వెజ్​ ఫుడ్​తో డిప్రెషన్​ దూరం..శాకాహారుల్లో ప్రొటీన్, విటమిన్ సీ స్థాయిలు అధికం

 

  • శాకాహారుల్లో ప్రొటీన్, విటమిన్ సీ స్థాయిలు అధికం  
  • నాన్ వెజిటేరియన్లతో పోలిస్తే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ 
  • అందుకే శాకాహారుల్లో కుంగుబాటు, ఒత్తిడి తక్కువ 
  • హెచ్​సీయూ రీసెర్చర్ల అధ్యయనంలో వెల్లడి  

హైదరాబాద్, వెలుగు: మీరు డిప్రెషన్​ను దూరంగా తరిమేయాలని అనుకుంటున్నారా? మెదడు ఆరోగ్యాన్ని పెంచుకోవాలని ఉందా? మూడ్​ను మంచిగా ఉంచుకోవాలని భావిస్తున్నారా? అయితే.. వెజ్ ఫుడ్ తినాల్సిందే అంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్​సీయూ) రీసెర్చర్లు. మాంసాహారంతో పోలిస్తే శాకాహారం తినేవారిలో మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందని, డిప్రెషన్ తోపాటు యాంగ్జైటీ వంటి లక్షణాలు దరిచేరవని ఇటీవల హెచ్​సీయూలోని స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వరలక్ష్మి మంచన ఆధ్వర్యంలోని బృందం చేసిన స్టడీలో వెల్లడైంది. 

40 ఏండ్లు దాటిన 304 మంది ఆహారపు అలవాట్లు.. వారిలో మెదడు ఆరోగ్యంపై 6 నెలల పాటు అధ్యయనం చేసి వారు ఈ నిర్ధారణకు వచ్చారు. అంతేకాదు.. వెజిటేరియన్లలో వృద్ధాప్య జన్యువులు కూడా స్లో అవుతున్నాయని, ఫలితంగా వారిలో వృద్ధాప్య ఛాయలు కూడా కొంచెం ఆలస్యంగా వచ్చేందుకు ఆస్కారం ఉందని అధ్యయనంలో తేల్చారు. కూరగాయలు, ఆకుకూరలతో పాటు పండ్లు, పప్పు దినుసుల వంటి వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే అనారోగ్య సమస్యలు దరి చేరవని కనుగొన్నారు.  

ప్రొటీన్ ఎక్కువ.. బీ12 తక్కువ 

వెజ్ ఫుడ్ తినేవారిలో ప్రొటీన్ ఇన్​టేక్ బాగా ఉంటున్నట్టు వెల్లడైంది. క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సీ వంటివి అధికంగా వెజిటేరియన్ ఫుడ్స్ నుంచి లభిస్తున్నట్టు సైంటిస్టులు గుర్తించారు. అయి తే, వెజిటేరియన్లలో విటమిన్​ బీ12 లోపం మాత్రం కనిపిస్తున్నట్టు తేల్చారు. మాంసం, చేపలు తినేవారిలో కార్బొహైడ్రేట్స్, సోడియం, రైబోఫ్లేవిన్, ఐరన్, విటమిన్  బీ12 ఇన్ టేక్ ఎక్కువగా ఉంటున్నట్టు  నిర్ధారణకు వచ్చారు. మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లో ప్రొటీన్ ఇన్​టేక్ ఎక్కువగా ఉంటుండడం వల్లే వారి మెదడు ఆరోగ్యం మంచిగా ఉంటున్నట్టు సైంటిస్టులు గుర్తించారు. అంతేగాకుండా మాంసాహారులతో పోలిస్తే వెజిటేరియన్లలోనే రక్తంలో అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటున్నట్టు తేల్చారు. దాని వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిపోయి.. డిప్రెషన్, యాంగ్జైటీ వంటివి దూరం అవుతున్నాయని గుర్తించారు. వీరి రీసెర్చ్ వివరాలు ఇటీవల ‘యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్’లో ప్రచురితం అయ్యాయి.