పిరమైన ఇసుక .. ఇల్లు కట్టుకునే సామాన్యులకు తిప్పలు

  • పక్కనే వాగులున్నా కొరత 
  • కాళేశ్వరం నుంచి దిగుమతి
  • పత్తా లేని సాండ్​ ట్యాక్సీఇరిగేషన్ పనులకు బ్రేక్

నాగర్​ కర్నూల్​ వెలుగు : జిల్లాలో నదులు, వాగులు ఉన్నా ఇసుక కొరత తీవ్రంగా ఉంది. సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్న వారు ఇసుక దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణదారుల అవసరాలను ఆసరా చేసుకుని వ్యాపారులు ఇసుక రేట్లను అమాంతం పెంచేశారు. గతంలో టన్ను ఇసుక రూ.900 ఉండగా, ఇప్పుడు రూ.2వేలకు చేరింది. ఇసుక కొరత పాలమూరు - రంగారెడ్డి, కెఎల్​ఐ, డీఎల్​ఐ ప్రాజెక్ట్​ పనుల మీద కూడా ప్రభావం చూపిస్తోంది. నిర్మాణరంగం మీద ఆధారపడిన వేలాదిమంది కార్మికులు పనులు లేక అవస్థలు పడుతున్నారు. 

గతంలో జిల్లాలోని డిండి తదితర వాగుల్లో ఇసుక రీచ్​లు గుర్తించి ఇసుక తరలించేందుకు సాండ్​ ట్యాక్సీ విధానం అమలు చేశారు. ఇరిగేషన్​,ఇతర ప్రభుత్వ పనులకు టీజీఎండీసీ రీచ్​లు అలాట్​ చేసింది. సాండ్​ ట్యాకీ కింద రిజిస్టర్​ అయిన ట్రాక్టర్లకు కిలోమీటర్​చొప్పున రేట్​ ఫిక్స్​ చేశారు. బీఆర్ఎస్​ నేతల ఇసుక దందా కారణంగా సర్కారీ సాండ్​ ట్యాక్సీ సిస్టమ్​ మూలకు పడింది. బీఆర్​ఎస్​ హయాంలో లీడర్లు ఒక ట్రిప్​కు పర్మిట్​ తీసుకుని వందల లారీల్లో ఇసుక అక్రమంగా రవాణా చేశారు. దీంతో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దందాకు చెక్​ పెట్టాలని సీఎం రేవంత్​​ రెడ్డి నిర్ణయించారు.

 ఆయన ఆదేశాలతో ఇసుక మాఫియా మీద అధికారులు చర్యలు తీసుకున్నారు. మొదట్లో ఇసుక మాఫియాకు సహకరించిన పలువురు ఎస్​ ఐల మీద కూడా వేటు పడింది. ప్రస్తుతం సాండ్​ ట్యాక్సీ మూలకు పడడంతో ఊళ్లలో ఇళ్లు కట్టుకునేందుకు ఇసుక దొరకడం లేదు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటిలపరిధిలో కొత్త నిర్మాణం కోసం దాదాపు 4 వేల మంది అప్లై చేసుకున్నారు. 

ఇందులో ఎక్కువగా పేద, మధ్య తరగతి వారు కటుకునే ఇండ్ల అప్లికేషన్లే ఉన్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇండ్లకు ఇసుక దొరకడంలేదు. కొందరు వ్యాపారులు కాళేశ్వరం నుంచి ఇసుక తరలించి అధిక రేట్లకు అమ్ముతున్నారు. మున్సిపాలిటీల పరిధిలో అనేక అభివృద్ధి జరుగుతున్నాయి. సీసీ రోడ్లు, డ్రెన్​ పనులకు ఇసుక దొరకక డస్ట్​ వాడుతున్నారు. దీంతో పనులు నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్వాలిటీపై అధికారులను ప్రశ్నిస్తే మౌనం వహిస్తున్నారు. 

ప్రధాన వాగుల నుంచి ఇసుక తరలించే అంశంపై జిల్లా అధికారులకు స్పష్టత లేదు. ఎమ్మెల్యేలు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. గత్యంతరం లేక జిల్లా ప్రజలు టన్నుకు రూ.2వేల చెల్లించి కాళేశ్వరం నుంచి తరలిస్తున్న ఇసుక కొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఇసుక తెప్పించుకుంటున్నారు. గతంలో రూ.40వేలకు వచ్చే టిప్పర్​ ఇసుక ధర ప్రస్తుతం రూ.1లక్ష వరకే చేరింది. ఇసుక లభ్యత, సాండ్​ టాక్సీ పునరుద్ధరణపై మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి దృష్టి సారించాలని జనాలు కోరుతున్నారు.