గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసింది : ఆకునూరి మురళి

  • పటిష్టమైన విద్యావ్యవస్థ కోసమే విద్యా కమిషన్‌‌‌‌ ఏర్పాటు 

నల్గొండ అర్బన్, వెలుగు : పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ నాశనమైందని విద్యా కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ ఆకునూరి మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు.  నల్గొండ కలెక్టరేట్‌‌‌‌లో మంగళవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు విద్యావేత్తలు, మేధావులు, అధ్యాపక, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ప్రొఫెసర్లు, తల్లిదండ్రులు, స్టూడెంట్లు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ విద్యావ్యవస్థను పటిష్టం చేయాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్‌‌‌‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. 

విద్యా వ్యవస్థలో కొత్త విధానాలను రూపొందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. విద్యారంగంలో చాలా సమస్యలు ఉన్నాయని, ప్రత్యేకించి ప్రభుత్వ సంస్థల్లో విద్యార్థుల నమోదు బాగా పడిపోయిందన్నారు. ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు ఉన్న విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, బడ్జెట్ కేటాయింపుల పెంపు కోసం చర్యలు తీసుకుంటామన్నారు. సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించడంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. అనంతరం విద్యావ్యవస్థలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, విద్యా కమిషన్‌‌‌‌ సభ్యులు ప్రొఫెసర్‌‌‌‌ విశ్వేశ్వర్, డాక్టర్ వెంకటేశ్‌‌‌‌, జ్యోత్స్నా రెడ్డి, అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ శ్రీనివాస్, డీఆర్‌‌‌‌వో అమరేందర్, ఎంజీయూ ఓఎస్‌‌‌‌డీ ప్రొఫెసర్‌‌‌‌ అంజిరెడ్డి, ప్రతీక్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ గోనారెడ్డి, ఎన్‌‌‌‌జీ కాలేజీ ప్రిన్సిపాల్‌‌‌‌ ఉపేందర్, ఇంటర్మీడియట్‌‌‌‌ విద్యాశాఖ అధికారి దసృనాయక్, డీఈవో భిక్షపతి పాల్గొన్నారు.