ప్రస్తుతం వ్యవసాయం కల్తీ అయిపోయింది. యదేచ్చగా రసాయన ఎరువులు వినియోగం పెరిగింది. కానీ పూర్వ కాలంలో మెట్ట పంటలైన చిరు ధాన్యాలను ఎక్కువగా సాగు చేసేవారు. వీటినే అప్పటి వారు ప్రధాన ఆహారపు అలవాటుగా చేసుకున్నారు. చిరు ధాన్యాల్లో ముఖ్యమైనవి జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగలు, రాగులు, అరికలు, అండు కొర్రలు, ఊదలు, అవిసెలు, సామలు సాగు చేసి వందేళ్లు జీవనం సాగించారు.
ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీరిక లేకుండా ఉద్యోగాలు.. ఒత్తిడి.. టెన్షన్‌తో అందరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గింది. డబ్బు సంపాదనే ద్వేయంగా బ్రతుకు జీవనం కొనసాగిస్తుంది నేటి సమాజం. సాంప్రదాయ ఆహారాన్ని పక్కనపెట్టేసి విషపు ఆహారాన్ని లొట్టలేసుకుంటూ తినేస్తూ.. ఆకలిని చల్లార్చుకుంటున్నారు. ఇక ఆహారపు అలవాట్లలో మార్పులు జరగకపోతే ఆ ప్రభావం ఆరోగ్యంపై పడే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. మన తాత ముత్తాతలు బలమైన ఆహారాన్ని తీసుకోవడం మూలాన 100 ఏళ్లకు పైగా బ్రతికారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 ఏళ్లకే గుండె సంబంధిత వ్యాధులు, బిపి, షుగర్, అలసట లాంటి రోగాలు బారీన పడుతున్నారు. మరి కాస్త మనం తీసుకునే ఆహారంపై శ్రద్ద పెడితే ఆరోగ్య వంతులుగా మారి పది మందికి ఆదర్శంగా నిలిచే అవకాశం కూడా ఉంది.
కొర్రలు ( Korralu ): ఇవి రెండు రకాలు రుచిని కలిగి ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొర్రలు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి తీపి, వగరు రుచులను కలిగి ఉండటం వల్ల వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిలో అధిక పీచు, మాంసకృత్తులు , ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, తదితర విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. మూత్రంలో మంట, కడుపు నొప్పి, అతిసారం, ఆకలి లేకపోవడం మొదలైన సమస్యలకు మంచి ఔషధంగా పని చేస్తాయని, కాలిన గాయాలు, రక్తహీనత, ఊబకాయం, రక్తస్రావం, కీళ్లవాతం, గుండెజబ్బుల నుంచి త్వరగా కోలు కోవడానికి కొర్రలు మంచిగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుఫుణులు చెబుతున్నారు.
ఉదలు (Oodalu ): ఇవి ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుంది. దానికి కారణం ఏంటంటే…ఇవి శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతాయి. ఉద్యోగులు తమ సంస్థల్లో ఎక్కువసేపు కూర్చుని పని చేస్తారు. అయితే వారికి శారీరక శ్రమ లేని వారికి ఊదలు మంచి ఆహారమని, వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల మలబద్ధకం, మధు మేహానికి మంచిగా పనిచేస్తాయని చెబుతున్నారు వైద్యులు.
అరికెలు ( Arikelu ): ఇవి చిరుధాన్యాల్లో ముఖ్యమైనవి . వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. కాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా అరికెలు నివారిస్తాయని న్యూట్రిషన్లు సూచిస్తున్నారు. రక్తంలో కోలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు.
సామలు ( Samalu ): . వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అతిసారం, అజీర్ణం, సుఖ వ్యాధులు, శుక్రకణాల వృద్ధికి, ఆడవారిలో రుతు సమస్యలకు మంచి ఔషధంగా పని చేస్తాయని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా మైగ్రేన్ సమస్య ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. కీళ్ల నొప్పులు, ఊబకాయం, గుండె జబ్బుల నివారణకు ఇది మంచి ఆహారం.
ప్రస్తుతం అందరిలోనూ ఆరోగ్యంపై ఆసక్తి పెరగడంతో కొందరు చిరు ధాన్యాలతో ప్రత్యేకమైన అల్పాహారాన్ని తయారు చేసి అమ్ముతున్నారు. పలు హోటల్స్, రెస్టారెంట్స్ లలో చిరు ధాన్యాలను ఉపయోగించి బ్రేక్ ఫాస్ట్ తయారు చేసి ఆకట్టుకుంటున్నారు. వారికి ఆదాయమే కాకుండా వినియోగదారులకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు.