్రాజెక్టులతో పాటు 1,270 చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. 

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​​ జిల్లాలో మొత్తం 5.07 లక్షల ఎకరాలలో  రైతులు పంటలు వేయగా అందులో ఎక్కువ నీటి అవసరం అధికంగా ఉండే వరి పంట 4.30 లక్షల ఎకరాల్లో ఉంది. 25 వేల ఎకరాల సోయాబిన్, పసుపు 25 వేల ఎకరాలు,  మొక్కజొన్న, సజ్జ, కసుమ కలిపి 50 వేల ఎకరాలు, వెయ్యి ఎకరాలలో  కూరగాయ తదితర పంటలు సాగవుతున్నాయి.

సీజన్​ ఆరంభంలో ఆశించిన వర్షాలులేక వరి రైతులు బోర్ల కింద నాట్లు పూర్తి చేశాక సాగునీటి కొరత తలెత్తగా అడపాదడపా కురిసిన వర్షాలు ఆదుకున్నాయి.  నిజాంసాగర్​ ప్రాజెక్టులో సరిపోను నీటి నిల్వలు లేక జూలైలో ఒక తడికి మాత్రమే పది రోజుల పాటు నీటిని విడుదల చేశారు.  జిల్లాలోని 33 మండలాలకు గాను 24 మండలాల్లో తక్కువ, మూడు మండలాల్లో మరీ తక్కువ వర్షపాతం రెండువారాల కింద వరకు నమోదైంది. వరి పంట  రైతులు ఆందోళన చెందుతున్న టైంలో ​వర్షాలు పడడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 

Also Read :- బోర్లను మింగిన వాగులు

నిజాంసాగర్​ నిండాకే..

కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్​ ప్రాజెక్టు కింద 2.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇందులో 75 శాతం ఆయకట్టు  నిజామాబాద్​ జిల్లాలోనే ఉంది.  ప్రాజెక్టు కింద మొత్తం 82 మెయిన్​ కెనాల్స్​ ఉండగా,    డి/28 కెనాల్​ (కోటగిరి మండలం) నుంచి ఇందూర్​ జిల్లా బౌండ్రీ షురూ అవుతుంది. అక్కడి నుంచి డి/49 వరకు 91 వేల ఎకరాలు,  డి/50 నుంచి డి/73 వరకు, అలీసాగర్​ ఎత్తిపోతల ద్వారా53,793 ఎకరాలు,  డి/74 నుంచి డి/82 వరకు గుత్ప లిఫ్టుతో 38,792 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుంది.  

ప్రస్తుతం నిజాంసాగర్​ పూర్తిగా నిండడంతో 17 టీఎంసీల నీరు నిలువ ఉంది. ప్రాజెక్టు కెనాల్స్ లింక్​ చెరువులు, కుంటలు కూడా  వాటి కిందగల  1.10 లక్షల ఎకరాల్లో సాగుకు ఢోకా లేని పరిస్థితి నెలకొంది.  బాల్కొండలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద ఇందూర్​ జిల్లాలోగల 33,131 ఎకరాలకు  నీరు పుష్కలంగా అందుబాటులో ఉంది.  బెల్లాల్, అలీసాగర్​ రిజర్వాయర్ల కింది ఆయకట్టుతో పాటు లిఫ్టు స్కీంల కింద  ఉన్న 56,411 ఎకరాలకు ఖరీఫ్​తో పాటు యాసంగి పంటలకు సాగునీరు అందే అవకాశం ఉంది.