వేసవి పంట.. కీరదోస సాగు

కీర దోసకాయ సమ్మర్ సీజన్​ పంట.  ఇది అధిక లాభాలను ఇస్తుంది.  ఖర్చు తక్కువ .. శ్రమ అధికంగా ఉంటుంది.  తక్కువ కాలంలో పంట చేతికొచ్చి ఆదాయం చేతికొస్తుంది.  వేసవికాలంలో ఈ పంటను సాగు చేస్తారు. వేసవి పంటగా రైతులు ఎక్కువగా కీరదోస  పంటను సాగు చేస్తూ ఉంటారు. తక్కువ కాలంలో కోతకు వచ్చి,  వేసవి... వేడి వాతవరణంలో పెరుగగల తీగ జాతి  కూరగాయ పంటలలో కీర దోస ముఖ్యమైన పంట.  ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మగ పూలు ఎక్కువగా వస్తాయి.  కాబట్టి విత్తనం నాటిన  2 – 4 ఆకుల దశలో బోరాక్స్‌ 3-4 గ్రా. లీటరు నీటికి లేదా ఎథిరీల్‌ 2.5 మి.లీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి.

వేసవికి అనువైన రకాలు 

ఇందులో కీర దోస మరియు పచ్చి దోస రెండు రకాలున్నాయి.


కీర దోస : వేసవికి అనువైన పంట, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. దిగుబడి 60 – 70 క్వింటాలు వస్తుంది.

పచ్చి దోస రకాలు : జపనీస్‌ లాంగ్‌ గ్రీన్‌: కాయలు పొడవుగా ఆకుపచ్చగా ఉండి త్వరగా కోతకు వస్తాయి.

పూస సన్యోగ్‌: హైబ్రీడ్‌ రకం ఎకరానికి 60 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.  కాయలు వంపు తిరిగి 60-నుంచి65సెం.మీ.  పొడువు ఉంటాయి. పంట కాలం 100 రోజులు... పచ్చి దోస దిగుబడి  ఎకరాకు 56 క్వింటాళ్లు .  కూరదోస  అయితే 100-నుంచి 112 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది.

పూస సీడ్‌ లెస్‌ కుకుంబర్‌ 6 : 40-నుంచి 45 రోజులలో మొదటి కోతకు వస్తుంది. 50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

సాగుకు అనుకూలమైన ఇతర హైబ్రీడ్‌ రకాలు:  నాందరి, 910, అభిజిత్‌, గోల్డెన్‌ గ్లోరి మరియు మల్టీ స్టార్‌ రకాలున్నాయి.

చీడ పీడల సమగ్ర యాజమాన్యం : తక్కువ కాలంలో కోతకు వచ్చే పంట అయినప్పటికీ గుమ్మడి పురుగు, కాయ దశలో పండు ఈగ మరియు పాము పొడ పురుగు తెగుళ్లలో బూజు తెగులు, బూడిద తెగులు, ఆకుమచ్చ  తెగులు , వెర్రి తెగులు  నష్టపరుస్తాయి. అయితే పంట వేసే ముందు విత్తన శుద్ది ఖచ్చితంగా రైతులు చేసుకోవాలి.

విత్తన శుద్ది: కిలో విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్‌ అనే మందు కలిపి నీడలో ఆరబెట్టి అదే విత్తనానికి 3 గ్రా. థైరం కలిపి విత్తన శుద్ది చేయాలి.

 కీర దోస ఆశించే పురుగులు ..  యాజమాన్య పద్ధతులు:

1.గుమ్మడి పెంకు పురుగు:  మొలకెత్తిన తర్వాత  లేత పత్ర దళాలను పెద్ద పురుగులు  ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి.
నివారణ :  వీటి నివారణకు ట్రైక్లోఫోరాన్‌ (5%) పొడిమందును చల్లాలి. వారం పది రోజులకు మరలా చల్లాలి. ఈ పురుగులు తీగ పాకే  సమయంలో ఆశించి ఆకులకు నష్టం కలిగిస్తాయి. అప్పుడు వాటి నివారణకు డైక్లోరోవాస్‌ 1.2 మి.లీ లేదా ట్రైకోఫోరాన్‌ 2 మి.లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.

