మెట్రో నుంచి మున్సిపాలిటీల దాకా.. అంతా కేసీఆర్ చెప్పినోళ్లకే...

 కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు.. మిషన్​ కాకతీయ, మిషన్​ భగీరథ, అంబేద్కర్​ విగ్రహం, కలెక్టరేట్లు, సెక్రటేరియెట్​ నిర్మాణం దాకా అన్నిట్లో గత బీఆర్​ఎస్​ సర్కార్​ మొదట తక్కువ ధరకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ఆ తర్వాత అమాంతం అంచనా వ్యయాన్ని పెంచేసినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. 

మొదట్లో టెండర్​ దాఖలు చేసే టైమ్​లో అంచనాలు తక్కువకు చూపడం.. ఆ తర్వాత మధ్యలో వాటిని సవరించడం.. పూర్తయ్యే సరికి ఖర్చు రెండు మూడింతలు కావడం వంటివి ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. కమీషన్ల కోసమే కొన్ని పనుల అంచనా వ్యయాన్ని డబుల్​, ట్రిపుల్​ చేసినట్లు తేలింది. అయినవాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు రూల్స్​ను కూడా గత పాలకులు బ్రేక్​ చేసినట్లు ప్రస్తుత సర్కార్​ గుర్తించింది. ఇటీవల ఐటీ, ఇండస్ట్రీస్​ డిపార్ట్​మెంట్​పై రివ్యూలోనూ కొన్ని కంపెనీలకు గత సర్కార్​ ప్రత్యేకంగా ఇచ్చిన ఇన్సెంటివ్​లు, భూముల కేటాయింపుల్లోనూ అక్రమాలు జరిగినట్లు సీఎం రేవంత్​ గుర్తించారు

రాయదుర్గం(మైండ్​ స్పేస్) నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్టు వరకు 31 కిలోమీటర్ల మెట్రో కొత్త రూట్​కు గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఆ ప్రాజెక్ట్ డీపీఆర్​లో  రూ.4,650 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే ఈ రూట్​ శంకుస్థాపనకు వచ్చేసరికి ఏకంగా రూ. 1,600 కోట్లు అంచనా వ్యయం పెరిగింది. దీని మొత్తం అంచనా వ్యయం రూ.6,250 కోట్లుగా చూపారు. అసలు సంబంధం లేని రూట్​ను ఎంచుకోవడం ఏమిటి? ఆ ప్రపోజల్స్​ అంతకు పెంచడం ఏమిటి? ఎవరికి కమీషన్లు పెంచేందుకు ఇట్ల చేశారు అన్న విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి.  ఈ పనులను సబ్​ కాంట్రాక్టుల కోసం తనకు నచ్చినోళ్ల పేర్లను ఎల్​ అండ్  టీకి గత ప్రభుత్వంలోని మున్సిపల్ శాఖ మంత్రి సూచించినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే  సీఎం రేవంత్​ రెడ్డి ఈ ఎయిర్​పోర్టు మెట్రో రూట్​ను మార్చారు. 

Also Read:-కేసీఆర్ హయాంలో సెక్రటేరియెట్ అట్లా..కలెక్టరేట్లు ఇట్లా

ఇక జీహెచ్​ఎంసీతో పాటు మున్సిపాలిటీలు, ఆయా కార్పొరేషన్లలో చేపట్టిన ఫ్లైఓవర్లు, అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం, ఇతర స్ట్రీట్​ లైట్స్​ వంటి కాంట్రాక్టులన్నీ నాటి మున్సిపల్​ శాఖ మంత్రి చెప్పినోళ్లకే దక్కేలా గత సర్కార్​ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. హైదరాబాద్​లో ఫ్లైఓవర్ల నిర్మాణానికి టెండర్ల నిబంధనలు మార్చినట్లు తేలింది. పైగా టెండర్​ను ఓ కంపెనీ దక్కించుకుంటే అందులోని పనులను పూర్తిగా సబ్​ కాంట్రాక్టర్లు చేపట్టినట్లు వెల్లడైంది. గత ప్రభుత్వంలోని ఓ మంత్రి బావమ్మర్ది బినామీలు, ఆ మంత్రి పీఏ బినామీలు ఈ సబ్​ కాంట్రాక్ట్​ పనులు చేపట్టినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది.