- పార్టీ మారుతున్నారనే వార్తలపై చంపయీ సోరెన్ కామెంట్
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత చంపయీ సోరెన్ ఆదివారం ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. దీనిపై మీడియా ప్రశ్నలకు ఆయన జవాబును దాటవేశారు. తొలుత తన సొంత పనుల కోసమే ఢిల్లీ వచ్చానని చెప్పారు. పార్టీ మారే విషయాన్ని తోసిపుచ్చారు. ఢిల్లీలో రాత్రి మరోమారు మీడియాతో మాట్లాడిన చంపయీ సోరెన్.. జేఎంఎంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని, జార్ఖండ్ సీఎం పదవి నుంచి అవమానకర రీతిలో దించేశారని ఆరోపించారు.
ఈ అవమానాలు భరించలేక ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నట్లు చంపయీ చెప్పారు. ప్రస్తుతం తన ముందు రాజకీయాల నుంచి రిటైర్ కావడం, సొంతంగా ఓ పార్టీ పెట్టడం, వేరే పార్టీలో చేరి ప్రజల కోసం పనిచేయడం.. మూడు ఆప్షన్లు ఉన్నాయన్నారు. కాగా, చంపయీ పలువురు బీజేపీ అగ్ర నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. గత రాత్రి కోల్‌కతాలో బీజేపీ నేత సువేంధు అధికారిని కలిశారని తెలిసింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కూడా చంపాయ్ టచ్‌లోనే ఉన్నట్లు సమాచారం. మరోవైపు, చంపయీ సోరెన్ వ్యవహారంపై జేఎంఎం చీఫ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందిస్తూ.. జేఎంఎం నేతలను బీజేపీ ప్రలోభ పెట్టి
పార్టీలో చేర్చుకుంటోందని మండిపడ్డారు.