జనవరి 22న లక్షలాది మంది ప్రజలు అయోధ్యకు వెళ్తారు. కాబట్టి వాళ్లకోసం ఆయా ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రయాణ సదుపాయాలు కల్పిస్తున్నాయి. అవేంటంటే...
ఉచితంగా రైల్లో..
ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య వెళ్లే భక్తుల కోసం వార్షిక ఉచిత రైలు ప్రయాణ పథకాన్ని తీసుకొచ్చింది. దాంతోపాటు ప్రధాని ఉచిత రైలు ప్రయాణం కల్పించాలన్న హామీ కూడా నెరవేరుతుందని ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ చెప్పారు. ఈ రైల్లో ప్రయాణించే వాళ్ల వయసు 18 నుంచి 75 ఏండ్ల మధ్య ఉండాలి. వాళ్లు ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటేనే పథకానికి అర్హులు. దాదాపు 20 వేల మందికి పైగా ఈ రైలు ద్వారా అయోధ్యకు వెళ్లే అవకాశం ఉంది. ఈ పథకాన్ని ఛత్తీస్‌గఢ్ టూరిజం బోర్డ్ నిర్వహిస్తుందని, దానికి అవసరమైన బడ్జెట్‌ని రాష్ట్ర పర్యాటక శాఖ అందిస్తుంది. రైల్లో ఫుడ్, డ్రింక్స్ ఐఆర్సీటీసీ చూసుకుంటుంది.
ఛత్తీస్‌గఢ్ నుంచి అయోధ్యకు ట్రైన్ జర్నీ అంటే.. దాదాపు 900 కిలో మీటర్ల ప్రయాణం. ఆఖరి స్టేషన్ అయోధ్య. రాయ్‌పూర్, దుర్గ్, రాయ్‌గఢ్, అంబికాపూర్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. భక్తులు వారణాసిలో రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ కాశీ విశ్వనాధుడి టెంపుల్‌కి తీసుకెళ్తే వాళ్లు గంగా హారతిలో పాల్గొంటారు. జనవరి 22న ఆ రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించింది ప్రభుత్వం.
బోటు జర్నీ ఫ్రీ
వారణాసిలో మొత్తం 84 గంగా ఘాట్స్‌లో జనవరి 22న ఉచిత ప్రయాణం. గంగా నిషద్ రాజ్ సేవా ట్రస్ట్ సెక్రటరీ శంభు సాహ్ని మాట్లాడుతూ.. ‘‘నిషద్ వర్గంతో శ్రీరాముడికి గొప్ప సంబంధం ఉంది. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత అడవి గుండా వెళ్లేటప్పుడు నిషద రాజు వారిని ఉచితంగా నది దాటించార’’ని గుర్తు చేశాడు ఆయన.
110 విమానాలు
అయోధ్యకు వీఐపీలు, వీవీఐపీలు వెళ్తుండడంతో అక్కడి ఎయిర్‌పోర్ట్‌కు 200 వరకు అభ్యర్థనలు వచ్చాయి. అయితే, అందులో 110 విమానాలకు మాత్రమే అనుమతి ఇస్తాం అంటున్నారు అధికారులు.
నేరుగా 72 రైళ్లు
అయోధ్యకు వెళ్లే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే స్పెషల్ ప్లాన్ డిజైన్ చేసింది. ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ ఫెసిలిటీస్ ఉన్న అన్ని రకాల రైళ్లను నడిపేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం అయోధ్యకు 35 రైళ్లు నడుస్తున్నాయి. రోజూవారీ రైళ్లతో పాటు, వీక్లీ రైళ్లు కూడా ఉన్నాయి ఇందులో. ఈ రైళ్లతోపాటు జనవరి 22 నుంచి 37 అదనపు రైళ్లు నడుస్తాయి. దీంతో ‘దేశంలోని 430 నగరాల నుంచి అయోధ్యకు 72 రైళ్లు నడుస్తాయి. మరిన్ని నగరాలను నేరుగా అయోధ్యకు అనుసంధానం చేసేందుకు కూడా రైల్వే శాఖ ప్రయత్నిస్తోంద’ని రైల్వే అధికారి శివాజీ మారుతీ సుతార్ చెప్పారు.
సైకిల్ యాత్ర
మహారాష్ట్రకు చెందిన యశ్ యోలే, అంకేశ్ గుప్తా అనే ఇద్దరు యువకులు అయోధ్యకు సైకిల్ యాత్ర చేపట్టారు. జనవరి 22న జరగబోయే రామ మందిర ప్రారంభోత్సవానికి చేరుకునేలా ప్లాన్ చేసుకున్నారు వాళ్లు. మొత్తం1,600 కిలో మీటర్ల ప్రయాణాన్ని 25 రోజుల్లో పూర్తి చేయాలనేది వాళ్ల ప్లాన్. యాత్రలో భాగంగా దారిలో వచ్చే ఆలయాలను కూడా దర్శించుకుంటున్నారు.
ఇప్పటివరకు చేసిన సేవింగ్స్‌తో పాల్గఢ్ నుంచి అయోధ్యకు సైకిల్ యాత్ర చేయాలనుకున్నారు. ‘ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న రామ మందిరం కల ఇప్పుడు నిజమైనందుకు సంతోషంగా ఉంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ముందే అక్కడికి చేరుకుని మర్యాద పురుషోత్తముడి పాదాలకు నమస్కరించాలి” అనుకుంటున్నారు ఆ ఇద్దరు. అయోధ్య కంటే ముందు సైకిల్‌పై పాల్గఢ్ నుంచి ద్వారక వరకు వెళ్లారు ఈ ఇద్దరు. మొదటిసారి ద్వారకకు చేరుకోవడానికి ఎక్కువ టైం పట్టిందట. అయితే డిసెంబర్ 30, 2023 నాటికి 300 కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ ప్రయాణంలో పర్యావరణం, ఇతర విషయాలను స్టడీ చేయాలనే ఆలోచన ఉంది.
రోడ్డు మార్గంలో..
హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఉన్నాయి. ఏసీ బస్సుల్లో ఒక టికెట్ ధర దాదాపు ఆరువేల వరకు ఉంటుంది. 42 గంటల తర్వాత ఢిల్లీకి వెళ్తారు. ఒకవేళ హైదరాబాద్ నుంచి సొంత వెహికల్లో అయోధ్యకు వెళ్లాలనుకుంటే నాగ్‌పూర్, జబల్పూర్, ప్రయాగ్ రాజ్ మీదుగా వెళ్లొచ్చు. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే మొత్తం1305 కిలో మీటర్లు జర్నీ చేయాలి.