Good News : మీ పిల్లలు అబద్దాలు చెబుతున్నారా.. అయితే వాళ్ల బ్రెయిన్ సరిగా పని చేస్తున్నట్లే..!

పిల్లలు అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే ఎవ్వరైనా ఏం చేస్తారు? అబద్దాలు చెప్పొద్దు. తప్పు' అనే చెప్తారు కదా ! ఎందుకలా చెప్తారంటే చిన్న వయసులోనే అబద్ధాలు చెప్పడం అలవాటైపోతే పెద్దయ్యాక అలాంటి అబద్ధాలు మరిన్ని చెప్తారని. ఆ అబద్ధాల వల్ల చుట్టూ ఉండే మనుషుల మధ్య మనకు చెడ్డ పేరొస్తుందని. ఇది మంచిదే! అయితే పిల్లలు అబద్ధాలు చెబుతున్నారంటే, కంగారు పడకుండా వాళ్ల మెదడు, ఆలోచనలు సరిగ్గా పనిచేస్తున్నాయని అర్థం చేసుకోవాలి.

రెండు, మూడేళ్ల నుంచే పిల్లలు అబద్ధాలు చెప్పడం మొదలుపెడతారని యూనివర్శిటీ ఆఫ్ టొరంటో స్టడీలో తేలింది. ఇలా అబద్ధాలు చెప్పినప్పుడు పిల్లలపై చెయ్యి చేసుకోకుండా, వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలని సైకాలజీ ప్రొఫెసర్లు చెబుతున్నారు. అబద్ధం చెబితే మెంటల్ డెవలెప్మెంట్ బాగుందని చెప్పినంత మాత్రాన అబద్ధాన్ని అలవాటు చేయాలని కాదు. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేకుండా, నిజాయితీగా ఉండటం ఎలాగో నేర్పిస్తే సరిపోతుంది.