వరంగల్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

వీరభద్రుడి హుండీ లెక్కింపు 

కురవి, వెలుగు: కురవి భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.39 లక్షల 4 వేల 29 సమకూరినట్లు ఆలయ ఈవో సత్యనారాయణ, చైర్మన్ కొర్ను రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ ఆదాయం నాలుగు నెలలు భక్తులు వేసిన కానుకల ద్వారా వచ్చినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షకులు వేణుగోపాల్, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

క్రీడా దుస్తుల పంపిణీ

జనగామ అర్బన్, వెలుగు : సీఎం కప్–2024 రాష్ట్ర స్థాయి క్రీడల్లో ఎంపికైన క్రీడాకారులకు పెద్ది వెంకటనారాయణ గౌడ్, జనగామ అథ్లెటిక్స్​అసోసియేషన్ అధ్యక్షులతో క్రీడాకారులకు గురువారం క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ దుస్తులను జనగామ అడిషనల్​కలెక్టర్​రోహిత్​సింగ్, పెద్ది వెంకట నారాయణ క్రీడాకారులకు అందజేశారు. 

 లైంగికదాడి కేసులో వ్యక్తి రిమాండ్ 

మహదేవపూర్, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు మహదేవపూర్ సీఐ కే.రామచందర్ రావు తెలిపారు. ఈనెల 23న పలిమెల మండలం సర్వాయిపేటకి చెందిన మహిళ లైంగికదాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. పలిమెల పీఎస్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితుడు రాజం సమ్మయ్య (45) ను ఎస్సై తమాషా రెడ్డి గురువారం అరెస్ట్ చేశారన్నారు. నిందితుడిని భూపాలపల్లి కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించామని సీఐ తెలిపారు. 

ఉద్యోగులను రెగ్యులర్​ చేయాలి 

ములుగు, వెలుగు : విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్​ చేయాలని ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లా భాస్కర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు గురువారం ములుగు కలెక్టరేట్​ సమీపంలో రోడ్లు ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. భాస్కర్​రెడ్డి మాట్లాడుతూ తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని, దీక్ష 17 రోజులు పూర్తయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కరుణాకర్, కోశాధికారి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తొర్రూరు పీఎస్​ తనిఖీ 

తొర్రూరు, వెలుగు: పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్ ను డీఎస్పీ గురువారం సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించి, పోలీసుల కవాతు, సిబ్బంది యూనిఫాం, సామాగ్రి కిట్టు ను తనిఖీ చేశారు. పెండింగ్ కేసులపై ఆరా తీసీ, పోలీసులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తొర్రూరు సీఐ జగదీశ్, ఎస్సై ఉపేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.