- కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి
నల్గొండ, వెలుగు : నల్గొండ మున్సిపాలిటీలో ఉన్న 110 చెత్త సేకరణ, స్వీపింగ్ వాహనాలకు రోజుకో రిపేర్ వస్తోందని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. కాంట్రాక్టర్ల కోసమే వీటికి రిపేర్లు వస్తున్నట్లున్నాయని ఆరోపించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలోని ఇన్చార్జి చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వేసవి వస్తున్నందున తాగునీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
తాగునీటిని క్రమపద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా సరఫరా చేస్తున్న ఆపరేటర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ప్రతి అంశానికి కాంట్రాక్టర్లపై ఆధారపడకుండా వాళ్లే స్పందించాలని సూచించారు. బీఆర్ఎస్ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ మాట్లాడుతూ.. వెహికల్స్‌ను కాంట్రాక్టర్ రిపేర్ చేయించడం లేదని, వారం, పదిరోజులు మూలనపడితే చెత్త తరలింపు ఆగిపోతుందన్నారు. ఇద్దరు మెకానిక్‌లను పెట్టి రిపేర్ చేయించాలని కోరారు. వీధిలైట్ల కాంట్రాక్టర్ లైట్లు కూడా వేయించడంలేదని, ఇద్దరు కాంట్రాక్టర్లు ఆస్థాన కవులుగా మారిపోయారని విమర్శించారు.
బీజేపీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో జరిగిన పొరపాట్లను సవరించడం అభినందీయమని, మున్సిపాలిటీ తీర్మానం లేకుండా చేసిన పనులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తీర్మానం లేకుండా కోట్ల రూపాయలు కేటాయించడం సరికాదన్నారు. కౌన్సిలర్ ఖయ్యుంభేగ్ మాట్లాడుతూ.. కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. మాజీ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ మాట్లాడుతూ.. సావర్క్నగర్ ప్రాంతంలో తాగునీటి సరఫరాలో లోపాలు ఉన్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్చార్జి చైర్మన్ రమేశ్ గౌడ్ మాట్లాడుతూ.... శివాజీనగర్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించామని, పట్టణంలో గుంతలుగా మారిన రోడ్లకు రిపేర్లు చేపట్టామని తెలిపారు. రూ.30లక్షలతో చేపల మార్కెట్నిర్మిస్తున్నామని, యువత చదువుకునేందుకు మొబైల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ రవి, అసిస్టెంట్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఈఈ రాములు, అధికారులు పాల్గొన్నారు.