ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కుమ్రం భీం వర్ధంతి వేడుకలు

  • పోరుగడ్డ జోడేఘాట్​లో వారసుల ప్రత్యేక పూజలు
  • పాల్గొన్న మంత్రి సీతక్క, నేతలు, అధికారులు

ఆసిఫాబాద్/నెట్​వర్క్, వెలుగు: ఆదివాసీల హక్కుల కోసం నిజాంతో పోరాడి అసువులు బాసిన మన్యం వీరుడు కుమ్రం భీం 84వ వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్​లో వేడుకల్లో మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. మ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ నుంచి వేలాదిగా తరలివచ్చిన గిరిజనులు, గిరిజనేతరుల నడుమ కుమ్రం భీం సమాధి వద్ద ఆయన మనుమడు కుమ్రం సోనేరావు, సొంబాయి దంపతులు పూజలు చేశారు. 

ఆదివాసీ ఆచారం మేరకు ఐదు గోత్రాలను సూచించే జెండాలను ఆవిష్కరించారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, వాయిద్యాలు, కుమ్రంభీం అమర్ రహే అన్న నినాదాలతో జోడేఘాట్ ప్రాంగణం మార్మోగింది. అలాగే కుమ్రంభీం సహచరుడు కుమ్రం సూరు వర్ధంతి సైతం ఘనంగా నిర్వహించారు. చింతల మానేపల్లీ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కుమ్రం భీం విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదివాసీ గిరిజన నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తామని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగజ్​నగర్​లో పీఆర్​టీయూ, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు నివాళి అర్పించారు. ఆదిలాబాద్​బస్టాండ్ వద్ద ఉన్న భీం విగ్రహానికి కలెక్టర్ రాజర్షి షా పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొమురం భీం చౌక్​లో ఎమ్మెల్యే పాయల్​ శంకర్, తెలంగాణ కిసాన్​ కాంగ్రెస్ ​రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్​ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ నాయకులు నివాళులు అర్పించారు.