2.పండు ఈగ (ఫ్రూట్‌ ఫ్లై) : తల్లి ఈగలు పూల మొగ్గలపై, లేత పిందెలపైన గ్రుడ్లు పెడతాయి. వీటి నుండి వచ్చిన సన్నని పిల్ల పురుగులు కాయను తొలచి, లోపలి గుజ్జును తిని నష్టపరుస్తాయి. అందువలన కాయలు క్రుళ్ళి పోతాయి.
నివారణ :  నివారణకు మలాథియాన్‌ 2 మి.లీ. లేదా ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ పురుగులను నివారించడానికి విషపు ఎరలను తయారు చేసుకోవాలి.
విషపు ఎరల తయారీ విధానం : మలాథియాన్‌ 100 మి.లీ. 100 గ్రా. చక్కెర లేదా బెల్లం 10.లీ. నీటిలో కలిపి మట్టి మూకుడులో పోసి ఎకరాకు 10-నుంచి12 మూకుడులు అక్కడక్కడ పెట్టాలి. ఇవి తల్లి ఈగలను ఆకర్షిస్తాయి. ఈ విషపు ఎరలకు పులిసిన కల్లు మడ్డి కలిపితే, ఈగలు ఇంకా ఎక్కువగా ఆకర్షించబడతాయి. ఈగలు ఈ విషపదార్ధాన్ని తిని చనిపోతాయి లేదా మార్కెట్లో లభించే పండు ఈగ ఎరలను (క్యూలూర్‌) ఎకరానికి 4-5 అమర్చు కోవాలి.

3.పాము పొడ పురుగు :  ఈ గొంగళి పురుగు చాలా సన్నగా ఉండి, ఆకు పైపొరలలో చొచ్చుకొని పోయి పత్రహరితాన్ని తిని నష్టపరుస్తుంది.
నివారణ : నివారణ మలాథియాన్‌ 2 మి.లీ. లేదా ఆక్సీడెమటాన్‌ మిథైల్‌ 2 మి.లీ. లేదా ఫిప్రోనిల్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి చీడ ప్రారంభ దశలోనే పిచికారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది

కీర దోసను ఆశించే తెగుళ్లు వాటిని నివారించే పద్ధతులు

1.బూజు తెగులు : ఆకు అడుగు భాగంలో బూజు మాదిరిగా ఏర్పడి, తెగులు ఉధృతి ఎక్కువైతే ఊదారంగు మచ్చలు అడుగున, ఆకు పైభాగాన పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి.
నివారణ : దీని నివారణకు మాంకోజెబ్‌ 64% డబ్ల్యుపి 3 గ్రా. G సిమోగ్సానిల్‌ 8% లేదా 75% డబ్ల్యు.పి 3 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

2.బూడిద తెగులు : ఆకుపైభాగంలో తెల్లని పొడి లాగా ఏర్పడి, తెగులు ఉధృతి ఎక్కువైతే కాండం, పూతకు కూడా వ్యాపిస్తుంది. ఆకులు, కాండం ఎండిపోతాయి.
నివారణ : దీని నివారణకు కెరథేన్‌ 1 మి.లీ. లేదా థయోఫనేట్‌ మిథైల్‌ (75% డబ్ల్యు. జి) 2.5 గ్రా. లేదా బినామిల్‌ 50% డబ్ల్యుపి 0.4 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

3.ఆకుమచ్చ తెగులు : ఆకుల మీద చిన్నవి గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువైతే ఇవి పెద్దగా మారి ఎండిపోయి రాలిపోతాయి. అంతేకాక కాయను ఆశించినప్పుడు, నష్టం వాటిల్లుతుంది.
నివారణ : దీని నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా. లేదా జినెబ్‌ 75% డబ్ల్యు.పి 3 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

4. వెర్రి తెగులు : ఆకులలో ఈనెలుండెడి ప్రాంతములో చారలు ఏర్పడతాయి. మొక్క అంతా గిడస బారిపోతుంది. పూత తగ్గుతుంది.
నివారణ : ఈ తెగులు సోకిన మొక్కలను నాశనం చేయాలి. డైమిథోయేట్‌ లేదా ఆక్సీడెమటాన్‌ మిథైల్‌ లేదా ఫిప్రోనిల్‌ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 70% డబ్ల్యు.జి 0.7 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.