ముక్కు మీద నల్ల మచ్చలు వైరల్ ఫీవర్స్​లో కొత్త లక్షణాలు

  • కీళ్లు, ఒళ్లు నొప్పులకు ఇది అదనం
  • రోగులపై స్టెరాయిడ్స్ ప్రయోగం
  • ఆర్ఎంపీల ప్యాకేజీ ట్రీట్​మెంట్

నిర్మల్, వెలుగు: ప్రజలను కుదిపేస్తున్న వైరల్ ఫీవర్స్ రోజుకో కొత్త రూపం దాలుస్తున్నాయి. డెంగ్యూ, చికెన్ గున్యా లక్షణాలతో తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, బీపీ డౌన్ కావడం, తల తిరిగి పడిపోవడం లాంటి లక్షణాలకు తోడు మరో కొత్త లక్షణం బయటపడుతోంది.

ముక్కుపై నల్ల మచ్చలు ఏర్పడుతుండడం బాధితులను కలవరపెడుతోంది. ఈ వైరల్ జ్వరాలతో వచ్చే సమస్యలకు తోడు ముక్కుపై నల్ల మచ్చలు ఏర్పడుతున్నాయని, మందులు వాడినా తగ్గడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారిలోనే కాకుండా జ్వరాలు తగ్గిన వారిలో కూడా ప్రస్తుతం ముక్కుపై మచ్చలు పెరిగిపోతున్నాయి. 

ఆర్ఎంపీల స్టెరాయిడ్స్​ ట్రీట్​మెంట్

నిర్మల్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న కొన్ని శివారు కాలనీ ప్రాంతాలు, అలాగే పట్టణంలోని కొన్ని వార్డుల్లో ఖానాపూర్ ప్రాంతంలోని కొంతమంది ఆర్ఎంపీలు ప్రత్యేకంగా క్లినిక్​లు ఏర్పాటు చేసి వైరల్ జ్వరాలకు ప్యాకేజీ ట్రీట్​మెంట్ అందిస్తు న్నారు. సదరు ఆర్ఎంపీలు అధిక డోసు స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఇంజక్షన్లు ఇవ్వడమే కాకుండా ట్రీట్​మెంట్ ​కోసం ప్యాకేజీ మాట్లాడుకుంటున్నారు. బాధితులు ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

హైడోస్ స్టెరాయిడ్స్ వాడకం వల్ల జ్వరం ఒకేసారి తగ్గుముఖం పడుతుండడంతో చాలామంది రోగులు ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ ట్రీట్​మెంట్ పొందిన మూడు, నాలుగు రోజుల్లోనే మళ్లీ జ్వర లక్షణాలు బయటపడుతున్నాయి. రోగి పూర్తిగా డీలా పడిపోతున్నాడు.

తగ్గు ముఖం పట్టని జ్వరాలు

నెలన్నర కాలంగా జనాన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్న వైరల్ జ్వరాల తీవ్రత మాత్రం ఇప్పటికీ తగ్గడం లేదు. చాలామంది కీళ్లు, ఒళ్లు నొప్పులతో ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్​లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. స్కూళ్లు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ డాక్టర్లు రోగులకు అన్ని రకాల పరీక్షలు చేస్తూ, మందుల పేరిట అడ్డగోలుగా దోచుకుంటున్నారు.

ఆర్ఎంపీల అవతారమెత్తుతున్న వైద్య ఉద్యోగులు

వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు ఆర్ఎంపీల అవతారం ఎత్తుతున్నారు. ఖానాపూర్ ప్రాంతం వైద్య ఆరోగ్య శాఖలోని పలువురు ఉద్యోగులు తమ ఉద్యోగానికి సెలవు పెట్టి ఏకంగా క్లినిక్​లు ఏర్పాటు చేశారని, వారి వద్దకు వెళుతున్న రోగుల నుంచి పెద్ద మొత్తంలో దోచుకుంటున్నారని సమాచారం.

చికెన్ గున్యా లక్షణమే..


ప్రస్తుతం వైరల్ ఫీవర్ బాధితుల్లో ముక్కుపై చిక్ సైన్ (నల్ల మచ్చలు) ఏర్పడుతున్నాయి. మొదట్లో చికెన్ గున్యా బాధితుల్లో కనిపించే చిక్​సైన్ ప్రస్తుతం వైరల్ ఫీవర్ బాధితుల్లోనూ కనిపిస్తోంది. వైరస్ మ్యుటేషన్ కారణంగానే ఇది ఏర్పడుతోంది. చికెన్ గున్యా లక్షణాలున్న వారి రక్త పరీక్షల్లో మాత్రం పాజిటివ్ రిపోర్ట్ రావడం లేదు. దీనిపై వైద్య బృందం స్టడీ చేస్తోంది. ఈ మచ్చల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. సరైన లోషన్ వాడితే రెండు, మూడు నెలల్లో తగ్గిపోతుంది.
డాక్టర్ గాయత్రి, అసిస్టెంట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, నిర్మల్