ఎకో టూరిజం హబ్​కు అడుగులు ప్రభుత్వ భూమిలో పట్టాలు క్యాన్సిల్.!

  • దేవునూరు శివారు ఇనుపరాతి గుట్టల్లోని సర్కారు భూమి గుర్తింపునకు కసరత్తులు
  • ముందుగా సర్వే నెంబర్ 531 కు డీమార్కేషన్
  • ప్రభుత్వ భూమిలో పట్టాలు తొలగించేందుకు ప్రతిపాదనలు
  • ఫారెస్ట్ ల్యాండ్ కు బౌండరీ లేక ఇబ్బందులు
  • అటవీ, రెవెన్యూ సిబ్బంది మధ్య కో ఆర్డినేషన్ లేక సమస్యలు

హనుమకొండ/ ధర్మసాగర్, వెలుగు: ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలోని ఇనుపరాతి గుట్టల్లో సర్కారు భూమి వివాదాల చెర వీడనున్నాయి. ఇప్పటికే ఇనుపరాతి గుట్టలను ఎకో టూరిజం హబ్ గా డెవలప్ చేసేందుకు అడుగులు పడుతుండగా, అక్కడున్న ప్రభుత్వ, ప్రైవేటు భూముల గుర్తింపునకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ భూమిని గుర్తించి, రికార్డులో అదనంగా నమోదై ఉన్న పట్టాలు క్యాన్సిల్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. కాగా, ఇనుపరాతి గుట్టల్లో ఫారెస్ట్, రెవెన్యూ భూముల వివాదానికి మాత్రం తెరపడటం లేదు. అటవీ భూములకు హద్దులు లేకపోవడం, రిజర్వ్ ఫారెస్ట్​ ప్రపోజల్ కాగితాలకే పరిమితమవడంతో ఇబ్బందులు తలెత్తుతుండగా, రెండు శాఖల మధ్య సమన్వయలేమి కూడా సమస్యగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

వివాదాల్లో సర్వే నెంబర్ 531..

హనుమకొండ జిల్లాలోని ఏకైన ఫారెస్ట్ ఏరియా ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల పరిధిలోని ఇనుపరాతి గుట్టల్లోనే ఉంది. ప్రభుత్వం ఈ అటవీ ప్రాంతంతోపాటు ధర్మసాగర్ రిజర్వాయర్ ను కలుపుతూ ఎకో టూరిజం హబ్ గా డెవలప్ చేసేందుకు ప్లాన్ చేసింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. కానీ, ఫారెస్ట్ ఏరియా అయిన ఇనుపరాతి గుట్టల్లో దేవునూరు శివారులోని సర్వే నెంబర్​ 531లోని ప్రభుత్వ భూమి విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. 

ఈ సర్వే నెంబర్ లో గతంలో 574.18 ఎకరాల పట్టా భూమి ఉండగా, ఉమ్మడి ఏపీలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్​-1973 ప్రకారం అప్పటి పట్టాదారులు 343.7 ఎకరాలను ప్రభుత్వానికి సరెండర్​ చేశారు. మిగతా 231.1 ఎకరాలు వారి పేరునే ఉండగా, ఆ ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​కు చెందినదే అంటూ సంబంధిత అధికారులు వాదిస్తున్నారు. అందులో పట్టాలు క్యాన్సిల్ చేయాల్సిందిగా పలుమార్లు రెవెన్యూ అధికారులకు లేఖలు కూడా రాశారు. కానీ ఆ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తరచూ ఎవరో ఒకరు ఆ భూములు తమవేనంటూ చదును చేస్తుండటంతో వివాదాలకు కారణమవుతోంది.

పట్టాల క్యాన్సిల్ కు ప్రపోజల్స్..

రెవెన్యూ రికార్డుల ప్రకారం పట్టాదారుల పేరున ఉన్న 231.1 ఎకరాలకు పాస్ బుక్ లు ఇష్యూ చేయొద్దని ఫారెస్ట్ ఆఫీసర్లు అబ్జెక్షన్ చెబుతున్నారు. అందులో 142 ఎకరాలకు ఏపీ, తెలంగాణ పాస్ బుక్ లు ఇష్యూ అయ్యాయి. వాటిని పట్టా చేసుకునే క్రమంలో ప్రభుత్వ భూమిని కూడా పట్టాచేసుకున్నారనే ఆరోపణలున్నాయి. అప్పటి పట్టాదారులు సర్కారుకు సరెండర్ చేసిన 343.7 ఎకరాల్లో 40 ఎకరాల భూమిని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 20 మందికి అసైన్​ చేయగా, ఇంకా అక్కడ సర్కారు ల్యాండ్ 303.7 ఎకరాలు ఉండాలి. 

కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం 225.16 ఎకరాలు మాత్రమే ఉంది. తాజాగా కాంగ్రెస్ సర్కారు ఇనుపరాతి గుట్టలు, ధర్మసాగర్ రిజర్వాయర్ ను కలుపుతూ ఎకో టూరిజం హబ్ గా డెవలప్ చేసేందుకు ప్రపోజల్స్ కోరింది. ఇందులో భాగంగానే జిల్లా అధికారులు ముందుగా ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించే పనిలో పడ్డారు. ఈ మేరకు గత నెలలోనే 531లోని భూమిని సర్వే చేయించి, హద్దులు నిర్ణయించారు. ఈ సర్వే నెంబర్​లో దాంట్లో దాదాపు 90 ఎకరాల వరకు ఇతరుల పేరున ఎక్కువగా నమోదై ఉన్నట్లు గుర్తించారు. దాని ప్రకారం ఓ ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన పట్టాలు క్యాన్సిల్ చేసేందుకు స్థానిక ఎమ్మార్వో కలెక్టర్ కు ప్రతిపాదనలు 
పంపించారు.

సమన్వయం సమస్య..

ఇనుపరాతి గుట్టలను ఎకో టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు సర్కారు అడుగులు వేస్తున్నా, ఫారెస్ట్ ల్యాండ్స్ కు హద్దులు లేకపోవడం సమస్యగా మారింది. దీంతో తరచూ ఫారెస్ట్ ఆఫీసర్లు, ప్రైవేటు వ్యక్తులకు గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు సర్వే నెంబర్​ 531లోని ల్యాండ్ ప్రభుత్వ భూమేనని రెవెన్యూ అధికారులు అంటుండగా, ఫారెస్ట్ ల్యాండేనని ఆ డిపార్ట్​మెంట్ ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో ఫారెస్ట్, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం లేక సమస్య వస్తుందని చర్చ నడుస్తోంది. ఈ సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే ఇనుపరాతి గుట్టల్లోని భూ వివాదాలకు చెక్ పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

కలెక్టర్ కు ప్రపోజల్స్ పంపించాం

ఎకో టూరిజం హబ్ కోసం ప్రభుత్వ భూమిని గుర్తించాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు దేవునూరు సర్వే నెం.531 భూములను సర్వే చేయించాం. రికార్డుల ప్రకారం ఎక్కువగా నమోదై ఉన్న పట్టాలను తొలగించేందుకు కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మిగతా చర్యలు తీసుకుంటాం. - జి.సదానందం, ఎమ్మార్వో, ధర్మసాగర్​