ఇల్లు కూలిపోయన వారికి ఇందిరమ్మ ఇళ్ళు .. వరదల్లో బురద రాజకీయాలు వద్దు

భారీ వర్షాలకు  ఇల్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  మృతులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా, పశువులు చనిపోతే 50వేలు ఇస్తామన్నారు. సూర్యపేట జిల్లాలో వరదలు, వర్షాలపై అధికారులు, మంత్రులతో  సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. జిల్లాలో 20 వేల ఎకరాల్లో వరి పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని.. ప్రతీ రైతుకు ఎకరాకు రూ. 10వేల చొప్పున పంట నష్ట పరిహారం అందిస్తామని చెప్పారు రేవంత్.  తక్షణ సాయం కోసం సూర్యాపేట కలెక్టర్ కు రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేశారు సీఎం రేవంత్.

రాష్ట్రంలో జరిగిన నష్టాల నివారణ కోసం తక్షణ సాయం కింద కేంద్రం 2వేల కోట్లు మంజూరు చేయాలన్నారు. ఈ బాధ్యతను కేంద్రమంత్రులు బండిసంజయ్, కిషన్ రెడ్డి తీసుకోవాలన్నారు రేవంత్. రాజకీయాలకు ఇది సమయం కాదని అందరం కలిసి ప్రజలను ఆదుకుందామని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు.  వరదలపై అమెరికాలో ఒకరు..ట్విట్టర్ లో ఇంకొకరు..  ఫామ్ హౌస్ లో ఉండి మరొకరు బురద రాజకీయాలు చేయొద్దని సూచించారు.

ALSO READ | ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త వరద సహాయక చర్యల్లో పాల్గొనాలి : రాహుల్ గాంధీ

సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 30 సెం మీ వర్షం కురిసిందన్నారు రేవంత్ రెడ్డి.   జిల్లాలో ఇద్దరు మృతి  చెందగా 21 చెరువులు కట్టలు తెగిపోయాయన్నారు. సాగర్ ఎడమ కాలువకు గండి ప్రభావం వల్ల 15 గ్రామాల్లో 450 మంది తరలించామన్నారు. 7 పక్కా ఇళ్లు, 33 దెబ్బతిన్న ఇళ్ళు కూలాయన్నారు. విపత్కర సమయంలో అధికారులు చక్కగా పనిచేశారని కొనియాడారు.  నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిస్థితులపై సహాయం కోసం ప్రధాని మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్ళామన్నారు రేవంత్.  ఎన్డీఆర్ఎఫ్ మాదిరిగా రాష్ట్రంలో ఎస్డీ ఆర్ఎఫ్ ఏర్పాటు చేస్తాం..  ఒక్కో బృందంలో 100 మంది ఉండేలా 8 బృందాలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు రేవంత్.