మాతాశిశు మరణాలను అరికట్టాలి : అభిలాష అభినవ్

  • కలెక్టర్ అభిలాష అభినవ్  

నిర్మల్, వెలుగు: మాతాశిశు మరణాలను అరికట్టాలని నిర్మల్​కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లో గర్భస్థ శిశు మరణాలపై వైద్యశాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గర్భిణుల మరణాలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే హై పవర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఏఎన్ఎం, ఆశ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు హైరిస్క్​గర్భిణుల గుర్తింపు, గర్భస్థ శిశు మరణాల నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై వైద్యులు, సిబ్బంది చొప్పున శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 

హైరిస్క్ గర్భిణులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లాలో హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. వీటిద్వారా నలుగురు ఏఎన్ఎం, సిబ్బంది గుర్తించిన హై రిస్క్ గర్భిణులకు ఒక్కొక్కరిగా ఫోన్లు చేసి, వారి ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీసి, అవసరమైన వైద్య సేవల గురించి వివరిస్తారని తెలిపారు. 

సమావేశంలో డీఎంహెచ్ వో రాజేందర్, డాక్టర్లు సురేశ్, శ్రీనివాస్, సౌమ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్​జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ జిల్లా గ్రంథాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. 

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ తో కలిసి కలెక్టర్ లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో మాట్లాడారు. మండలంలోని వెంగ్వాపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు, అధికారులతో కొనుగోళ్లపై ఆరా తీశారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.

మందుల కొరత లేకుండా చూసుకోవాలి

దండేపల్లి : ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత లేకుండా చూసుకోవాలని కలెక్టర్​ కుమార్​దీపక్​ సూచించారు. శుక్రవారం దండేపల్లి మండలం ముత్యంపేట, కన్నెపల్లి, గూడెంలలోని  ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. తూకంలో, గన్నీ సంచులు తదితర విషయాల్లో ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు, హమాలీలకు సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డ్స్ ను పరిశీలించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి వార్డులను, మందుల స్టోర్ రూమ్ ను పరిశీలించి, మందుల కొరత ఏర్పడకుండా ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టుకొని తెప్పించుకోవాలన్నారు. ఆయనవెంట తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో జేఆర్ ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ విజయ, వ్యవసాయ అధికారి అంజిత్, ఏపీఎం భూపతి బ్రహ్మం, ఆర్ఐ భూమన్న, ఏఈవోలు అర్చన, మౌనిక తదితరులు పాల్గొన్నారు.