కేసీఆర్ వల్లే ఆలేరుకు గోదావరి జలాలు

యాదగిరిగుట్ట, వెలుగు : బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే నేడు ఆలేరుకు గోదావరి జలాలు వచ్చాయని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్టలోని గొంగిడి నిలయంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు కేసీఆర్ కట్టింది నిజం కాదా.? అని ప్రశ్నించారు. 2022లోనే గోదావరి జలాలతో యాదగిరిగుట్టలోని గండిచెరువును నింపామని.. కానీ గోదావరి జలాలు ఆలేరుకు ఇప్పుడే మొదటిసారి వస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

గత ఐదేండ్లగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఆలేరుకు సాగు, తాగునీరు అందుతున్నాయని తెలిపారు. కురుమూర్తి, వేములవాడ ఆలయాలకు వెళ్లి అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. యాదగిరిగుట్టకు ఎందుకు ఫండ్స్ ప్రకటించలేదని ప్రశ్నించారు. యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్ రావు ప్రభుత్వ ఉద్యోగిగా కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఆలయ ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఎందుకు తొలగించలేదని ఈవోను ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్, పట్టణ సెక్రటరీ జనరల్ నరహరి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.