శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా

 శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి జన్మదినాన్ని సీతా నవమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2024) సీతానవమి మే 16 వస్తుంది. ఈ పర్వదిన విశేషాలను తెలుసుకుందాం..

హిందూ పురాణాల ప్రకారం వైశాఖ మాసం తొమ్మిదో రోజున ( 2024 మే 16) సీతా దేవి జన్మించిందని అంటారు. సీతాదేవి జన్మదినాన్ని సీతా నవమి లేదా జానకి నవమి అని కూడా పిలుస్తారు. అమ్మవారికి 108 రూపాలు ఉన్నాయని పండితులు చెబుతుంటారు. వీరిలో సంపద, శ్రేయస్సు కలిగిన దేవతగా లక్ష్మీదేవిని పూజిస్తారు. త్రేతాయుగంలో దుఖం, కరువు కాటకాలు, అనారోగ్య సమస్యలతో అల్లాడుతున్న సమస్త జీవరాశుల సంక్షేమం కోసం సాక్షాత్తూ లక్ష్మీదేవి ... శాఖ మాసం తొమ్మిదో రోజున మిథిలా నగరంలో సీతాదేవిగా అవతరించిదని చెబుతారు. శ్రీరామనవమి వచ్చిన నెల రోజుల తర్వాత సీతా నవమి వస్తుంది. ఈ రెండూ పండుగలు నవమి తిథి రోజునే రావడం విశేషం.

 సీతా నవమిని ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల నవమి తిథి నాడు జరుపుకుంటారు. శ్రీరాముడు అవతరించిన శ్రీరామ నవమికి సరిగ్గా ఒక నెల తర్వాత సీతా నవమి వస్తుంది. దీనినే జానకి జయంతిగా కూడా వ్యవహరిస్తారు.  ఈ ఏడాది (2024) సీతా నవమి మే 16వ తేదీ వచ్చింది. సీతాదేవిని పూజించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్హు కోసం ఈరోజు ఉపవాసం చేస్తారు. సంతాన ఉత్పత్తికి, స్వచ్ఛతకు, పరిశుభ్రతకు సీతాదేవి ప్రతీకగా భావిస్తారు. సకల జీవరాశులకు తల్లి సీతామాత అని భక్తులు నమ్ముతారు. ఆమె తన భక్తులకు సంపద, ఆరోగ్యం, తెలివితేటలు, శ్రేయస్సు మొదలైన వాటిని ప్రసాదిస్తుందని నమ్ముతారు.

సీతా నవమి శుభ ముహూర్తం

  • క్రోధి నామ సంవత్సరం వైశాఖ శుద్ద  నవమి తిథి ప్రారంభం మే 16 ఉదయం 6. 22 గంటల నుంచి
  • తిథి ముగింపు మే 17 ఉదయం 8:48 గంటలు.
  • శుభ సమయం ఉదయం 10.56 గంటలనుంచి మధ్యాహ్నం 1.39 గంటల వరకు ఉంది.

శుభకరమైన యోగాలతో సీతా నవమి

ఈ ఏడాది  (2024) సీతా నవమి రెండు అద్భుతమైన యోగాలున్నాయి.  మే 16   ఉదయం 8.23 గంటలకు ధ్రువ యోగం ఏర్పడుతుంది. అలాగే సాయంత్రం 6.14 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5. 29 గంటల వరకు రవి యోగం ఉంది. అది మాత్రమే కాకుండా  మే 16  ఉదయం నుంచి సాయంత్రం 6.14 గంటలవరకు మాఘ నక్షత్రం ఉంటుంది. తర్వాత పూర్వా ఫాల్గుణి నక్షత్రం వస్తుంది.

సీతా నవమి విశిష్టత

హిందూ పురాణాల ప్రకారం  లక్ష్మీ దేవి వైశాఖ శుక్ల నవమి నాడు మంగళవారం రోజున పుష్యమి నక్షత్రమునందు జనక మహారాజు ఇంట్లో సీతగా అవతరించిందని ప్రతీతి. పండితులు తెలిపిన వివరాల ప్రకారం, జనక మహారాజు తమ రాజ్యంలో వర్షాలు బాగా కురవాలని, రాజ్యం సుభిక్షంగా ఉండాలని యాగం చేస్తాడు, ఇందులో భాగంగానే పొలం దున్నుతుండగా మట్టిలో నుంచి ఒక ఒక బంగారు పెట్టె బయటపడుతుంది. ఆ పెట్టె తెరిచి చూడగా అందులో ఒక ఆడబిడ్డ ఉంటుంది. ఆ ఆడబిడ్డను జనకుడు తన కూతురుగా స్వీకరిస్తాడు. జనకుడు దున్నినటువంటి పొలంను సీత అని పిలిచే వారు అందుకే ఆ ఆడబిడ్డ సీతగా నామకరణం పొందింది, మిథిలా రాజు జనకుని కుమార్తె అయినందున ఆమెకు జానకి అనే పేరు కూడా వచ్చింది.

సీతా నవమి ప్రాముఖ్యత ఏమిటి?

శ్రీరాముని ధర్మపత్నిగా సీతా మాత ఆదర్శవంతమైన జీవితాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటారు. ప్రేమ, త్యాగం, స్వచ్ఛతకు, పవిత్రతకు స్వరూపంగా సీతామాతను భక్తితో కొలుస్తారు. శ్రీసీతారాములను భక్తితో ఆరాధిస్తారు. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారంగా సీతానవమి రోజున స్త్రీలు భక్తితో పూజచేస్తే, భర్తకు ఆయురారోగ్యాలు కలుగుతాయి. భార్యభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది, ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి.

  • సీతామాత భూమాత అందించిన వరప్రసాదం కాబట్టి ఆరోజున ( మే 16)  శ్రీరామునితో పాటు సీతామాతను ని పూజించడం వల్ల భూదాన ఫలితంతో పాటు పదహారు మహాదానాల ఫలితం లభిస్తుందని ప్రతీతి.
  • సీతామాత సాక్ష్యాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి, ఆ రోజు ఉపవాసం, పూజలు, జపాలు చేయడం వల్ల అనేక తీర్థయాత్రలతో సమానమైన పుణ్యఫలం లభిస్తుంది. ఇది అదృష్టాన్ని పెంచుతుంది, కష్టాలను తొలగిస్తుంది. జీవితంలో ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు

సీతా నవమి రోజు పాటించాల్సిన నియమాలు

సీతా నవమి రోజు ఉపవాసం ఉండటం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం ఉంటారు. భార్యాభర్తలు కలిసి సీతానవమి ఉపవాసం ఆచరించి పూజ చేయడం వల్ల వైవాహిక జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది. కలహాలు, అపార్థాలు తొలగిపోతాయి. పూజ సమయంలో ఓం సీతాయై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్దలతో పఠించాలి.

సీతా నవమి రోజు సీతాదేవితో పాటు శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడిని పూజిస్తారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య, బీహార్ లోని సీతా సమితి, భద్రాచలం తమిళనాడులోని రామేశ్వరంలో సీతా నవమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సీతా నవమి రోజు శ్రీరామ దర్బార్ చిత్ర పటాన్ని ఉంచి పూజ చేయొచ్చు. అందులో సీతా దేవి, శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు విగ్రహాలు ఉంటాయి. కొన్నిచోట్ల రామ దర్భార్ విగ్రహాన్ని రథంలో అలంకరించి శోభా యాత్ర నిర్వహిస్తారు.