యాదగిరిగుట్టలో 16 నుంచి ధనుర్మాసోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 16 నుంచి వచ్చేనెల 14 వరకు ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి 5.45 గంటల వరకు ప్రధానాలయ అంతర ప్రాకార ఉత్తర భాగంలో అమ్మవారిని ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి ‘తిరుప్పావై’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జనవరి 13న రాత్రి 7 గంటలకు గోదా కల్యాణం, 14న ఉదయం 11.30 గంటలకు ఒడిబియ్యం కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఒడిబియ్యం కార్యక్రమంతో ధనుర్మాసోత్సవాలు ముగియనున్నాయి.

నేడు యాదగిరిగుట్టకు హర్యానా గవర్నర్‌‌

హర్యానా గవర్నర్‌‌ బండారు దత్తాత్రేయ శుక్రవారం యాదగిరిగుట్ట మండలంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మొదట మధ్యాహ్నం 12.30 గంటలకు యాదగిరిగుట్ట ఆలయానికి చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. 1.45 గంటలకు మండలంలోని కాచారం ప్రభుత్వ స్కూల్‌‌లో స్టూడెంట్లకు నోట్‌‌ బుక్స్‌‌, స్టడీ మెటీరియల్‌‌ కిట్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం 2 గంటలకు ధర్మారెడ్డిగూడెంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్‌‌కు హాజరవుతారు. తర్వాత భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శించిన అనంతరం హైదరాబాద్‌‌కు వెళ్తారు.