పథకాలు పక్కాగా అమలు చేయాలి

  • ‘దిశ’ మీటింగ్​లో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి
  • సీసీఐ ద్వారా జిన్నింగ్ మిల్లుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని వెల్లడి

ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలను  అధికారులు పక్కాగా అమలయ్యేలా చూడాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ల్​ ఎంపీ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అడిషనల్​ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాస్ నాయక్ హాజరయ్యారు.

 శాఖల పరిధిలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, రాబోయే మూడు నెలల కాలంలో నిర్దేశించుకున్న లక్ష్యాలపై  సంక్షేమ అధికారి,  జీఏం పరిశ్రమలు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, ఈఈ హౌసింగ్, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఖమ్మం మున్సిపల్ కమిషనర్, జాతీయ రహదారులు, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు సమర్పించారు. 

 అనంతరం ఎంపీ మాట్లాడుతూ బ్యాటరీ ఆధారిత వాహనాలను అవసరం, అర్హత ఉన్న దివ్యాంగులకు అందించేందుకు క్యాంపు నిర్వహించాలన్నారు.  జిల్లా వ్యాప్తంగా అవసరమైన బ్యాటరీ ట్రై సైకిళ్లు నివేదిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. పరిశ్రమల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన అంశాలపై పక్కా నివేదిక తయారు చేయాలన్నారు.

 జిల్లాలో పత్తి పంట అధికంగా పండుతూ జిన్నింగ్ మిల్లులు లేని క్లస్టర్లను గుర్తించాలని, అక్కడ సీసీఐ ద్వారా జిన్నింగ్ మిల్లుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. యాసంగి నుంచి పంట బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కు సూచించారు.

అంగన్​వాడీ భవనాల వివరాలు అందించాలి

కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా  అవసరం ఉన్న అంగన్​వాడీ భవనాలు, రిపేర్లు అవసరమైన భవనాల వివరాలను అందించాలని అధికారులకు సూచించారు. సుగమ్య భారత్ అభియాన్  కింద దివ్యాంగుల కోసం ప్రజా సంచార ప్రదేశాలలో ప్రభుత్వం కల్పించిన ఇన్ ఫ్రా వివరాలను ఆడిట్ చేయాలన్నారు.  

అంగన్​వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లు, పాలు, ఇతర పోషకాహారం వినియోగం నాణ్యతను పరిశీలించాలన్నారు.  జిల్లాలో 5 మండలాలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ‘చిన్నారి’ కార్యక్రమం కింద ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలలో పిల్లల హెల్ప్ లైన్, డ్రగ్స్ వినియోగం, బాల్య వివాహాల నివారణ మొదలగు అంశాలపై అవగాహన కార్యక్రమం చేపట్టామన్నారు.  

పరిశ్రమల ఏర్పాటుకు మంచి అవకాశాలు.. 

జిల్లాలో పండే పంటల ఆధారంగా ఆగ్రో ఇండస్ట్రీస్​ ఏర్పాటుపై స్టడీ చేయాలని కలెక్టర్​ చెప్పారు. ఎథనాల్ ఫ్యాక్టరీ, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ, రైస్ మిల్​ క్లస్టర్లు, పౌల్ట్రీ, కారం తయారీ కేంద్రం, తదితర పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.  జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, ముద్రా రుణాలు, పీఎంఎఫ్ఎంఈ, తదితర అంశాలపై ప్రచారం కల్పించాలన్నారు. 

స్కూళ్లకు సరఫరా చేసే బియ్యం నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని  సూచించారు. గ్రామాలవారీగా సన్నరకం వడ్ల దిగుబడి, రైతుల వివరాలను ఏఈవోలు రిపోర్ట్​ చేయాలని, దీని వల్ల బోనస్​లో అవకతవకలను అరికట్టవచ్చన్నారు.  జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రాలలో కూడా సదరం క్యాంప్ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం లక్షా 50 వేల  నుంచి వివిధ రకాల పెన్షన్లు అందుతున్నాయని, మరో 15 వేల వరకు పెన్షన్లు జారీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేస్తున్నామన్నారు.

 పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అప్రోచ్ రోడ్, ఇతర మౌలిక వసతుల కల్పిస్తామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా స్కూళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలను ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించబోమని, సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకొని నివేదికను సత్తుపల్లి ఎమ్మెల్యేకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. 

వైరా బ్రిడ్జి రిపేర్లు త్వరగా పూర్తి చేయాలి 

వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ వైరా బ్రిడ్జి రిపేర్​ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.  స్టీల్ ప్లాంట్ రైల్వే లైన్, ఖమ్మం–ఇల్లెందు దారిలో రైల్వే లైన్ ఉందని, ఇక్కడ ఆర్వోబీ గానీ, అండర్ బ్రిడ్జి గానీ  మంజూరు చేయాలన్నారు. గ్రామాల్లో నూతన విద్యుత్ స్తంభాలు అవసరమున్న చోట వేయాలని అధికారులకు  సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ట్రైనీ అసిస్టెంట్​ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డీఎఫ్​వో సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.