పోలికలతో పిల్లలను ఒత్తిడి చేయకండి!

పిల్లలను ప్రతిభావంతులతో పోల్చడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, పిల్లలను పక్క పిల్లల చదువులతో, మార్కులతో, పొడుగూ, పొట్టీ విషయాల్లో  పోల్చి వారిని తక్కువ చేయకూడదు. దీనివల్ల పిల్లల్లో ఆత్మన్యూనత భావం పెరిగి కుంగిపోతారు. పిల్లలను మరొకరితో పోల్చి తక్కువ చేయటం వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఎక్కడో చాలా రోజుల క్రిందట చదివినమాట. ఎంసెట్‌‌ రాసిన విద్యార్థులు, విద్యార్థినులు పరీక్ష రాసి బయటకు వస్తున్న తరుణంలో ఆ పిల్లల తల్లిదండ్రులు ఆత్రుతతో వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరీక్షే  వారిని డాక్టర్లుగానో, ఇంజినీర్లుగానో  మరింకేదో పెద్ద ఉద్యోగంలోకి దారితీసే నిచ్చెనలా తల్లిదండ్రులు భావించారు. అందుచేత అంతమంది గుమిగూడి వచ్చిన తమ పిల్లలను  ఏవిధంగా పరీక్ష రాశారో  ఆత్రంగా అడిగి తెలుసుకుంటున్నారు. 

ఒక తండ్రి ఎదురుగ్గా వస్తున్న కొడుకును ‘ఏంరా?  పరీక్ష బాగా రాశావుగా?’ అని అడిగాడు.  ఆ పిల్లవాడు ఏమీ మాట్లాడలేదు. ‘చెప్పవేం - ఎలా రాశావ్‌‌?’ గుచ్చిగుచ్చి అడిగాడు.  కొడుకు నిశ్శబ్దమే తండ్రికి జవాబయింది.  లాభం లేదనుకొని పక్కనే  వెళ్తున్న  ఇన్విజిలేటర్‌‌  తెలిసినవాడవటంచేత ఆపుచేసి - మావాడు ఏ విధంగా రాశాడు?’ అని అడిగాడు.  ‘మా సహాయం మేము చేయాలని ప్రయత్నం చేశాం. అతను వింటేగదా? అని మాస్టర్​ అన్నాడు. అంతే..తండ్రికి కోపం తారస్థాయికి చేరుకుంది. కొడుకు లెంపమీద ఒకటి గట్టిగా ఇచ్చాడు.  ఇంతకంటే పేరెంట్స్‌‌, - టీచర్స్‌‌ - ఏం చేయగలరురా’’ అన్నాడు. అప్పటిదాకా నిశ్శబ్దంగా వున్న ఆ కొడుకు చెంప నిమురుకుంటూ ‘ఇప్పుడే కాదు - నేనెప్పుడూ అలాంటి తప్పుడు పని చేయను’ అని ధైర్యంగా తండ్రిని తోసుకుంటూ వెళ్ళిపోయాడు. పెద్దలు విచక్షణా జ్ఞానం కోల్పోయినా ఆ పిల్లవాడు కోల్పోకపోవటమే విశేషం. కానీ, చిన్నప్పటి నుంచీ అలాంటి విజ్ఞత కలిగిన పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు.

పెద్దల వీరంగం

ప్రోగ్రెస్‌‌ రిపోర్టులో తక్కువ మార్కులు వచ్చిన పిల్లలను తెగ ఆడిపోసుకొంటారు పెద్దలు. నానా హంగామా చేస్తారు.  ‘ఆ రాముగాడిని చూడు. అన్నిట్లోనూ ఫస్ట్‌‌. - నువ్వూ ఉన్నావ్‌‌  అన్నిట్లోనూ లాస్ట్‌‌’. తలొంచుకొని ఆ పిల్లవాడు ‘ఎందుకీ జీవితం?’ అన్నట్లు ఆలోచనలో ఉంటాడు.  వారిని అంతటి మనోవేదనకు గురిచేస్తోంది ఆ పోలిక.  పోలికలతో పిల్లల జీవితాలను తల్లిదండ్రులు పాడు చేయొద్దని ఈ కాలంలో ఎవరు హెచ్చరిస్తారు?. గత కాలంలో జాయింట్​ఫ్యామిలీలు ఉండేవి.  తాతో,  నాయనమ్మో, పెద్దనాన్నో - ఎవరో అలాంటి పిల్లలను దగ్గరకు తీసి మనసులోని బాధను తీసివేసేలా అనునయించి వారిలో మనోధైర్యాన్ని నింపేవారు. మనో వైజ్ఞానికుడు పట్టాభిరాం ఇలాంటి సందర్భాలలో ఒక సరదా అనుభవాన్ని చెప్పేవారు. ఒక తండ్రి తన కొడుకు ఫెయిల్‌‌ అయినందుకు బాగా మందలిస్తే వాడు ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోయాడట. అటు తర్వాత తండ్రి వెతికీవెతికీ చివరకు తన తండ్రి అంటే ఆ పిల్లవాడి తాత చాటున నక్కి ఉండటం గమనించి - ‘వెధవా ఇక్కడున్నావా?.  చూడు నాన్నా వీడు టెన్త్‌‌ ఫెయిల్‌‌ అయ్యాడు.- నువ్వేమో మందలించకుండా వాడిని ముద్దు చేస్తున్నావ్‌‌.  ఇలా అయితే వాడు జీవితంలో ఎలా పైకి వస్తాడు?’ అని కంప్లయంట్‌‌ చేసినప్పుడు..- ‘నువ్వు రాలేదురా పైకి.. టెన్త్‌‌ అయిదుసార్లు ఫెయిల్‌‌ అయ్యి.. అలాగే నా మనవడు కూడా.   అరేయ్‌‌ నువ్వు  ఒక్కసారే  ఫెయిల్‌‌ అయ్యావ్‌‌. - మీ నాన్న అయిదుసార్లు ఫెయిల్‌‌ అయ్యాడు.- ఏం ఫర్వాలేదు. ఈసారి నువ్వు బాగా చదివి పరీక్ష పాసవుతే  నీకు సైకిల్‌‌ కొనిస్తాను’’ అని ఆ పిల్లవాడిని మోటివేట్‌‌ చేసి ప్రోత్సహించాడట. పిల్లల మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన పద్ధతి ఇదీ.

