మిల్లర్లే కొంటున్నారు పచ్చి వడ్లకు క్వింటాల్​కు రూ.2,200 చెల్లింపు

  • కర్నాటక, ఆంధ్రప్రదేశ్​ నుంచి ఎంటరైన మిల్లర్లు
  • లోకల్​గా కమీషన్​ ఏజెంట్లను నియమించుకొని వడ్ల సేకరణ
  • ఇంకా షురూ కాని సర్కారు సెంటర్లు
  • రూ.500 బోనస్​ లబ్ధికి అన్నదాతలు దూరమయ్యే చాన్స్​  
  • కొనుగోళ్ల టార్గెట్ ​చేరడంఈసారి కూడా అనుమానమే

నిజామాబాద్,  వెలుగు:  జిల్లాలో వరి పంట కోతలు మొదలై 20 రోజులు దాటింది. ఇంకా సర్కార్​ కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాకపోయినా.. మిల్లర్లే నేరుగా కల్లాల మీదకు వచ్చి జోరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.  ఖరీఫ్​ వచ్చిన వడ్లలో ఇప్పటికే 35 శాతం వరకు కొన్నట్టు తెలుస్తోంది. కల్లాల వద్దకు ఏజెంట్ల సహాయంతో చేరుకొని సన్నాలు, దొడ్డురకం తేడాలేకుండా పచ్చివడ్లను క్వింటాల్​కు రూ.2,200 ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్ధతు ధరకు దాదాపు సమానంగా మిల్లర్లు రేట్ఇస్తుండడంతో రైతులు వారివైపే మొగ్గుచూపుతున్నారు. సన్న వడ్లకు ఈసీజన్ నుంచి క్వింటాల్​కు రూ.500 చొప్పున బోనస్​ ఇవ్వాలని పాలకులు నిర్ణయించారు. కానీ, మిల్లర్ల కల్లాల దగ్గరే కొంటుండంతో  రైతులు ముందుగానే అమ్మేసుకుంటున్నారు. దీంతో వారు బోనస్​ నష్టపోవాల్సి వస్తోంది. 

వరుసగా మూడో సీజన్​

జిల్లాలో సాగు భూమి విస్తీర్ణం 5.53 లక్షల ఎకరాలుకాగా రెండేండ్ల నుంచి వరిసాగు అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుత ఖరీఫ్​లో రికార్డు స్థాయిలో 4.30 లక్షల ఎకరాలలో వరి పంట వేశారు. అందులో సన్నరకం వరి పంట 4.02 లక్షల ఎకరాలు కాగా, కేవలం 28 వేల ఎకరాలలో మాత్రమే దొడ్డురకం  పంట ఉంది. 'ఏ'గ్రేడ్​ వడ్లకు ప్రభుత్వ​మద్దతు ధర క్వింటాల్​కు రూ.2,320, కామన్​ రకం సన్నాలకురూ.2,300 రేట్​ కొనసాగుతోంది. మద్ధతు ధరకు అదనంగా  రూ.500 బోనస్​ను ప్రకటించింది. వెరసి క్వింటాల్​వడ్లకు కలిపి మొత్తం రూ.2,800 రేట్​ దక్కే అవకాశం ఉండటంతో జిల్లా రైతులు ఈసారి సన్న రకం వరి సాగు చేశారు. ​

 అయితే 2023–-24 ఖరీఫ్, యాసంగిలో​  కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మిల్లర్లు జిల్లాలో పండిన  వడ్లను  భారీగా కొనుగోలు చేశారు. భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రాల​లో వరిసాగు దెబ్బతినడంతో తెలంగాణకు వచ్చారు. ఈసారి కర్నాటక, ఆంధ్రప్రదేశ్​ స్టేట్​మిల్లర్లతోపాటు నల్గొండ, కోదాడ, ఖమ్మం, హైదరాబాద్​ జిల్లాల నుంచి 20 రోజుల కిందే వచ్చిన మిల్లర్లు జిల్లాలో వడ్లు కొనుగోళ్లు షురూ చేశారు. పచ్చివడ్లకు మొదట్లో క్వింటాల్​కు రూ.2,450 చెల్లించి ప్రస్తుతం రూ.2,200 ఇస్తున్నారు.  ఇప్పటిదాకా సుమారు నాలుగు లక్షల మెట్రిక్​ టన్నులు సేకరించినట్లు తెలుస్తోంది.  క్వింటాల్​ వడ్లకు రూ.30 కమీషన్​పై గ్రామాలల వారీగా ఏజెంట్లను నియమించుకుంటున్నారు. దీంతో  సర్కారు కొనుగోళ్ల లక్ష్యం దెబ్బతింటోంది. 

అంకెలు.. సంఖ్యలు దాటని ఆఫీసర్ల ప్రణాళిక

ఈ ఖరీఫ్​లో జిల్లాలో 12 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన ఆఫీసర్లు, అందులో 8 లక్షల టన్నులు 629 సర్కారు సెంటర్స్​ఏర్పాటు చేసి కొనాలని ప్రణాళిక రూపొందించారు.  సన్నరకం వడ్ల కోసం 465, దొడ్డురకానికి 164 సెంటర్లను  ఓపెన్​ చేస్తామని ప్రకటించారు. దసరా పండగ దాటినా ఇంకా సెంటర్లు తెరవలేదు. వడ్లు నింపడానికి కావాల్సిన 1.20 కోట్ల గన్నీ బ్యాగులు, టర్పాలిన్లు ఇంకా జిల్లాకు చేరలేదు.

 ప్రభుత్వ సెంటర్లు ఓపెన్​ అయితే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు రూ.500 బోనస్​ అంది ఆర్థికంగా లాభం పొందుతారు. బస్తాకు 3 కిలోల తరుగు తీసున్నా మిల్లర్లు చెల్లిస్తున్న  రేట్​ కాస్త పరవాలేదనుకున్నా రైతులు బోనస్​   మాత్రం  నష్టపోతున్నారు. పైగా ప్రభుత్వ​ కొనుగోళ్ల టార్గెట్​కు కూడా పెద్ద దెబ్బే.  వచ్చే జనవరి నుంచి రేషన్​ కార్డులకు సన్నబియ్యం అందించాలనే సర్కారు నిర్ణయంపై కూడా ఇది ప్రభావం చూపుతుందని అంటున్నారు.