రోడ్లు క్వాలిటీగా వేయకపోతే ఇట్టే పట్టేస్తరు .. కొద్దిరోజులకే ఖరాబ్ ​అవుతున్న రోడ్లపై GHMC దృష్టి

  • నాలుగు దశల్లో  టెస్టులు పరీక్షలు చేసేందుకు 5 ఇంజినీరింగ్ కాలేజీలతో ఒప్పందం 
  • ఫైనల్ టెస్టుల కోసం ఏడు ప్రైవేట్ ల్యాబ్స్​తో అగ్రిమెంట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో రోడ్లు వేసిన కొద్దిరోజులకే పాడవుతుండడంతో బల్దియా మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు దృష్టి పెట్టారు. గ్రేటర్ లో 9,013 కిలోమీటర్ల మేర రోడ్లున్నాయి. ఇందులో 6,167 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లుండగా, 2,846  కిలోమీటర్లు బీటీ రోడ్లున్నాయి. ఇందులో 812  కిలోమీటర్ల మెయిన్​రోడ్ల మెయింటెనెన్స్ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించగా.. మిగతా అన్ని రోడ్లను బల్దియానే స్వయంగా నిర్వహిస్తోంది. రోడ్ల నిర్వహణ కోసం బల్దియా ఏటా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. 

2004–14 మధ్య రోడ్ల కోసం రూ.2,700 కోట్లు ఖర్చు చేయగా, 2014 నుంచి 2024 వరకు రూ.4500 కోట్లు ఖర్చు పెట్టింది. అయినా సిటీలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు వేసిన కొద్ది నెలలకే డ్యామేజ్ అవుతున్నాయి. కాంట్రాక్టర్లు క్వాలిటీ పాటించకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలా జరుగుతోందని ఉన్నతాధికారులు గుర్తించారు. రోడ్ల నాణ్యతను తేల్చేందుకు సిటీలోని ఏడు ప్రైవేట్ ల్యాబ్స్​తో పాటు, 15 ఇంజినీరింగ్ కాలేజీలతో టెస్టులు చేయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. 

నాలుగు సార్లు తనిఖీలు

ఇండియన్​రోడ్ ​కాంగ్రెస్​ ప్రకారం బీటీ రోడ్డు వేస్తే ఆరేండ్ల వరకు, సీసీ రోడ్డయితే పదేండ్ల వరకు చెడిపోకుండా ఉండాలి. కానీ, ప్రస్తుతం వేస్తున్న రోడ్లపై నెలల వ్యవధిలోనే గుంతలు పడుతున్నాయి. దీంతో కాంట్రాక్టర్లు రోడ్డు వేశాక అధికారులు నాలుగు సార్లు టెస్టులు చేయించనున్నారు. మొదటి దశలో బల్దియా, రెండో దశలో కాంట్రాక్టర్లు, మూడో దశలో ఇంజినీరింగ్ కాలేజీలు, చివరి దశలో ల్యాబ్​లు శాంపిల్స్​కలెక్ట్ చేసి టెస్టులు చేస్తాయి. రోడ్డు వేసిన తర్వాత  ముందుగా కాంట్రాక్టర్లు శాంపిల్స్ ​తీసుకువచ్చి బల్దియా క్వాలిటీ సెల్​కి ఇస్తే వారు చెక్ చేస్తారు. తర్వాత బల్దియా అధికారులు రోడ్డు వేసిన ప్రాంతానికి వెళ్లి మూడు ప్లేసుల్లో శాంపిల్స్​ కలెక్ట్​చేసి చెక్ చేస్తారు. తర్వాత థర్ట్ పార్టీ కింద ఒప్పందం చేసుకున్న ఇంజినీరింగ్ కాలేజీలు శాంపిల్స్​ కలెక్ట్ చేసి టెస్టులు నిర్వహిస్తాయి. 

ఫైనల్​గా ల్యాబ్​లకి సంబంధించిన వారు కూడా శాంపిల్స్​ చెక్ ​చేస్తారు. ఈ నాలుగు దశల్లో ఫలితం ఒక్కటి అయితేనే బిల్లులు రిలీజ్ చేస్తారు. క్వాలిటీ చెకప్ కోసం 0.3 శాతం కాంట్రాక్టర్లు చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 లక్షల పని అయితే బల్దియా మూడు చోట్ల, ల్యాబ్ ఒక శాంపిల్​ను కలెక్ట్​ చేస్తుంది. రూ.2కోట్ల పని అయితే  ఐదు శాంపిల్స్​ తీసుకుంటారు. ఇంతకుమించి రూ. ఒక్కో కోటికి ఒక శాంపిల్​ అదనంగా కలెక్ట్ చేసి టెస్టులు చేయనున్నారు. 

ల్యాబ్ లు, సెంటర్లు ఇవే.... 

నగరంలోని స్టెండెంట్, స్టాండర్స్, మంగళం, సికాక్స్, ఎస్ కే కన్సల్టెన్సీ, సుపిరియల్, ఇస్కి ల్యాబ్​తో బల్దియా  ఒప్పందం చేసుకుంది. ఫోర్త్ పార్టీ కింద ఈ ల్యాబ్స్​ టెస్టులు చేయనున్నాయి. బల్దియా అధికారుల నుంచి సమాచారం అందగానే ఆయా ల్యాబ్స్ ​శాంపిల్స్​కలెక్ట్ చేసి టెస్టులు చేసి రిపోర్టు బల్దియాకు అందజేస్తాయి. ఇలా ఒక్కో పనికి ఒక్కో ల్యాబ్ ద్వారా టెస్టులు చేయించనున్నారు. అలాగే ఇంజినీరింగ్ కాలేజీలు కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసి  థర్డ్ పార్టీ టెస్టులు నిర్వహించి రిపోర్ట్ ఇస్తాయి. దీని కోసం జేఎన్​టీయూ, వీఎన్ఆర్, మల్లారెడ్డి, మెథడిస్ట్, సీబీఐటీ, గోకరాజు–రంగరాజు, వర్దమాన్, ఇస్కిలతో పాటు మరో 7 కాలేజీలతో జీహెచ్ఎంసీ ఒప్పందం చేసుకుంది. కొద్దిరోజుల్లోనే ఈ టెస్టులు మొదలుకానున్నాయి.