పిల్లల అభిరుచిని గుర్తించాలి 

 నేనిదే చేయాలి అని లక్ష్మణ రేఖ దాటగూడని ప్రయత్నం చేయకూడదు. ఏది ఇష్టమయిందో ,  దేంట్లో అభిరుచి ఉందో గుర్తించటం జరిగితే  ఏ రేఖలూ అతని ఎదుగుదలను ఆపలేవు. అన్నీ అందరూ చేయటానికి ప్రయత్నిస్తే ప్రపంచంలోని అందరి జీవితాలు అల్లకల్లోలం అవుతాయి. ఎ వరికి వారు ప్రత్యేకం. - ఆ ప్రత్యేకతను  నిలుపుకొనే దిశగానే జీవనం సాగించాలి అని చిన్నప్పటి నుంచే అనుకోవాలి.  ఆవిధంగానే  చేయటం సాగిస్తే - పోలికల  సమస్యే ఉండదు. వాటి ప్రభావం ఉండనే ఉండదు.  సోషల్‌‌ మీడియాతోపాటు  టీవీలు,  సినిమాలు పోలికల ప్రసక్తి అనుకోకుండానే తీసుకొనివచ్చి ఈ రోజుల్లో పిల్లలను ప్రభావితం చేసే ప్రమాదం ఎక్కువ అవుతున్నది.  పాతకాలం వారికి ఈ ప్రమాదం బహు తక్కువ. అందుకనే ఇప్పటి పెద్దలు వాటి ప్రభావానికి పిల్లలు లోను కాకుండా చూస్తే చాలు.  వారి కర్తవ్య నిర్వహణ సక్రమంగా జరుగుతున్నట్లే లెక్క.  ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దలు ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పిల్లలకు మోటివేషన్ అవసరం

చాలామంది పిల్లలకు ఎదుగుతున్న వయసులో మోటివేషన్‌‌ ఎంతో అవసరం.  ఒకరిని మరొకరితో  అసందర్భంగా మనసు పాడయ్యేలా ముఖ్యంగా చిన్న వయసులో  పోల్చగూడదు.  పిల్లలు వ్యక్తిత్వాన్ని మలుచుకుంటున్న దశలో  తప్పుపట్టే ఏ పోలిక అయినా వారిలో ఆత్మన్యూనతా భావాలను కలిగిస్తుంది.  ఎవరి బలాలు, బలహీనతలు వారికుంటాయి.  వారే ఏదో ఒక దశలో తమ బలహీనతలను సరిదిద్దుకుంటారు.  బలాలను మరింతగా వృద్ధి చేసుకుంటారు. పిల్లలు ఎదుగుతున్న దశలో తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏమిటంటే వారినివారు కూడా ఇంకొకరితో పోల్చుకోగూడదు. వారిలోని శక్తి,  టాలెంట్‌‌  మేరకు వృద్ధి పొందే  ప్రయత్నం చేసుకుంటే వారికి తగ్గ ఫలితాలు వస్తాయి.  ప్రతివాడిలోనూ ఏదో ఒక టాలెంట్‌‌ ఉంటుంది. ఒకరికి ఉన్న టాలెంట్​ మరొకరికి ఉండాల్సిన అవసరం లేదు. తనకున్న  క్రికెట్‌‌ టాలెంట్‌‌తో  దేశం గర్వించదగ్గ ఆటగాడుగా ఒకరు పైకి వస్తే - మరొకరు - తన చదువుతో పెద్ద ఉద్యోగం సంపాదించుకొని గుర్తింపు పొందుతాడు. 

- రావులపాటి సీతారాంరావు,
ఐపీఎస్​(రిటైర్డ్​)