బైడెన్​తో ట్రంప్ భేటీ

  • అమెరికా ప్రస్తుత అధ్యక్షుడిని వైట్ హౌస్ లో కలిసిన కాబోయే అధ్యక్షుడు  

వాషింగ్టన్: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తో బుధవారం వైట్ హౌస్ లోని ఓవల్  ఆఫీసులో భేటీ అయ్యారు. అధికార మార్పిడి, జాతీయ భద్రత, దేశీయ రాజకీయ విధానాలు, ప్రపంచ రాజకీయాలతో పాటు ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధంపైనా వారిద్దరూ రెండు గంటల పాటు చర్చించారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. అధికార బదిలీ సజావుగా జరిగేలా చూస్తామని ట్రంప్ కు బైడెన్  హామీ ఇచ్చారని తెలిపాయి. బైడెన్ తో భేటీ అనంతరం మీడియాతో ట్రంప్ మాట్లాడారు.

ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధంపై బైడెన్ తో చర్చించానని ఆయన చెప్పారు. కాగా, ఇండియన్ అమెరికన్లతో కలిసి ఆ దేశ ఎంపీలు వాషింగ్టన్ లోని క్యాపిటల్ బిల్డింగ్ లో  దీపావళి వేడుకలు చేసుకున్నారు. గత వారం అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాత యూఎస్  కాంగ్రెస్ లో జరిగిన అతిపెద్ద వేడుక ఇదే. 

నేషనల్ ఇంటెలిజెన్స్ డెరెక్టర్ గా తులసీ గబార్డ్

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్  ట్రంప్.. ఇండియన్ అమెరికన్ నేత  తులసీ గబార్డ్ ను నేషనల్  ఇంటెలిజెన్స్  డైరెక్టర్ గా నియమించారు. అమెరికాలోని మొత్తం 18 స్పై ఏజెన్సీలను గబార్డ్  పర్యవేక్షిస్తారు. 2022లో డెమోక్రటిక్  పార్టీకి ఆమె రాజీనామా చేశారు. ఈ ఏడాది ట్రంప్  కోసం అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం చేశారు. తమ దేశ ఇంటెలిజెన్స్  విభాగానికి గబార్డ్  ధైర్యం అద్దం పడుతుందని ఈ సందర్భంగా ట్రంప్  అన్నారు. కాగా, ప్రతినిధులసభ సభ్యుడు మాట్  గైట్జ్ ను అమెరికా అటార్నీ జనరల్ గా  ట్రంప్  నియమించారు.  రాజ్యాంగానికి, రూల్  ఆఫ్ లాకు మాట్  చాంపియన్ లాంటి వారని ప్రశంసించారు. 

గబార్డ్  ప్రస్థానమిదే.. 

తులసీ గబార్డ్  1981 ఏప్రిల్ 12న పసిఫిక్  మహాసముద్రంలోని అమెరికన్  సమోవా దీవిలో జన్మించారు. ఆమెకు రెండేండ్లు ఉన్నపుడు గబార్డ్  కుటుంబం హవాయ్ లో స్థిరపడింది. 2009లో హవాయ్ పసిఫిక్  యూనివర్సిటీ నుంచి బిజినెస్  అడ్మినిస్ట్రేషన్ లో బీఎస్ బీఏ పూర్తిచేశారు. సినిమాటోగ్రాఫర్  అబ్రహాం విలియమ్స్ ను ఆమె వివాహం చేసుకున్నారు. ఆర్మీ నేషనల్  గార్డ్ లో ఆమె 20 ఏండ్లు పనిచేశారు. హవాయ్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.  ప్రతినిధుల సభలో సభ్యురాలిగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆమె 2020లో అధ్యక్ష పదవికి డెమోక్రటిక్  పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీచేశారు.  ఆమె తండ్రి మైక్  గబార్డ్  ప్రస్తుతం హవాయ్  స్టేట్ సెనేటర్ గా ఉన్నారు.