బీజేపీలో ఎమ్మెల్సీ లొల్లి

  • కార్పొరేట్ స్కూల్ ప్రతినిధికి టికెట్ ఇచ్చే యోచనపై భిన్నాభిప్రాయాలు 
  • హైకమాండ్​కు పలు సంఘాల ఫిర్యాదు 
  • నేడు రాష్ట్రానికి సునీల్ బన్సల్ రాక 

హైదరాబాద్, వెలుగు: బీజేపీలో ఎమ్మెల్సీ టికెట్ల లొల్లి మొదలైంది. రెండు టీచర్ స్థానాలకు, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీకి సవాల్​గా మారింది. ఎక్కువ మంది పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడంతో.. ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. 

దీంతో పాటు వరంగల్ – ఖమ్మం – నల్గొండ – టీచర్ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డితో పాటు పలువురు నేతలతో కమిటీని కూడా బీజేపీ వేసింది. అయితే, ఈ నెల 2న అభ్యర్థుల ఎంపికపై కీలక సమావేశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్పారు. కానీ, అది వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణం అభ్యర్థులపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడమేనని తెలుస్తోంది.  

‘కార్పొరేట్’​పై లొల్లి.. 

‘కరీంనగర్’ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రాంతానికి చెందిన వారికి కాకుండా హైదరాబాద్​లోని ఓ కార్పొరేట్ స్కూల్ ఓనర్ కు సీటు ఇవ్వాలని కమలం పార్టీ దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. దీనిని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్), ఏబీవీపీ సంఘాలతో పాటు పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ‘హైదరాబాద్’​ టీచర్ సెగ్మెంట్ లో ఓ ప్రైవేటు కార్పొరేట్ స్కూల్ మేనేజ్మెంట్ ప్రతినిధి ఉండగా, మళ్లీ కరీంనగర్ సెగ్మెంట్లో ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

టీచర్ సెగ్మెంట్ లో కార్పొరేట్ ప్రతినిధికి టికెట్ ఇవ్వడం సంఘ్ నిబంధనలకు విరుద్ధమని వారు వాదిస్తున్నారు. ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్ ప్రతినిధి తరఫున సర్కారు స్కూల్ టీచర్లు ఎలా ప్రచారం చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే.. ఆయన తరఫున ప్రచారం చేయబోమని వారంతా సంఘ్ నేతలకు తేల్చిచెప్పినట్టు సమాచారం. ఆయనకు గ్రాడ్యుయేట్ స్థానానికి టికెట్ ఇస్తే తమకు ఇబ్బంది లేదని వాదిస్తున్నారు. కాగా, బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ సునీల్ బన్సల్ సోమవారం హైదరాబాద్ రానున్నారు. ఆ పార్టీ ముఖ్యనేతలతో ఎమ్మెల్సీ ఎన్నికలు, మెంబర్షిప్ పై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ టికెట్ల అంశంపై ఆయనకు ఫిర్యాదు చేసేందుకు పలువురు రెడీ అవుతున్నట్టు సమాచారం.