రైతుకు నేస్తం.. సర్కారు ఆపన్న హస్తం

 దేశానికి వెన్నెముక లాంటి రైతుకు ఆపన్నహస్తం అందించేవాడే నిజమైన నాయకుడు.  రైతు కేంద్రీకృత పాలన చేసేదే అసలు సిసలైన ప్రజా ప్రభుత్వం. ఓట్ల కోసమో, జనం మెప్పు  కోసమో కాకుండా రైతును రాజును చేయాలన్న సంకల్పంతో పాలన సాగుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం.  రైతు బంధుతో  దేశ వ్యవసాయ చిత్రపటంలో చరిత్రకెక్కిన తెలంగాణ ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీతో మరోసారి రికార్డులను బద్దలు కొడుతూ చరిత్రను తిరిగి రాయడం ముదావహం.

 తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ 2022 మే 6వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో ప్రకటించింది. అంతకుముందు, ఆ తర్వాత ప్రకటించిన డిక్లరేషన్లపై  రాజకీయపరంగా ఇప్పటికీ విమర్శలున్నాయి. అయితే,  రాష్ట్ర ఖజానాల్లో డబ్బులు లేకపోయినా, ఆర్థికపరమైన అడ్డంకులను అధిగమించి అధికారంలోకి వచ్చిన ఏడునెలల్లోనే  సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుని అమలు చేస్తుండడాన్ని అన్ని వర్గాలు స్వాగతించాలి. 

తెలంగాణ ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో  తెలంగాణ రైతాంగానికి  ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ అందచేస్తున్న సందర్భం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నది.  దేశానికి వెన్నెముకలాంటి  రైతుకు వెన్నుదన్నుగా ఉండాలని.. భారత  తొలి  ప్రధాని  పండింట్  జవహర్ లాల్ నెహ్రూ సాగునీటి రంగాన్ని వృద్ధి చేయాలని సంకల్పించి  ప్రాజెక్టులను నిర్మించి వాటిని ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు.  

ఆ తర్వాత భారత  రెండో ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి 1965లో  ప్రయాగ్ రాజ్ బహిరంగ సభలో జై జవాన్.. జై కిసాన్ నినాదాన్నిచ్చి  రైతాంగానికి, వ్యవసాయ రంగానికి తగు ప్రాధాన్యం ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ ప్రధానులు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో  రైతులకు ప్రాధాన్యతనిచ్చారు. కానీ, 2008లో ప్రధాని మన్మోహన్ నేతృత్వంలో జరిగిన రుణమాఫీ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. 

యూపీ, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో రుణమాఫీ జరిగినా ఇంత పెద్దమొత్తంలో  ఏకకాలంలో రూ.2లక్షల రైతు రుణమాఫీని ఎవ్వరూ చేయలేకపోయారు. దేశంలో ప్రధాని మన్మోహన్  హయాంలో  ఏక కాలంలో రూ.71వేల కోట్లతో రూ.లక్ష వరకు మాఫీ చేసి రికార్డులు బద్దలుకొడితే మళ్లీ అదే కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.31 వేల కోట్లతో రూ.2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టి మరోసారి చరిత్రను తిరగరాశారు. 

రైతుల ఉన్నతి కోసం వేలకోట్లు

దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే  రైతన్నల రుణ మాఫీ కోసం 31 నుంచి 33 వేల కోట్లు, రైతు భరోసా కోసం సుమారు రూ.10 వేల కోట్లు, పంట బీమా, రైతు బీమా 5 నుంచి పది వేల కోట్లు ఖర్చు పెడుతున్నది. ఇవేగాక పంట రుణాలు, ఇతరత్రా రుణాలు రాయితీల కోసం వేల ఖర్చు చేస్తున్నది. అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రం రైతు కోసం వెచ్చిస్తున్న ఖర్చు దాదాపు రూ.60వేల కోట్లు దాటుతున్నది. 

అంటే రాష్ట్ర బడ్డెట్​లో సింహభాగం రైతు సంక్షే మానికి ఖర్చు పెడుతుండడం సంతోషకరమైన పరిణామం. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా  ఉన్న పల్లెలను,  కర్షకులను ప్రకృతి వైపరీత్యాలు అంధకారంలో నెట్టివేస్తున్నాయి.  దీంతో దేశ వ్యవసాయం రంగం దెబ్బతింటున్నది. అందుకే ఆహార పదార్థాలు దిగుమతి చేసుకునే దుస్థితి ఏర్పడింది.  కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేవలం వ్యవసాయం మాత్రమే ప్రధాన జీవనాధారం. 

ఈ దశాబ్దపు పెద్ద పండుగ రుణమాఫీ

వాగు పొంగాలి.. సాగు పెరగాలంటే రైతు సంక్షేమం దిశగా తెలంగాణ వృద్ధి చెందాలి.  తెలంగాణ పల్లెల్లోని రైతువర్గాల్లో  పేదరికం ఇంకా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి సంక్షేమాలు ఊతమిస్తాయి. అందుకే పదేండ్ల పాలనా వైఫల్య సాఫల్యాలను సమీక్షిస్తూనే కొత్త వ్యవసాయ విధానాలు రూపొందిం చాల్సిన అవసరం ఉన్నది.  వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం నిజమైన రైతు కు రైతు భరోసాను అందించాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నది.  

అయితే రైతు భరోసా పథకం పై క్షేత్ర స్థాయిలో వర్క్ షాపులు నిర్వ హిస్తుండడం కూడా ఆహ్వానించదగ్గ అంశమే. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోన్న  రైతు రుణమాఫీ పథకం దేశంలోనే ఈ దశాబ్దపు అతి పెద్ద పండుగ అని చెప్పక తప్పదు.  పథకం అమలు తీరుతెన్నులపై ముఖ్యమంత్రి, మంత్రివర్గం సహా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అర్హుడైన ప్రతి రైతన్నకు రుణమాఫీని వర్తింపచేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.

 వెంకట్ గుంటిపల్లి,
తెలంగాణ
జర్నలిస్టుల ఫోరం