ప్రభుత్వ స్కూళ్ల ప్రక్షాళన.. రూ.కోట్ల నిధులతో బడుల్లో మౌలిక సదుపాయాలు

  • రూ.కోట్ల నిధులతో బడుల్లో మౌలిక సదుపాయాలు
  • 19 ఏండ్లుగా పెండింగ్​లో ఉన్న ఏంఈవోల పోస్టులు భర్తీ
  • 2016 తర్వాత ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లకు మోక్షం
  • తాజాగా కొత్త టీచర్ల పోస్టింగులతో విద్యాబోధనకు తొలగిన ఆటంకం

ఆదిలాబాద్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఎన్నో ఏండ్లుగా అపరిషృతంగా ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టిన ప్రభుత్వం.. రూ.కోట్లు విడుదల చేసి స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించింది. ఏండ్లుగా పెండింగ్​లో ఉన్న ఏంఈవో పోస్టుల్లో హెచ్​ఎంలను నియమించింది. ఇక పదేండ్లలో ఒక్క డీఎస్పీ మాత్రమే వేసిన బీఆర్ఎస్ సర్కార్​కు చెంపపెట్టులా.. కేవలం పదినెలల్లోనే కొత్త టీచర్లను నియమించింది. ఫలితంగా పాఠశాలల అభివృద్ధితోపాటు విద్యాబోధన మెరుగుపడనుంది. 

కోట్ల నిధులతో మౌలిక సదుపాయాలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో విద్యాశాఖ బలోపేతానికి కోట్ల నిధులు విడుదయ్యాయి. గత సర్కార్ చేపట్టలేని ఎన్నో పనులను వేగంగా పూర్తి చేసి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించింది. ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెయింటెనెన్స్ ఖర్చుల కోసం మొదట విడతగా రూ.1.74 కోట్లు విడుదల చేసింది. ఆదర్శ కమిటీలతో స్కూళ్లను అభివృద్ధి చేసింది. రూ.30 కోట్లతో పనులు పూర్తి చేసి రాష్ట్రంలో ఆదిలాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తరగతి గదుల రిపేర్లు తదితర పనులు పూర్తిచేసి విద్యార్థులకు ఎలాంటి సమస్య లేకుండా చేసింది. ప్రభుత్వ పాఠశాలకు ఉచితంగా కరెంట్ సరఫరా అందిస్తోంది. ఫలితంగా హెచ్​ఎంలపై కరెంట్ బిల్లు భారం తగ్గింది. గతంలో మెయింటెనెన్స్ నిధుల్లో సగం కరెంట్ బిల్లులకే చెల్లించేవారు. 

19 ఏండ్ల తర్వాత అన్ని మండలాల్లో ఎంఈవోల నియామకం

19 ఏండ్లుగా నెలకొన్ని ఎంఈవోల సమస్యకు కాంగ్రెస్ సర్కార్ పరిష్కారం చూపింది. ఇప్పటి వరకు నాలుగైదు మండలాలకు ఒక్క ఇన్​చార్జి ఎంఈవోను కొనసాగించగా.. తాజాగా ఆ విధానానికి స్వస్త పలికి సీనియర్ హెడ్మాస్టర్లకు ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇటీవలే మండలానికి ఒక ఎఫ్ఏసీ ఎంఈవోను నియమించింది. జిల్లాలో ఒక రెగ్యులర్ ఎంఈవో ఉండగా నలుగురు పీజీ హెచ్ఎంలు ఇన్ని రోజులుగా మిగతా మండలాల బాధ్యతలు చూసుకున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో మిగతా 13 మండలాల్లో సీనియర్ హెచ్ఎంలకు ఎంఈవోలుగా బాధ్యతలు అప్పగించింది. దీని వల్ల పర్యవేక్షణ పెరిగి విద్యావ్యవస్థ గాడిలో పడనుంది. 2005 తర్వాత ఎంఈవోల నియామకాలు జరగలేదు.

 ఇప్పటి వరకు ఒక్కో ఎంఈవోకు మూడేసి మండలాల చొప్పున బాధ్యతలు ఉండడంతో వారు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేపట్టలేకపోయారు. దీన్ని అడ్వంటేజ్ గా చేసుకొని చాలా మంది టీచర్లు స్కూళ్లకు డుమ్మకొట్టేవారనే ఆరోపణలున్నాయి. కొత్తగా నియమించిన ఎంఈవోలు వారానికి మూడు స్కూళ్లను తప్పనిసరిగా విజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో బడులపై పర్యవేక్షణ పెరిగి బలోపేతమయ్యే అవకాశముంది. 

812 మందికి బదిలీ..

2016 తర్వాత ఈ ఏడాది జూన్ లో ప్రభుత్వం టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 812 మందికి బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 ఏండ్లుగా ఒకే చోట పనిచేస్తూ బదిలీల కోసం ఎదురుచూస్తున్న మోడల్ స్కూల్ టీచర్లను గత నెలలోనే ట్రాన్స్​ఫర్ చేసింది. జిల్లాకు 286 టీచర్ పోస్టులు మంజూరు చేసి మంగళవారం 266 మందికి పోస్టింగ్​ఇచ్చింది. దీంతో టీచర్ల కొరత తీరింది.

జిల్లాలో మొత్తం ప్రభుత్వ స్కూళ్లు: 789
ప్రైమరీ స్కూళ్లు : 500
అప్పర్​ ప్రైమరీ స్కూళ్లు: 115
హైస్కూల్స్​: 120
మొత్తం విద్యార్థులు: 65 వేలు