సర్వే షురూ...ఉమ్మడి నల్గొండ జిల్లాలో  ఫీల్డ్​లోకి సిబ్బంది 

  • యాదాద్రిలో  ఫస్ట్​ డే 
  • 91, 521 ఇండ్లకు స్టిక్కర్లు

యాదాద్రి/నల్గొండ, వెలుగు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల' సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మొదటి దశ  ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రారంభమైంది.  ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన గ్రామాలు, పట్టణాల్లోని వార్డులకు  వెళ్లారు.  గ్రామం , మున్సిపాలిటీ పేరుతో పాటు వార్డు, ఇంటి నెంబర్​ రాసుకుంటున్నారు.  ఆ ఇంటిలో ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయో అడిగి తెలుసుకున్నారు.  ఒకటి కుటుంబం ఉంటే ఒక స్టిక్కర్​, ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు నివాసం ఉంటే సంఖ్యకు తగ్గట్టుగా యజమాని పేరుతో స్టిక్కర్లు అంటిస్తున్నారు. 

తాళం వేసి ఉంటే ఫోన్​

గ్రామంలో ఇల్లున్నా.. ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్​ లేదా ఇతర ప్రాంతాలకు  జిల్లా వాసులు వలస వెళ్లడం సాధారణం. అలా వెళ్లిన వారు తమ ఇండ్లను ఎవరికైనా రెంట్​కు ఇచ్చి, లేదా.. తాళం వేసి వెళ్తుంటారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం గ్రామాలు, మున్సిపాలిటీలకు వెళ్లిన ఎన్యూమరేటర్లకు తాళాలు వేసిన ఇండ్లు కన్పించాయి. దీంతో ఆ ఇంటి పక్కనే ఉన్న వారి నుంచి సెల్​​ నెంబర్​ తీసుకొని పలువురికి ఫోన్లు చేశారు.

కాల్​కు రెస్పాండ్​ అయిన వ్యక్తులతో సర్వే గురించి చెప్పి వివరాలు తెలుసుకుంటున్నారు. సర్వే నిర్వహించే నాటికి రావాలని సూచిస్తున్నారు. వీలుకాని పక్షంలో మీరు ఉన్న ప్రాంతంలోనే సర్వేలో పాల్గొనాలని సూచిస్తున్నారు. సర్వే కోసం వస్తామంటే స్టిక్కర్​ వేస్తున్నారు. లేకుంటే ఆ ఇంటికి స్టిక్కర్​ వేయకుండా వదిలేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటే మాత్రం కచ్చితంగా సర్వే నాటికి రావాలని సూచిస్తున్నారు. 

 ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యేలు

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమం యాదాద్రి జిల్లాలో ప్రారంభమైంది. వలిగొండలో ఈ కార్యక్రమాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, నకిరెకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ చైర్మెన్ గుత్తా అమిత్ రెడ్డి ప్రారంభించారు. యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రారంభించారు. 

మొదటి రోజు స్టిక్కరింగ్​.. 

2011 జన గణన ప్రకారం యాదాద్రి జిల్లాలో 1.87 లక్షల ఇండ్లు ఉన్నాయి. అయితే 13 ఏండ్లుగా పెరిగిన జనాభాను బట్టి ఇండ్ల సంఖ్య  2,47,354కు  చేరుకుందని, 1800 బ్లాక్​లు ఉన్నాయని ఆఫీసర్లు   లెక్కలు వేశారు. కాగా సమగ్ర సర్వేలో భాగంగా ఇంటింటికి తిరిగిన ఎన్యూమరేటర్లు బుధవారం 91,521 ఇండ్లకు స్టిక్కర్లు వేశారు. గురు, శుక్రవారాల్లోనూ ఈ స్టిక్కర్ల ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం 9 నుంచి సర్వే ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఒక్కో ఎన్యుమరేటర్​ రోజుకు పది ఇండ్ల చొప్పున 15 రోజుల్లో 150 ఇండ్లను సర్వే చేయాల్సి ఉంది. ఇందుకోసం 1938 ఎన్యుమరేటర్లను నియమించారు. నల్గొండ జిల్లాలో 3832 మంది ఎన్యూమరేటర్లు, 386 మంది సూపర్ వైజర్లు , సూర్యాపేట జిల్లాలో 2601 మంది ఎన్యూమరేటర్లు, 263 మంది సూపర్ వైజర్లతో సర్వే ప్రారంభించారు. ప్రజలు తప్పుడు సమాచారం ఇవ్వొద్దని - సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. సర్వే విషయంలో ఎలాంటి అపోహలు వద్దని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.