ఆటలు అంటే గెలుపు ఓటముల కోసం ఆడేదే అనుకుంటారు చాలామంది. అది కానే కాదు. చిన్న పిల్లలు ఆడేవే అసలైన ఆటలు. ఎందుకంటారా?.. ఎలాంటి ఫలితాలను ఆశించకుండా, కేవలం సంతోషం కోసమే ఆడుతుంటారు. వాటిలో ఎలాంటి నిరుత్సాహం, బాధ, అసంతృప్తి ఉండదు. ఆటలు ఆడుకునే సమయంలోనే వాళ్లలో సృజనాత్మకత పెరుగుతుంది.
ముఖ్యంగా పెద్దవాళ్లను ఇమిటేట్ చేయడం, బొమ్మలతో ఆడుకోవడం, ఆరు బయట ఆడడం వంటివి. ఎప్పుడూ పిల్లల్లో ఆనందంతో పాటు ఆలోచనను పెంచుతాయి. అందుకే మెకానికల్గా పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంచే ప్రయత్నం చేయకుండా... పిల్లలకు 'ప్లేవే మెథడ్' (ఆడుతూ నేర్చుకోవడం) ద్వారానే ఏదైనా నేర్పించాలి.
ప్రీ- స్కూల్ సూత్రాలు
• పిల్లలు ఏది నేర్చుకుంటున్నా, అది ప్రాక్టికల్ గా ఉండాలి.
• నేర్చుకోవడానికి చేసే వాళ్ల ప్రయత్నానికి పూర్తి స్వేచ్ఛనివ్వాలి.
• నేర్చుకోవడం అనేది జీవితానికి సంబంధించినదై ఉండాలి తప్ప కేవలం పుస్తకాల కోసం కాకూడదు.
• పిల్లలు తమ అవసరానికి చేసే ఏ పద్ధతి అయినా... దానిపై వాళ్లకు ఆసక్తిని పెంచాలి.
• పిల్లలు తమ టాలెంటిని బయట పెట్టేందుకు వీలైనన్ని అవకాశాలు కల్పించాలి.
'ప్లే-వే' పద్ధతి అంటే?
ఈ తరహా "నేర్చుకునే పద్ధతి"లో ఆడటమే ప్రధానం. ఆటలో కూడా ఆనందం, సంతృప్తి మాత్రమే ముఖ్యం. పిల్లలు ఎలాంటి ఆట ఆడుతున్నా దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఈ పద్ధతిలో ఉండే శ్రమ, నేర్చుకోవడం... రెండూ ఆట ద్వారానే జరుగుతాయి. అంటే, ఇందులో ప్రత్యేకంగా గురువులు ఉండరు. పిల్లలు తమకు తామే ప్రశ్నించుకోవాలి, అర్ధం చేసుకోవాలి, నేర్చుకోవాలి కూడా.
'ప్లే వే' పద్ధతి వల్ల ఉపయోగాలు
ఆడుతూ నేర్చుకునే పద్ధతి ద్వారా పిల్లలు ఈ విషయాల్లో అభివృద్ధి చెందుతారు. ఫిజికల్, లాజికల్, సోషల్ గా ఎదగడమే కాకుండా.. భాష, ఆలోచన, సృజనాత్మకత పెరుగుతాయి. ఈ 'ప్లే-వే' అనేది పిల్లల్లో సబ్జెక్ట్, ఫీలింగ్స్, ఎమోషనల్ డెవలప్మెంట్ కి తోడ్పడుతుంది.
ఈ విధానమే ఎందుకు?
• 'ప్లే-వే' పద్ధతి పిల్లల్లో సంతోషాన్ని పెంచుతుంది.
• అన్నింటిపై ఆసక్తి పెరిగి, కొత్త విషయాలు తెలుసుకుంటారు.
• ఆ ఆటలు ఆడుతున్నప్పుడు వాళ్లలో సంతృప్తి దొరుకుతుంది.
• నేర్చుకోవడానికి తగ్గ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.
• తెలివితేటలతో పాటు నైపుణ్యం, క్రమశిక్షణ అలవడుతుంది.
• ఈ పద్ధతి ప్రీ-ప్రైమరీ స్కూల్ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
• పిల్లలకు తమ తల్లిదండ్రులు, చుట్టుపక్కల మనుషులతో మంచి బంధం ఏర్పడుతుంది.
తల్లిదండ్రులు ఏం చేయాలి?
ప్రతి దానికి పక్కన ఉండి పిల్లలకు చెప్పాల్సిన పని లేదు. కానీ వాళ్ల ఆటలకు కావాల్సిన సామాన్లు సమకూరిస్తే చాలు. ముఖ్యంగా బొమ్మలు ఉండే పుస్తకాలు, బిల్డింగ్ బ్లాక్స్, జంతువులు- కూరగాయల ఆకారంలో ఉండే చెక్క బొమ్మలు, కిచెన్ సామాను బొమ్మలు వంటివి పిల్లలో క్రియేటివిటీ,
తెలివితేటలను పెంచుతాయి. అలాగే కొన్నిబొమ్మలు తీసుకుని, ఒకటి, రెండు... అంటూ నెంబరు నేర్పించొచ్చు. పాటలు పెట్టి డ్యాన్స్ నేర్పించడం ద్వారా వాళ్లలో ఉత్సాహాన్ని పెంచొచ్చు.