పూర్తి స్థాయిలో కొనుగోళ్లు కేంద్రాలను ప్రారంభించాలి : తేజస్ నందలాల్ పవార్

  • కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   

సూర్యాపేట, వెలుగు : పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలను ప్రారంభించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో ధాన్యం కొనుగోళ్ల తీరుపై అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ రాంబాబుతో కలిసి డీఆర్డీవో, డీపీఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రానికి కేటాయించినవి ధాన్యం మాత్రమే మిల్లులకు, సంబంధిత పత్రాలతో  ట్రాన్స్​పోర్టు చేయాలని సూచించారు. ట్రక్ షీట్లు రవాణా అయిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ నమోదు చేయాలని తెలిపారు. 

ట్రక్ షీట్లు వెంటవెంటనే తెచ్చుకోవడానికి లేదా వాట్సాప్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకొని ట్యాబ్ ఎంట్రీ కంప్లీట్ చేయాలని వివరించారు. ఈ సదుపాయం కోసం ప్రతి మిల్లు వద్ద ఒక ప్రత్యేకాధికారిని నియమించినట్లు తెలిపారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తయిన వెంటనే 24 గంటల్లో  రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసేలా సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. అనంతరం సూర్యాపేట మండలం ఇమాంపేట-–1 ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీవో వీవీ అప్పారావు, ఏపీవో రాంసురేశ్ పాల్గొన్నారు. 

బాధితులకు అండగా నిలిచిన కలెక్టర్ 

సూర్యాపేట, వెలుగు : ఇండ్లు కాలిపోయిన బాధిత కుటుంబాలకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అండగా నిలిచారు. గురువారం సూర్యాపేట మండలం టేకుమట్లలో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు ఇండ్లు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే బాధిత కుటుంబ సభ్యులను కలెక్టర్ కార్యాలయానికి పిలిపించారు. బాధితులు ఉర్సు బాలరాజు, మహేశ్వరి కుటుంబాలకు కలెక్టర్ తక్షణ సాయం కింద రూ.10 వేలు, దుప్పట్లు, బట్టలు, నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాంబాబు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇరిగి కోటేశ్వరి, సభ్యులు ఈశ్వర్ చంద్ర, ఆర్ఐ గోపి, కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డి, అధికారులు, పాల్గొన్నారు.