ఖమ్మం జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

కార్యకర్తను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు

ఖమ్మం టౌన్, వెలుగు : దాడి ఘటనలో గాయపడి ఖమ్మం నగరంలోని మమత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తిరుమలాయ పాలెం మండలం సుద్దవాగుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మల్లికార్జున్​ను  ఆపార్టీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్స్ ను కోరారు. మల్లికార్జున్​పై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. వారి వెంట బీఆర్ఎస్ ఖమ్మం రూరల్, తిరుమలయపాలెం మండల శాఖ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, బాషబోయిన వీరన్న, లీడర్లు రవి, ముత్యాల అప్పారావు, మహర్షి ఉన్నారు. 

దళితబంధు’ పేరుతో మోసం చేసిన ముగ్గురిపై కేసు 

కారేపల్లి, వెలుగు: దళితబంధు స్కీంలో లబ్ధిదారులుగా చేర్చుతామని డబ్బులు తీసుకొని మోసం చేసిన ముగ్గురిపై కారేపల్లి పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎస్సై రాజారామ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుంపెల్లగూడెం గ్రామానికి చెందిన ఎర్రబెల్లి సుమన్ అనే వ్యక్తి నుంచి అదే గ్రామానికి చెందిన బానోతు వీరన్న, భానోత్ అశోక్, భానోత్ సీత్యా దళిత బంధు స్కీంలో పేరు నమోదు చేపిస్తామని అతడిని నమ్మించారు. 

అందుకు సుమన్ వద్ద రూ.2.40 లక్షలు  తీసుకున్నారు. వీరు సుమన్ తో పాటు మరికొందరి వద్ద కూడా దళిత బంధు స్కీం పేరుతో డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. 

వెదజల్లే విధానంపై క్షేత్ర ప్రదర్శన 

కూసుమంచి, వెలుగు : రైతులకు వెదజల్లే విధానంపై కూసుమంచి ఏడీఏ సరిత క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. గురువారం మండలంలో నాయకన్​గూడెం, భగత్​వీడ్​ గ్రామాల రైతులకు భాస్వరం కరిగించే బ్యాక్టీరియాపై నారు కట్టలు పీఎస్బీ ద్రావణంలో ముంచే పద్ధతి, పొలంలో వర్మీ కంపోస్టుతో కలిపి వెదజల్లు విధానంపై సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో వాణి, ఏఈవో సౌమ్య, రైతులు పాల్గొన్నారు.

పెద్దమ్మ తల్లికి సువర్ణ పుష్పాభిషేకం

పాల్వంచ, వెలుగు : మండలంలోని ప్రసిద్ధి చెందిన పెద్దమ్మతల్లి దేవాలయంలో అమ్మవారిఉత్సవ విగ్రహానికి 108 బంగారు పుష్పాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మూల విరాట్టుకు హారతి, మంత్ర పుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలను ఆలయ ప్రధాన అర్చకులు రవికుమార్ శర్మ నిర్వహించారు. ఈవో ఎం.రజనీకుమారి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని  పలు వ్యాపార సముదాయాలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఆసక్తి కలిగినవారు నేరుగా వేలంలో పాల్గొనవచ్చునని ఆమె సూచించారు.