నిజామాబాద్​ జిల్లాలో .. సన్నాల సాగుకే అన్నదాతల మొగ్గు

  • వరి సాగయ్యే 4.30 లక్షల ఎకరాల్లో  4.02 లక్షలు సన్నాలే

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​ జిల్లాలో ఈ  ఖరీఫ్​​ సీజన్ లో  రైతులు సన్నం రకం వరి వైపే మొగ్గు చూపుతున్నారు.  ఎంఎస్​పీ రేట్​ కంటే  కర్నాటక, ఆంధ్ర ప్రాంత మిల్లర్లు ఎక్కువ రేట్​ పెట్టి కొంటుండటంతో అన్నదాతలు సన్నరకం సాగు వైపు మళ్లారు. ఈసారి అదనంగా గవర్నమెంట్​ రూ.500 బోనస్​ ప్రకటించడంతో సన్న వడ్ల సాగుకు ఫిక్స్​ అయ్యారు. మిల్లర్లు, లేదా సర్కారు ఎవరు కొనుగోలు చేసినా లాభసాటిగా ఉంటుందనే నమ్మకంతో రైతులు సన్నాల సాగుకే ప్రయార్టీ ఇస్తున్నారు.

పచ్చి వడ్ల కొనుగోలుతో  సీన్​ రివర్స్​

జిల్లాలో సాగు భూమి 5.53 లక్షల ఎకరాలు ఉండగా రెండేండ్ల కింద వరకు రైతులు 3.60 లక్షల ఎకరాల్లో వరి పండించేవారు. ఇందులో దొడ్డురకం వరి సాగు 2.40 లక్షల ఎకరాల పైనే  ఉండేది.  గవర్నమెంట్​ దొడ్డు రకాలను 'ఏ' గ్రేడ్ కింద​, సన్నాలను కామన్​ వెరైటీగా పరిగణించి ఆరబెట్టిన ధాన్యాన్ని 17 శాతం తేమతో కొనుగోలు చేస్తుంది.  దొడ్డురకం వడ్ల రేట్​ కాస్త అధికంగా ఉండేది.

దీనికి తోడు ఆ పంటలకు చీడపీడల బెడద తక్కువ ఉండడంతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో దొడ్డురకాల సాగుకు ఆసక్తి చూపేవారు. సన్నాలతో పోలిస్తే  దొడ్డు పంట  దిగుబడి ఎకరానికి ఐదారు బస్తాలు ఎక్కువగానే వస్తుంది. అయితే గతేడాది ఖరీఫ్​లో కర్నాటక, ఆంధ్ర, నల్లొండ, హైదరాబాద్​ నుంచి వచ్చిన మిల్లర్లు సర్కారు ఎంఎస్​పీ కంటే రూ.600 అధికంగా చెల్లించి క్వింటాల్​ వడ్లకు రూ.2,800 స్పాట్​ పేమెంట్​తో కొనుగోలు చేశారు. దీంతో రైతులకు ఊహించని రీతిలో  లాభం చేకూరింది.

లాభం రావడంతో సన్నాల వైపు

 2023–-24  ఖరీఫ్​ లో లాభం రావడంతో యాసంగిలో సన్నాల సాగును ఏకంగా 4.0 లక్షల ఎకరాలకు పెంచేశారు. యాసంగిలో కేవలం 25 వేల ఎకరాల్లో మాత్రమే దొడ్డు రకం వరిని పండించారు. 
.
సాధారణ విస్తీర్ణం దాటిన వరిసాగు

జిల్లాలో సాధారణ వరిసాగు విస్తీర్ణం 3.60 లక్షల ఎకరాలే. సన్న రకం ధాన్యానికి మంచి ధర పలుకుతుండటంతో విస్తీర్ణం పెరిగి ఇప్పుడు 4.30 లక్షల ఎకరాలకు చేరింది. ఇందులో సన్నాలే 4.02 లక్షల ఎకరాలుండడం గమనార్హం. ఈ ఖరీఫ్​లో సాగైన సన్నరకం వడ్లను ఎంఎస్​పీ కంటే రూ.500 బోనస్​ చెల్లించి కొంటామని గవర్నమెంట్​ ప్రకటించడంతో రైతులందరూ సన్నరకం వైపు మొగ్గారు. బడ్జెట్​లో రూ.1,800 కోట్ల ను ఇందుకోసం గవర్నమెంట్  కేటాయించింది.

సర్కారు ఐడెంటీఫై  చేసిన 33 సన్న రకాల్లో జిల్లా వాతావరణానికి సూట్​ అయ్యే బీపీటీ 5204, జైశ్రీరాం, ఆర్​ఎన్​ఆర్​ 15048, వరంగల్​ సన్నాలు, జగిత్యాల సన్నాలు, సిద్ధి 44 తదితర పది రకాలు జిల్లాలో సాగవుతున్నాయి. మొన్నటి యాసంగి నుంచి కేంద్ర సర్కారు 14 రకాల పంటలకు ఎంఎస్​పీ రేట్లు పెంచగా ఆ లిస్టులో ఉన్న దొడ్డురకం వడ్ల ధర క్వింటాల్​కు రూ.2,320, కామన్​ వైరైటీకి రూ.2,300 ఉంది.  దీనికి అదనంగా స్టేట్​ గవర్నమెంట్​ బోనస్​ రూ.500 లభించనుంది. గతేడాది తరహాలో ఒకవేళ మిల్లర్లు కొనుగోలు చేసినా రైతులకు లాభమే చేకూరే అవకాశం ఉంది.  మిగిలిన 28 వేల ఎకరాల్లో భూమి స్వభావాన్ని బట్టి దొడ్డు రకం ధాన్యం సాగు చేస్తున్నారు.