కిన్నెరసాని దశ మారేనా?...టూరిజం డెవలప్​మెంట్​ పనులు నత్తనడక

  • డీప్యూటీ సీఎం, మంత్రులు చెప్పినా స్పీడ్​అందుకోలే 
  • రోడ్డు నిర్మాణానికి ఫారెస్ట్​ అడ్డంకులు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కిన్నెరసాని ప్రాజెక్ట్​ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఆచరణలోకి రావడంలేదు.  ఈ ప్రాంతంలో ప్రకృతి సోయగాలు, పశుపక్షుల అందాలు అందరినీ ఆకట్టుకుంటాయని ..  తగిన వసతులు  కల్పిస్తే పర్యాటకులు వస్తారని టూరిజం శాఖ భావించింది. ఇందులో భాగంగా కొత్తగూడెంలో హరిత హోటల్​, కిన్నెరసాని ప్రాజెక్ట్​ వద్ద అద్దాల మేడ, కాటేజీల నిర్మాణాల కోసం రూ. 23 కోట్లు కేటాయించింది.

నిధులు మంజూరు చేసి ఎనిమిదేండ్లయినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి.   ఇటీవల  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు  జూపల్లి కృష్ణారావు,  తుమ్మల నాగేశ్వరరావు పనులను పరిశీలించారు. వారు విధించిన రెండు నెలల గడువు కూడా ముగిసినా  పనులు ఇంకా  పూర్తి కాలేదు. 

 ఎనిమిదేండ్లుగా పెండింగ్​ 

కిన్నెరసాని ప్రాజెక్ట్​ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు  2016లో  బీఆర్ఎస్​ సర్కారు రూ. 23 కోట్లు  సాంక్షన్​ చేసింది.  కొత్తగూడెం టౌన్​లో  41 రూంలు, బార్​, రెస్టారెంట్​, బాంక్వెట్​ హాల్​తో హరిత హోటల్ నిర్మాణంతో పాటు  పాల్వంచలోని  ప్రాజెక్టు వద్ద  అద్దాల మేడ,  9బ్లాకుల్లో 36 కాటేజీలు నిర్మించాలని టూరిజం శాఖ ప్లాన్​ చేసింది. మొదట  పంచాయతీ రాజ్​శాఖ ఆధ్వర్యంలో పనులు జరగగా..  2020లో  టూరిజం శాఖ  ఈ వర్క్స్​ను టేకప్​ చేసింది. ఏ శాఖ ఆధ్వర్యంలో   జరిగినా  కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు.  

కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన తర్వాత  టూరిజం శాఖ ఈ పనులపై దృష్టి సారించింది.    డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు   జూపల్లి,  తుమ్మల పర్యటించి  కిన్నెరసానిలో బోటు షికారు చేశారు. పనుల పురోగతిపై రివ్యూ చేసి  రెండు నెలల్లో పనులు పూర్తి కావాలని ఆదేశించారు.  మంత్రుల ఆదేశాలను కూడా ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదన్న  విమర్శలు వినిపిస్తున్నాయి.  పనులు అసంపూర్తిగా ఉండడమే కాకుండా.. జరిగిన పనుల్లో కూడా నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి.  హరిత హోటల్​లో వాన పడితే  గోడల్లో చెమ్మ , పగుళ్లు వస్తున్నాయి.   

ఆకట్టుకునే అందాలు  

కిన్నెరసానిలో బోటు షికారు  అద్బుతంగా ఉంటుంది.  అద్దాల మేడ  మంచి సెల్ఫీ పాయింట్​గా మారనుంది.  అద్దాల మేడకు వెళ్లే దారిలోని కుకూ జంగిల్​  ప్రకృతి అందాలు  మైమరిపిస్తాయి.  వసతులు కల్పిస్తే భద్రాచలంలోని శ్రీరామచంద్రస్వామిని దర్శించుకునే భక్తులు కిన్నెరసానికి వచ్చే అవకాశంఉంటుంది.  ప్రస్తుతం  కుకూ జంగిల్​కు వెళ్లే  వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా మారింది. వర్షం వస్తే జారిపడే పరిస్థితి ఉంది. . దాదాపు రెండు కిలోమీటర్లున్న ఈ రోడ్డును  బీటీగా మార్చాలని  టూరిజం శాఖ ప్లాన్​చేయగా  రిజర్వ్​ ఫారెస్ట్​ అంటూ అటవీశాఖ అనుమతులు ఇవ్వడంలేదు. 

నవంబర్​ నాటికి పూర్తి చేస్తాం

టూరిజం డెవలప్​మెంట్​ పనులను   నవంబర్​నెలాఖరు వరకు  పూర్తి చేస్తాం.  క్వాలిటీకి ప్రాధాన్యం ఇస్తూ  పనులు స్పీడ్​గా చేస్తున్నాం.  గతంలో పంచాయతీ రాజ్​ ఆధ్వర్యంలో చేపట్టిన  పనుల్లో క్వాలిటీ లోపించింది. వాటిని  సరి చేస్తున్నాం,  కిన్నెరసానికి వెళ్లే  రోడ్డు నిర్మాణం కోసం ఫారెస్ట్​ పర్మిషన్స్​కోసం  ప్రయత్నిస్తున్నాం. - ప్రసాద్​, టూరిజం ఆఫీసర్​, భద్రాద్రికొత్తగూడెం