మోదీ బర్త్​డే సందర్భంగా.. బీజేపీ నేత ఫేక్ రక్తదానం ఫొటోలు

  • సోషల్ మీడియాలో ట్రోలింగ్​

లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేసినట్టు సోషల్ మీడియాలో ఫేక్ వీడియో, ఫోటోలు పెట్టుకున్న యూపీలోని మోరదాబాద్ మేయర్, బీజేపీ నేత వినోద్​ అగర్వాల్​పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్​కు గురవుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిరీత్యా రక్తదానం చేయలేరని.. అయినా చేసినట్టు బెడ్​పై పడుకున్న వీడియో, ఫొటోలు పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 17న మోదీ పుట్టినరోజు సందర్భంగా యూపీలోని మోరాదాబాద్​లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆ శిబిరానికి వెళ్లిన మేయర్ వినోద్ అగర్వాల్ అక్కడ రక్తదానం చేస్తున్నట్టు వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టుకున్నారు.

మెడికల్ స్టాఫ్ అతనికి బీపీ చూస్తున్నట్టు, ఆయన బెడ్​పై పడుకొని రక్త దానం చేస్తున్నట్టు అవి ఉన్నాయి. వాస్తవానికి డయాబెటిస్​తో బాధపడుతున్న ఆయన రక్తదానం చేయడానికి లేదు. డాక్టర్లు కూడా ఆయన రక్తం తీసుకోలేదు. అయితే బీజేపీ నేత కెమెరాల కోసం రక్తదానం చేసినట్టు ఫేక్ వీడియో, ఫొటోలు తీసుకున్నారని సోషల్​ మీడియాలో తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైరల్ వీడియో, ఫొటోల గురించి బీజేపీ నాయకుడిని మీడియా ప్రశ్నించగా.. తన పరువు తీసేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్రగా పేర్కొన్నారు. తాను రక్తదానం చేసేందుకు శిబిరానికి వెళ్లానని, అయితే డయాబెటిస్ ఉందని చెప్పడంతో డాక్టర్లు  రక్తదానం చేయవద్దని అన్నారని తెలిపారు.