శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య భారతదేశ ప్రజలకు గొప్ప ఆధ్యాత్మిక, చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ శుభ సమయం మరి కొన్ని రోజులు మాత్రమే ఉంది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.29 గంటలకు శుభ ముహూర్తంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జనవరి 15 నుంచి యఙ్ఞ క్రతువులు ప్రారంభం కానున్నాయి. 15 నుంచి 22 వరకు అయోధ్యలో జరిగే కార్యక్రమ వివరాలను తెలుసుకుందాం . . .
-
జనవరి 15 : మకర సంక్రాంతితో అశుభ కాలం ముగియడంతో రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకొస్తారు.
-
జనవరి 16 : శ్రీరాముని విగ్రహానికి ప్రతిష్ఠాపన ఆచారాలు ప్రారంభం.. రుత్విక్ లు ( ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొనే బ్రాహ్మణులు దీక్ష స్వీకరణ)
-
జనవరి 17: శ్రీరాముని విగ్రహం నగర ఊరేగింపు ( ధాన్యాదివాసం)
-
జనవరి 18: మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, గణేశ పూజ వంటి ఆచారాలతో సహా ప్రాణశక్తి (ప్రాణ-ప్రతిష్ఠ) పవిత్రోత్సవానికి శ్రీకారం
-
జనవరి 19: రామమందిరంలో యజ్ఞ అగ్నిగుండం స్థాపన ... ఒక ప్రత్యేక ఆచారం పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు.( కర్రతో కర్రను మధిస్తూ అగ్నిని రాజేస్తారు. ఇలా వచ్చిన అగ్నితో యఙ్ఞాన్ని ప్రారంభిస్తారు)
-
జనవరి 20: వివిధ నదుల నుండి సేకరించిన నీటిని కలిగి ఉన్న 81 కలశాలతో పుణ్యహవచనం కార్యక్రమం ద్వారా రామమందిరం యొక్క గర్భగుడిని వేద మంత్రాలతో పవిత్రం చేస్తారు.
-
జనవరి 21: జలాధివాసం అంటే యజ్ఞం చేసిన అనంతరం , ప్రత్యేక పూజలు మధ్య, రాముడు విగ్రహాన్ని125 కలశాలతో అభిషేకం చేస్తారు.
-
జనవరి 22: ప్రధాన కార్యక్రమం, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది.మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్న సమయంలో శ్రీరామునికి గొప్ప పూజ జరుగుతుంది. అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు పవిత్ర సమయం మధ్యాహ్నం 12గంటల 29 నిమిషాల 08 సెకనుల నుండి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్లు ( 84సెకన్ల) కాలంలో రాముడి విగ్రహాన్ని కేటాయించిన స్థలంలో ప్రతిష్టిస్తారు.
-
జనవరి 24వ తేదీ నుంచి భక్తులను రామయ్య దర్శనానికి అనుమతిస్తారు.
ప్రతి డొమైన్‌లో దేశ గౌరవానికి దోహదపడిన ప్రముఖ వ్యక్తులతో పాటు అన్ని సంప్రదాయాలకు చెందిన సాధువులకు ఆహ్వానాలను పంపించారు.యూపీలోని అయోధ్యలో జరిగే దీక్షకు ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు 6 వేల మందికి పైగా ప్రజలు హాజరుకానున్నారు.జనవరి 22వ తేదీని దీపావళి తరహాలో అందరూ ఉత్సాహంగా జరుపుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పిలుపునిచ్చారు.
జనవరి 22న జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున త్వరలో హెలికాప్టర్ సేవలను ప్రారంభిస్తుందని రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు.జనవరి 22న జరగనున్న రామాలయ ప్రారంభోత్సవానికి ప్రముఖులు, అన్ని వర్గాల ప్రజలు తరలిరావడానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.