గంజాయి రవాణా, కల్తీ కల్లు నిర్మూలనకు చర్యలు : జూపల్లి కృష్ణారావు

బాల్కొండ, వెలుగు : మత్తు పదార్ధాలు, కల్తీ కల్లు నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని  రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం  బాల్కొండ, ఆర్మూర్​ సెగ్మెంట్లలో ఏర్పాటుచేసిన ఎక్సైజ్​కార్యాలయాలను ప్రారంభించారు. గత ప్రభుత్వ  పాలనలో ప్రజలు మద్యానికి బానిసై ఆగమయ్యారని, దీనిని దృష్టిలో పెట్టుకొని  అక్రమ మద్యం, గంజాయి రవాణా ఇతర మత్తు పదార్థాలు నిర్మూలనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని అన్నారు.

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ భీంగల్ మండల కేంద్రాలలో  ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ భవనాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్​చార్జి ముత్యాల సునీల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా గంజాయి, మాదకద్రవ్యాల ఆనవాలు లేకుండా ఉక్కుపాదం మోపాలన్నారు. గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టిసారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాలను పంపిస్తామని  చెప్పారు.   

ఆర్మూర్, వెలుగు : గంజాయి, డ్రగ్స్​ను నియంత్రిస్తామని, కల్లు తయారీలో అల్ఫాజోలమ్‌‌ వంటి మత్తు పదార్థాలు కలపకుండా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఆర్మూర్‌‌లో ఎక్సైజ్‌‌ శాఖ బిల్డింగ్‌‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ పై అధికారులు చర్యలు తీసుకునేలా ఇప్పటికే ఆదేశాలిచ్చామని అన్నారు.

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. కల్తీకల్లుకు బానిసలై ఈ ప్రాంతవాసులు ఇతర దేశాల్లో ఉండలేకపోతున్నారని అన్నారు. కల్తీ కల్లు నియంత్రణకు చర్య తీసుకోవాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వెల్ఫేర్ సలహాదారుడు షబ్బీర్​ అలీ, నిజామాబాద్ రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పాల్గొన్నారు.